తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

మునిసిపల్ ఫలితాలపై కెసిఆర్ ఆందోళన

తెలంగాణాలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు అందరూ తెరాస ప్రభంజనం గా వర్ణిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీలేదు. ఎన్నికలఫలితాలు తెరాస అనుకూలంగా వస్తాయని ఊహించిందే. అందునా స్థానిక ఎన్నికలు సహజంగా అధికారపార్టీకి అనుకూలంగా ఉంటాయి. దానితోపాటు స్థానిక ఎన్నికల్లో డబ్బులు, మద్యం వరదలై పారటం కూడా సర్వసాధారణమై పోయింది. చివరలో ముక్తాయింపుగా ఎక్స్ ఆఫీషియో సభ్యుల మేజిక్ తో ప్రతిపక్షాలు పూర్తిగా చతికిలపడ్డాయి. కెసిఆర్ రాజకీయ చాణక్యం ఇలా లేకపోతే ఎవరైనా ఆశ్చర్యపోవాలి. కాబట్టి తెరాస ప్రభంజనంలో విశేషమేమీలేదు.

అందరూ ఆసక్తిగా గమనించింది రెండో స్థానం ఎవరికొస్తుందని. ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా వుంది. ఈ ఎన్నికల్లో భిన్న ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చాలా దూరంగా రెండో స్థానం నిలబెట్టుకున్నా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది. ఉత్తర తెలంగాణాలో పోటీ ఏమైనా ఇస్తే అది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ పూర్తిగా మరుగునపడిపోయింది. దక్షిణ తెలంగాణ లో పాత నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం గట్టిపోటీ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బనే. రెండో పార్టీగా ఇన్నాళ్లనుంచి వున్న స్థానాన్ని నిలబెట్టుకోవటం కష్టమేననిపిస్తుంది. ఒకసారి రెండో పార్టీ కాదనే భావన ప్రజల్లో వస్తే ఇప్పుడున్న నాయకుల్లో ఎక్కువమంది జంప్ చేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ కి తెలంగాణాలో కష్టకాలం మొదలయ్యిందనిపిస్తుంది. పాపం సోనియా . తెలంగాణాని నమ్ముకొని ఆంధ్ర ని పూర్తిగా వదిలిపెడితే ఇక్కడా పరిస్థితులు అగమ్య గోచరంగా ఉండటం ఊహించని పరిణామం.

ఇక బీజేపీ విషయానికొస్తే గత లోక్ సభ ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానితో మున్సిపల్ ఎన్నికల్లో తెరాస కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. గెలిచిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కూడా తన పట్టు నిలబెట్టుకోలేకపోయింది. ఒక్క నిజామాబాదు కార్పొరేషన్ లో మాత్రమే చెప్పుకోదగ్గ ఫలితాన్ని సాధించింది. అదీ పక్కనే వున్న బైంసా గొడవల ప్రభావం ఉందని అనుకుంటున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ కార్పొరేషన్లలో కూడా రెండో పార్టీగా వచ్చినా అది అంత ప్రభావితం కాదు. మిగతా మునిసిపాలిటీల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే హైద్రాబాదు నగర శివారుల్లోని రెండు మూడు మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ కి ఆశాజనకంగా వున్నాయి. ఇది రాబోయే హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలకు సంకేతమా అని పరిశీలకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ రికార్డ్ నిరాశాజనకంగా లేదు, అదేసమయంలో ఊహించినంత ఆశాజనకంగా లేదు. మిశ్రమ ఫలితమని చెప్పొచ్చు. సరైన వ్యూహంతో వచ్చే నాలుగేళ్లు కష్టపడితే తెరాస కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో ఆసక్తికరం మజ్లీస్ ఫలితాలు. అదివరకటి ఒక మున్సిపాలిటీ కి ఇంకోటి జతకలిసి రెండు మునిసిపాలిటీల్లో పాగా వేసింది. దానితోపాటు అనేక కార్పొరేషన్లు , మునిసిపాలిటీల్లో గణనీయమైన స్థానాలు సంపాదించగలిగింది. నిశితంగా పరిశీలిస్తే తెలంగాణలోని ముస్లింలు ఒవైసీ ని తమ ప్రతినిధిగా గుర్తించారు. ఇది ప్రధాన స్రవంతి లో వున్న పార్టీలకు హెచ్చరికనే. ముఖ్యంగా తెరాస, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం అనుకూల పార్టీలుగా ముద్రపడినా ముస్లిం ప్రజానీకం ఒవైసీ నే తమ ప్రతినిధిగా గుర్తించారు. ఒకనాడు హైద్రాబాదు వరకే పరిమితమైన మజ్లీస్ ఇప్పుడు తెలంగాణ మొత్తం తన బేస్ వ్యాప్తిచేసుకోగలిగింది. ముస్లిం ఓట్లకోసం ఓవైసీ తో సఖ్యతగా వుండే కెసిఆర్ కు కూడా ఇది షాక్ ట్రీట్ మెంటే. ముందు ముందు కెసిఆర్ ఇంకా ఎక్కువగా ఒవైసీ పై ఆధారపడే పరిస్థితి వస్తుంది. అదేజరిగితే బీజేపీ కి లాభం జరిగే అవకాశం వుంది. ఒవైసీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎదగటానికి కావాల్సిన భూమికను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దానికి స్వంత రాష్ట్రం లో ఫలితాలు నైతిక బలాన్ని ఇచ్చాయి. తెరాస పైకి ఫలితాలపై ఆనందంగా వున్నా ఈ పరిణామం పై లోలోపల ఆందోళన చెందుతుంది. నిజామాబాదు, బైంసా లో జరిగినట్లు దీనివలన హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మొగ్గుతుందేమోనని ఆందోళన చెందుతుంది. ఒవైసీ తో దోస్తీ చేస్తే ముస్లింలు తెరాస కి మద్దతిస్తారని కెసిఆర్ తలిస్తే ఒవైసీ స్వంతగా బలపడటం కెసిఆర్ కి మింగుడుపడటంలేదు. ముందు ముందు ఈ పరిణామం ఎలా పరిణమిస్తుందో వేచి చూడాల్సిందే.

Read More: ఎమోషనల్ అయిన పవన్.. జేడీకి రాసిన లెటర్ చూస్తే మీరు కూడా…

Comment here