జాతీయంరాజకీయాలుసంపాదకీయం

బ్యాంకు డిపాజిటర్ల మోములో ఆనందం

బడ్జెట్ లో ఈసారి అందరినీ అలరించింది ఏమైనా ఉందంటే అది డిపాజిట్లపై ఇన్సూరెన్సు ని ఒక లక్ష నుంచి అయిదు లక్షలకు పెంచటం. మనందరికీ గుర్తే ఉంటుంది. అరుణ్ జైట్లీ ఆర్దికమంత్రిగా ఎఫ్ ఆర్ డి ఐ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు డిపాజిటర్లలో విపరీతమైన ఆందోళన వచ్చింది. మా కష్టార్జితం అంతా బెయిల్ ఇన్ నిబంధనతో ఆవిరై పోతుందని భయపడ్డారు. ఎందుకంటే బ్యాంకుకు ఏదైనా అయితే బ్యాంకులు డిపాజిటు మొత్తం చెల్లించకుండా కొంత బ్యాంకు అప్పులు చెల్లించటానికి ఉపయోగించే నిబంధన ఉండటం భయపెట్టింది. వాస్తవానికి ఆ బిల్లు ఆ నిబంధన తీసేసి చూస్తే మంచి బిల్లే. అయితే ఆ నిబంధనతో అసలు బిల్లుకే చెల్లుచీటీ పాడారు. ఇది కేవలం విమర్శలను తట్టుకోలేక వెనక్కు తీసుకుందే .

అసలు ఆ బిల్లు అవసరం ఏమొచ్చింది? బ్యాంకింగ్ రంగం లో ఇటీవలి కాలంలో వచ్చిన అనేక మార్పులకనుగుణంగా వాటిని నియంత్రించటానికి ఒక రెగ్యులేటరీ చట్టం అవసరం ఏర్పడింది. అయితే అందులో బ్యాంకు సంక్షోభంలో వున్నప్పుడు దాని అప్పుల నుంచి చెల్లింపులు చేయాలనడం, అప్పుల్లో డిపాజిట్లను కూడా చేర్చటం తో డిపాజిట్లందరిలో తీవ్ర మానసిక ఆందోళన ఏర్పడింది. ఆ చట్టంలో డిపాజిట్ ఇన్సూరెన్సు పెంపుపై ప్రొవిజిన్ ఉందిగానీ ఎప్పుడు పెంచుతారో, ఎంత పెంచుతారనేది స్పష్టత లేదు. దానితో ఒక లక్ష రూపాయలపై నున్న డిపాజిట్లకు ముప్పు ఉండటంతో అందరూ భయపడ్డారు. చాలామందికి ఈరోజుకి అర్ధంకానిదేమిటంటే ప్రభుత్వరంగ బ్యాంకయినా , ప్రైవేటురంగ బ్యాంకయినా ఇన్సూరెన్స్ కి మించి వున్న డిపాజిట్లకు భద్రతలేదు. ప్రస్తుతానికి ప్రజలు ప్రభుత్వరంగ బ్యాంకులపై నమ్మకంతో వాటి ఆర్థికపరిస్థితి దెబ్బతిన్నా డిపాజిట్లను ఏకమొత్తంగా తీసుకోవటం జరగలేదు. అంతమాత్రాన అన్నిరోజులూ మనవికాదని మరిచిపోవద్దు. సాంకేతికంగా ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యతలేనప్పుడు ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగుతుందని గ్యారంటీ లేదు. అందుకే బిల్లు ని పూర్తిగా వ్యతిరేకించటం బాధ్యతారాహిత్యం. బెయిల్ ఇన్ నిబంధనను తప్పించి ఒక రెగ్యులేటరీ బిల్లుని తీసుకురావాల్సిన అవసరం ఎంతయినా వుంది. అందునా దాదాపు 30 శాతం పైగా ప్రైవేటురంగం వున్నప్పుడు.

దాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ బడ్జెట్ లో డిపాజిట్ ఇన్సూరెన్సు పెంచటం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనిపై ఎఫ్ ఆర్ డి ఐ బిల్లు ఆందోళన సమయంలో నేను స్పష్టంగా చెప్పాను . ముందు కావాల్సింది డిపాజిటర్లకు భద్రత అని. ఈ పరిణామం తో మనం బ్రెజిల్,అమెరికా ల తర్వాత ఎక్కువ డిపాజిట్ల శాతాన్ని కవర్ చేస్తున్న దేశాల సరసన చేరాము. ఇప్పటివరకు మొత్తం డిపాజిట్లలో కేవలం 28 శాతమే ఇన్సూరెన్సు వుంది. ఈ పెరుగుదలతో దాదాపు 40 నుంచి 50 శాతం డిపాజిట్లకు భద్రతా చేకూరటం సంతోషకర విషయం.మిగతావాటిలో ఎక్కువభాగం సంస్థలూ, ప్రభుత్వ నిధులూ వున్నాయి. వ్యక్తిగత డిపాజిట్ల శాతం తక్కువగానే ఉంటుంది. అయినా ముందు ముందు వ్యక్తిగత డిపాజిట్లన్నీ కవర్ కావాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు, సీనియర్ సిటిజెన్లకు ఈ పెంపుదల ఎంతగానో ఉపయోగపడుతుంది. 27 సంవత్సరాల తర్వాత ఈ పెంపుదల అదీ ఒకేసారి ఐదురెట్లు పెరగటం ముదావహం. దీనితో బ్యాంకులు చెల్లించాల్సిన ప్రీమియం ఒక్కసారి రెట్టింపునకు పైగా ఉంటుంది. పోయిన సంవత్సరం బ్యాంకులు 12043 కోట్ల రూపాయలు చెల్లించాయి. అదే ఈ పెరుగుదలతో షుమారు 28,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Read More: కరోనా వైరస్: చైనాలో కొనసాగుతున్న మరణ మృదంగం…

ఇప్పటికైనా డిపాజిట్ దారులు జాగ్రత్తపడాల్సిన అవసరం వుంది. ఒకరి పేరుమీద ఒక బ్యాంకులో 5 లక్షలకు పైబడి వుంచుకోవద్దు. అలా చేసేటట్లయితే మీ డిపాజిట్లు భద్రంగా ఉంటాయి. ఇప్పుడు పెరిగిన ప్రీమియం అదనపు చార్జీలు బ్యాంకులు కస్టమర్లపైనే రుద్దుతాయి కాబట్టి డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గే అవకాశముంది. ఈ పెరుగుదలతో కోఆపరేటివ్ బ్యాంకులు ఊపిరి పీల్చుకున్నాయి. రోజు రోజుకీ ప్రజలకు వాటిపై విశ్వాసం తగ్గటం తో వాటి మనుగడే ప్రశ్నార్ధకం అయ్యింది. దీనితో కనీసం 5 లక్షల వరకూ ఎక్కువ వడ్డీ పొందవచ్చునని డిపాజిటర్లు భావించే అవకాశం ఉండటం ఈ బ్యాంకులకు కలిసొచ్చిన అదృష్టం. అదేసమయంలో ప్రీమియం విషయంలో ఆర్థికవేత్తలు వ్యక్తపరిచే అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. రిస్కు ప్రొఫైల్ ని బట్టి ప్రీమియం విధించేటట్లయితే వాణిజ్య బ్యాంకులకు ప్రీమియం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆర్ధికంగా బాగున్న బ్యాంకులు తక్కువ ప్రీమియం , రిస్కు ఎక్కువగా వున్న బ్యాంకులు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికయితే పాత విధానం లోనే డి ఐ సి జి సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రోజునుంచే ఈ పెరుగుదల అమలుకావటాన్ని అందరూ ఆహ్వానిద్దాం.

Comment here