అత్యంత ప్రజాదరణ

కంటోన్మెంట్‌ బోర్డుపై బిజెపి దృష్టి!

మున్సిపల్‌ పోరులో హైదరాబాద్ శివారు పట్టణాలలో చెప్పుకోదగిన విజయాలు సాధించిన బిజెపి ఇప్పుడు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి ఎన్నికలపై దృష్టి సారిస్తున్నది. కంటోన్మెంట్‌ బోర్డుపై పార్టీ పతాకాన్ని ఎగురవేయడం కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నది. బోర్డు పాలక మండలి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించనున్న విషయమై ఆలోచించకుండా, పార్టీ పటిష్టత, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలని బీజేపీ ముఖ్య నాయకులకు, టిక్కెట్‌ ఆశిస్తున్న నేతలకు దిశ నిర్ధేశం చేసింది.

సికింద్రాబాద్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌లో గత శనివారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో బీజేపీ పరిస్థితి, ఓటర్ల నాడి, ప్రస్తుత పాలక మండలి సభ్యుల పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు తదితర అంశాల గురించి సమీక్ష జరిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, నగర శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, మాజీ మంత్రి విజయరామారావులు కంటోన్మెంట్‌కు చెందిన 8 వార్డుల ముఖ్య నేతలతో చర్చించారు.

ప్రస్తుతం ఉన్న పాలక మండలి పదవీ కాలం ముగిసినందున వెంటనే పాలక మండలిని రద్దు చేయాలని కొందరు నాయకులు సూచించారు. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. గడిచిన ఐదేళ్లుగా ప్రస్తుత పాలక మండలి సభ్యులు పెద్దగా అభివృద్ధి చేసింది లేదని, అధిక శాతం సభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికలు జరిగితే బీజేపీ చాలా వార్డుల్లో విజయం సాధిస్తుందని చెప్పారు.

మొత్తం 8 వార్డుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యులు….. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారని, అందుకే వారికి బోన్‌సగా ఆరు నెలలు పాటు పదవీ కాలం పొడిగించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసినందున కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలిని రద్దు చేసి, వీలైనంత త్వరగా ఎన్నికలు జరపడమో, లేదా, పాలక మండలిని రద్దు చేసి, బీజేపీకి చెందిన సభ్యుడ్ని నామినేట్‌ సభ్యునిగా నియమించడమో, అదీ కాకపోతే….. పాక మండలిని రద్దు చేసి, సీఈఓ పాలన తీసుకురావడమో చేయాలని కొందరు సూచించినట్టు తెలిసింది.

బోర్డు పాలక మండలి ఎన్నికలు పార్టీ చిహ్నాలతో జరిగితే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయని కొందరు నాయకులు చెప్పారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి, గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలు ఉండవని, అయితే….. వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తులు తీసుకువస్తే అధిక సీట్లు కైవసం చేసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని తీరును విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి యత్నించాలని, బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నాయకులకు పార్టీ పెద్దలు దిశ నిర్దేశం చేశారు.

Comment here