వారాంతపు ముచ్చట్లు

మన సంస్కృతిని మారుద్దామా?

 

ఇటీవలే తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. ఫలితాలు మొత్తం అధికార పార్టీ తెరాస కే దక్కాయి. అయితే ప్రజానీకానికి ఈ ఫలితాలు ఆశ్చర్యమేమీ కలిగించలేదు. ఎందుకంటే ఫలితాలు తెరాస కే అనుకూలంగా వుంటాయని ముందుగానే మానసికంగా ఫిక్స్ అయిపోయారు. అలారాకపోతేనే ఆశ్చర్యపోయేవాళ్లు. ఇందులో రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, తెలంగాణాలో తెరాస కి తిరుగులేదనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు పైకి ఒప్పుకోకపోయినా లోపల ఎక్కడో వాళ్ళ గుండెచప్పుడు టక్ టక్ మని అదే చెబుతుంది. రెండోది, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు ప్రధానపాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అది ఇప్పుడు తెరాస కే వుందని కూడా అందరికీ తెలుసు. స్థానికంగా డబ్బులు కూడబెట్టిన వాళ్ళందరూ ఏదోవిధంగా అధికారపార్టీకి దగ్గరవ్వటానికే ప్రయతిస్తారు. ముఖ్యంగా కెసిఆర్ రాజకీయ చాణక్యం తెలిసిన వాళ్ళెవరూ ఆయనతో గొడవపెట్టుకోవటానికి సాహసించరు. అంతమాత్రాన కేవలం డబ్బుతోనే గెలిచారనుకుంటే పొరపాటు. సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ కు తిరుగులేని నాయకుడనే భావం, రాజకీయ చాతుర్యం తో పాటు డబ్బులు కూడా పనిచేస్తాయి. అంతేగాని ఏ ఒక్క అంశం తోనో ఇటువంటి తీర్పు వచ్చిందనుకుంటే పొరపాటు.

ఈవారం మనం అన్ని విషయాలూ మాట్లాడుకోవటం కుదరదు కాబట్టి ఒకే అంశానికి పరిమితమవుదాము. అదేమిటంటే మన దేశ సంస్కృతి ని గురించి. సంస్కృతి అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. వేదాలు, రామాయణ, మహాభారతాల దగ్గర్నుంచి బుద్ధుడి వరకు వీలుంటే ఆ తర్వాత చరిత్ర గురించి కూడా జ్ఞాపకాలు సుడులు తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుకునేది అప్పటి సంస్కృతి గురించి కాదండి ఇటీవల స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన సంస్కృతి గురించి. ఎందుకంటే ప్రతిదేశానికి నడిచే సమాజంలో కొన్ని ప్రత్యేక సంస్కృతులు ఉంటాయి. వాటిని మనం అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూ ఉంటాం. ఉదాహరణకు జపాన్ లో కోపమొచ్చి నిరసన తెలపాలంటే ఎప్పటికన్నా ఎక్కువ గంటలు పనిచేస్తారని అప్పట్లో చదువుకున్నాం. అదెంతవరకు నిజమో తెలియదుగాని ప్రతిదేశపు సమాజాలు కొన్ని ప్రత్యేక సంస్కృతులు కలిగివుంటాయి. ఇప్పుడు మనం వున్న పరిమిత సమయంలో మన సమాజ సంస్కృతి గురించి మాట్లాడుకుందాం.

