జాతీయంరాజకీయాలువారాంతపు ముచ్చట్లు

మన తెలుగింటి కోడలు నిర్మలమ్మ బడ్జెట్

అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ రానే వచ్చింది. మన తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్దికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టటం మనకందరికీ గర్వకారణం. అంటే మనకేదో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందనికాదు , మన తెలుగింటి కోడలన్నసంతృప్తి మాత్రమే. మన తెలుగువాళ్ళం అల్ప సంతోషులం కదా. ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రావటం తోటే అందరికీ ఇబ్బందిగా వుంది. మామూలుగా లోక్ సభ కు శనివారం సెలవు. ఈ సారి లోక్ సభ సెలవురోజు పనిచేయాల్సి రావటం మన ఎంపీలకు కొంచెం ఇబ్బందే. అలాగే బిజినెస్ పత్రికలకు ఆదివారం సెలవు . శనివారం బడ్జెట్ అయితే ఆదివారం పత్రికలు ప్రచురించాలి. అందుకు సిబ్బంది లోలోపల తిట్టుకుంటూ ఆఫీస్ కి రావాలి. వాళ్ళ కున్న సెలవు పోయినందుకు ఫిబ్రవరి 1 ని తిట్టుకుంటూ ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి బడ్జెట్ కి ముందే ఇన్ని కష్టాలుంటాయని ఎవరైనా ఊహించారా? మన ఎంపీలు, పత్రికా సిబ్బంది, జర్నలిస్టులు ఏమైనా మన ఇంటి ఆడపడచులా 24 గంటలూ, 365 రోజులూ పనిచేయటానికి. మన ఇంటి ఆడపడుచులు లాగా నోరుమెదపకుండా అహర్నిశం కష్టపడటం వాళ్లకు అలవాటులేదుకదా. ఈమధ్యనే మన ఇంటి ఆడపడుచుల బాధలు విన్నట్లుంది ప్రపంచ సంస్థ ఒకటి వీళ్ళ కష్టాలను ఏకరువుపెట్టింది. ఆక్స్ ఫార్మ్ అనే సంస్థ మన ఆడపడుచులు పడే కష్టాలకు కూడా వెలకట్టాలని చెప్పింది.ఇంటిపని కూడా ఎంత కష్టమో, దానివలన ఎంత ఉత్పత్తి విలువ పెరుగుతుందో మహిళల తరఫున వకాల్తా తీసుకొని ఏకరువు పెట్టింది. త్వరలో ఉద్యోగస్తుల జాబితాలో మన గృహిణులు కూడా చేరతారేమోమరి. అందుకనే ఇప్పట్నుంచే జాగ్రత్తపడి ఇంటి పని, వంట పని షేర్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. లేకపోతే మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదముంది జాగ్రత్త సుమా.

ఇక అసలు విషయానికొద్దాం. మరి సెలవు రోజు అందరినీ హడావుడి చేసినందుకు ఫలితముందంటారా. ఏమోమరి. ఫలితం ఉందోలేదో తెలియదుకానీ ప్రతి పదినిముషాలకొకసారి స్పీకర్ సార్ , ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుచేస్తూ చదివిందే మరలా రిపీట్ చేస్తూ మనల్ని దృష్టి మరల్చకుండా చేసిందండోయ్. అన్నిసార్లు అలాచెప్పటం, రిపీట్ చేయటం చూస్తే ఏదో స్కూల్లో పిల్లలకు పాఠాలు చూపినట్లు మాత్రం వుంది. ఎంతయినా పూర్వాశ్రమంలో బీజేపీ అధికార ప్రతినిధిగా ఇలా బల్లగుద్ది వాదించటం అలవాటు చేసుకుందికదా అందుకే ఆ అలవాటు పోనట్లుంది. మన నిర్మలమ్మ మాట్లాడుతుంటే చక్కటి ఇంగ్లీష్ ఉచ్చారణతో వినసొంపుగా ఉంటుందని మరిచిపోవద్దు. మొత్తం మీద బడ్జెట్ పుణ్యామా అని ఇంకో కొత్త విషయం తెలిసిందండోయ్. మన నిర్మలమ్మకు నాలాగే షుగర్ సమస్య ఉందంట. పాపం చివరలో షుగర్ శాతం పడిపోయి మాట్లాడలేక కూర్చుండిపోయింది.చివరి రెండుపేజీలు చదివినట్లే అనుకోమంది. మోడీ తో సహా అందరూ కొద్దిసేపు గాభరాపడిపోయారంట. మధ్యలో అప్పటికీ ఇంకో మంత్రి చాకోలెట్ ఇచ్చినా కుదుటపడలేదు. దాదాపు రెండు గంటల నలభయ్ అయిదు నిముషాలు మాట్లాడి రికార్డ్ సృష్టించింది. మనలాంటి షుగర్ వాళ్లకు అంత సుదీర్ఘ ఉపన్యాసం అవసరమా ? మధ్యలో మంచి నీళ్ల బదులు ఒక గ్లాస్ జ్యు స్ తీసుకొనివుంటే బాగుండేదేమో . షుగర్ వున్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలిమరి. అయినా మన నిర్మలమ్మ పట్టుదలను అభినందించకుండా వుండలేము సుమా . అంతా బాగానేఉందికానీ ఒక్క సలహా ఇద్దామనుకుంటున్నాను. బడ్జెట్ ప్రసంగం లో కాశ్మీరీ కవితను, తమిళ రచయితలను ఉటంకించినట్లు తెలుగింటి మెట్టినమ్మగా ఒక్క తెలుగు కవిత కూడా చదివుంటే తెలుగువాళ్లందరూ ఉబ్బి తబ్బిబయి పోయేవాళ్లు కదా. తెలుగు రాష్ట్రాలకు ఏమీ ప్రత్యేకంగా ఇవ్వకపోయినా కూడా సరిపెట్టుకొనేవాళ్ళు కదా.

ఇంతకీ బడ్జెట్ ను గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ ముచ్చట్లే ఎక్కువయ్యాయి. బడ్జెట్లో ఏముందోకన్నా ఈ కబుర్లే బాగుంటాయి కదా. బడ్జెట్ గురించి ఇప్పటికే పత్రికల్లో , టీవీ ల్లో ఊదర కొట్టి కొట్టి బుర్ర వేడెక్కిపోయివుంటుంది కదా. మరలా వాటిగురించి చెప్పి మీకు తలనొప్పి తెప్పించటం ఇష్టంలేకే. ఇప్పటికే బడ్జెట్ పై మీకో అభిప్రాయం ఏర్పడివుంటుంది మరలా నా అభిప్రాయం విన్నదగ్గర్నుంచీ నా మీద రుస రుసలాడే వాళ్ళు , బాగా ఉందనే వాళ్ళు రెండుగా విడిపోవటం నాకిష్టం లేదండోయ్. అందుకే ఈ వారాంతపు ముచ్చట్లలో సరదాగా నవ్వుతూ మాట్లాడుకుందామని ( బడ్జెట్ లో వార్తలకు నిరాశచెందిన వాళ్లకు కూడా ) ప్రశాంతంగా వుందామనే ఇలా టాపిక్ డైవర్ట్ చేశాను. ఎవరినీ నొప్పించటానికి కాదు, ముఖ్యంగా నిర్మలమ్మ గారిని. నమస్తే . వచ్చేవారం మరిన్ని ముచ్చట్లతో …..

–మీ రామ్

Comment here