మనన్ని గురించిమనం తక్కువ చేసిమాట్లాడుకోకూడదుకానీ అప్పుడప్పుడూ ఇటువంటి ముచ్చట్లోనయినా నిజాలు మాట్లాడుకోక పొతే ఎట్లా? మనవాళ్ళు ప్రయాణించే అంతర్జాతీయ విమానాల్లో టాయిలెట్లు శుభ్రంగా ఉండవని ఆనోటా , ఈనోటా వింటుంటాము. దానిమీద ప్రముఖ ఆంగ్ల దిన పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చేవి. అది విన్నాడో ఏమోగానీ మోడీ తను అధికారంలోకి రాగానే ఢిల్లీ ఎర్రకోట నుంచి టాయిలెట్ల గురించి మాట్లాడి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఆరోజునుంచి అదో ప్రాధాన్య కార్యక్రమంగా ముందుకొచ్చింది. కొన్ని లక్షల టాయిలెట్లు ఐదేళ్లలో కట్టటం జరిగింది. ఇంతకీ చెప్పొచ్చేది కట్టటాన్ని గురించి కాదు. అవి ఎంతవరకు వాడుకలోకి వచ్చాయనేదే. దానికి సంబంధించిన లాజిస్టిక్ సమస్యలను గురించికాదు మాట్లాడేది. ప్రజల అలవాట్లగురించి. ఇంట్లో టాయిలెట్ వున్నా ఊళ్ళల్లో బయటకే వెళ్ళేవాళ్ళు వున్నారు. అది సౌకర్యానికి సంబందించినది కాదు, అలవాటుకి సంబందించిన మానసిక సమస్య. అవునా కాదా? దీన్ని మార్చటానికే స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద చేసిన ప్రచారం మంచి సత్ఫలితాలిచ్చింది. టీవీల్లో అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం, వాటిపై ఏకంగా సినిమాలే రావటం లాంటి అనేక కార్యక్రమాలు, ప్రముఖుల మద్దత్తు తో ఇన్నాళ్లు దేశం లో నడుస్తున్న ‘సంస్కృతి’ ని చాలా వరకు మార్చేసింది. చివరకు అత్తగారింట్లో టాయిలెట్ లేకపోతే పెళ్లి కాన్సిల్ అయిన సంఘటనలు కూడా పత్రికల్లో చదివాము. ఇది నా దృష్టిలో విప్లవాత్మకం. అంటే ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఉంటే మన ‘సంస్కృతి ‘ నే మార్చొచ్చని రుజువయ్యింది.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అటువంటి ‘సంస్కృతి ‘ ఇంకోటి కూడా స్వాతంత్రానంతరం సమాజంలో వేళ్లూనుకుంది. అది రాను రాను పెరిగిపోయిన ఎన్నికల్లో ధనప్రభావం. ఈ ‘సంస్కృతి ‘ ని మనం మార్చలేమా? మనిషి తల్చుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. మొదట్లో ఈ ‘సంస్కృతి ‘ తక్కువగానే ఉండేది. కానీ రాను రాను ఎలా అయిపోయిందంటే డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవటం అసంభవం అనేటంతగా. అయితే దానివల్లనే గెలుస్తున్నాడా అంటే కాకపోవచ్చు. కానీ అది గెలవాలంటే వుండే కనీస అర్హతల్లో ఒకటిగా మారిపోయింది. ఇది ఎక్కడిదాకా వెళ్లిపోయిందంటే పెళ్లిళ్లలో వచ్చినవాళ్ళకి భోజనాలు పెట్టటం ఎంత సంప్రదాయమో అంతగా అయిపోయింది. ఓటరు పోటీ చేసే ప్రతి అభ్యర్థి డబ్బులు పంచుతాడని ఆశించటం , దానికి తగ్గట్టుగానే అభ్యర్థులు రెడీ అయిపోవటం సర్వసాధారణమయిపోయింది. చట్టాలు , ఎన్నికల నిబంధనలు కాగితాలకే పరిమితం. ఇందులో ఒక పార్టీ అని లేదు అన్నీ ఆ తానులో ముక్కలే. కాకపోతే తరతమ భేదాలు. అయితే అన్ని రాష్ట్రాలకు ఈ జాఢ్యం పూర్తిగా పాకలేదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ లు ఇందులో ముందువరసలో వున్నాయి.

మరి ఏంచేద్దాం. ఈ జబ్బు కి చికిత్స లేదా? ఎవరికి వాళ్ళం గొణుక్కోవటం, నలుగురం ఒకచోటకూర్చున్నప్పుడు మాట్లాడుకోవటం తప్పిస్తే ఇంకేమీ చేయలేమా? స్వచ్ఛ భారత్ ప్రభుత్వమే చేపట్టింది కాబట్టి ఆపని సులువయ్యింది. కానీ ఎన్నికల్లో ధనప్రభావాన్ని తగ్గించటానికి రాజకీయపార్టీలు ముందుకొచ్చే అవకాశాలు లేవు. ముఖ్యంగా ప్రభుత్వం లోవున్నవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఆపని చేయరు. చేస్తే ఎన్నికల బాండ్ల లాగే ఉంటుంది. ఇది స్వచ్చంద సంస్థలే చేపట్టాలి. ఇటీవల డాక్టర్ జయప్రకాష్ నారాయణ చొరవతో రెండురోజుల వర్కుషాప్ జరిగింది. ఇది ద్విముఖు వ్యూహంతో ముందుకెళ్లాలి. ఒకటి చట్టాల్లో తీసుకురావాల్సిన సంస్థాగత మార్పులు ; రెండోది ప్రజల్ని స్వచ్ఛభారత్ లాగా చైతన్య పర్చటం. మనం రెండోదాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రజలు ఇది అవసరం అని గుర్తించటమే మనం చేయాల్సిన పని. ఒకసారి దీని అవసరాన్ని గురిస్తే తర్వాత ఎవరి అవసరం ఉండదు. దానికి కావాల్సిన ఉదాహరణలు చరిత్రలో ఎన్నో వున్నాయి. దీంట్లో ముఖ్యంగా యువత పాల్గొనగలగాలి. అప్పుడే ఇది విజయవంతమవుతుంది. ఇది రాజకీయ పార్టీలతో సాధ్యం కాదు. అందుకనే ఇది స్వచ్ఛభారత్ అంత తేలిక కాదు. అలాగని కష్టమూ కాదు. ఒకసారి అన్న హజారే వెనక ఉప్పెనలాగా నిలిచారు. మరలా అటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుంది. దీనికి కావాల్సిందల్లా స్ఫూర్తినిచ్చే నాయకత్వం, వాళ్ళ నిజాయితీ మీద యువతకి గురి కుదరటం. ఈ రెండూ జరిగే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. మరి అలవాటుగా మారిన మన ‘ సంస్కృతి ‘ ని మారుద్దామా?

By Ram

Comment here