బిగ్ స్టోరీస్

మూడు రాజధానుల ప్రతిపాదనలో లోతుపాతులు

మూడు రాజధానుల జగన్ ప్రకటన ఆంధ్ర రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అనుకూలంగా… ప్రతికూలంగా… వాదనలు, ప్రతివాదనలు జోరుగా సాగుతున్నాయి. ఒకటి రాజకీయాలు, రెండు ప్రాంతీయ వాదనలు రెండూ ఇందులో ఇమిడివున్నాయి. ఏదైనా జగన్ అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు దీనిపై ఓ స్పష్టత రాబోతున్నందుకు సంతోషం. ఎందుకంటే దాదాపు ఏడు నెల్లనుంచి అనిశ్చిత కొనసాగుతుంది. అమరావతిలో పనులు ఆగిపోయాయి. అక్కడ పొలాలిచ్చిన రైతులు గందరగోళంలో పడిపోయారు. స్థలాలు, ఇల్లు కొన్నవాళ్ళు నిరాశలో వున్నారు. ఇన్నాళ్లు సమస్యను గాలిలో పెట్టటం ప్రజల జీవితాలతో చెలగాటమాడుకున్నట్లే. ఇన్నాళ్టి కైనా సమస్య కొలిక్కి రావటం ముదావహం.

ఇక ప్రతిపాదనలోని యోగ్యతా యోగ్యతలు ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ సమస్య ఈ రోజుది కాదు. కేంద్రప్రభుత్వం కమిటీని నియమించినప్పటినుండి దీనిపై ఎవరివాదనలు వాళ్లకు వున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని మొదట్నుంచి ఆరోపణలున్నాయి. ఎక్కడపెట్టబోతున్నారో ముందుగా తన అనుయాయులకు ఉప్పందించి భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసేదానికి తోడ్పడ్డారనే ఆరోపణలు కొట్టివేయలేనివని తరువాత బయటకొచ్చిన ఆధారాలు నిరూపిస్తున్నాయి. అటువంటప్పుడు రాష్ట్రప్రభుత్వం కేవలం యోగ్యతలమీదే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పలేం.

రెండోది, అన్నింటికన్నా పెద్దతప్పు కొత్తగా ఓ మహానగరాన్ని నిర్మించాలనుకోవటం. అది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యమయ్యే పనికాదు. నగరాల అభివృద్ధి అప్పటి మార్కెట్ పరిస్థితులనుబట్టి ఆధారపడివుంటుందనే కనీస ఇంగిత జ్ఞానం చాలా అవసరం. అంతేగాని పరిమితవనరులతో మహానగరాన్ని నిర్మించాలనుకోవటం దుస్సాహసం, ఆచరణ సాధ్యంకాని పని. అది కేవలం కేంద్రీకృత వ్యవస్థల్లో మాత్రమే సాధ్యం. చైనాలాంటి కేంద్రీకృత రాజ్యాలు ఆ పని చేయగలవు. భారత్ లాంటి ప్రజాస్వామ్యదేశాల్లో పరిమితవనరులున్న చోట అది సాధ్యంకాదు. మరి అటువంటప్పుడు వున్న నగరాన్నే కొంత ప్రోత్సహిస్తే మహానగరంగా అభివృద్ధి అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆ అవకాశాలున్న నగరం ఒక్క విశాఖపట్నం మాత్రమే. ఎందుకంటే కొంతమేర కాస్మోపాలిటన్ వాతావరణం వున్న నగరం ఆంధ్రాలో అదొక్కటే. భౌగోళికంగా చూసినా అటు దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్ గఢ్ , ఉత్తర ఆంధ్రాలకు కూడలిగా ఉండటమే కాకుండా తూర్పు కోస్తాలో కోల్ కతా -చెన్నై ల మధ్య మేజర్ పోర్టు ఉండి , సైనికంగా కీలకమైన తూర్పు నేవీ కి ముఖ్యస్థావరంగా వుండి మిగతా మహానగరాల స్థాయిలో కాకపోయినా కొంతమేర మహానగర ఛాయలున్న ఏకైక నగరం విశాఖ. ఇప్పటికే అనేక ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థలకు కేంద్రంగా ఉండటం కూడా కలిసివచ్చే పరిణామం. పరిమితవనరులున్న ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది పెట్టుబడులతో మౌలిక సౌకర్యాలు అభివృద్దిచేస్తే మహానగరం కావటానికి విస్తృత అవకాశాలు ఉన్నాయనేది వాస్తవం.

మూడోది, గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పేంటంటే రాజధాని పేరుతో పరిపాలనా నగరాన్ని నిర్మించకుండా వాణిజ్యనగరాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయటం. ఒకసారి హైదరాబాద్ అనుభవంతో పెట్టుబడులు ఒకే చోటకాకుండా వికేంద్రీకరించాలని అందరు మేధావులు అభిప్రాయపడిన తర్వాత తిరిగి అదేతప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటం మిగతా ప్రాంతాలవారికి కోపం తెప్పించిందనటంలో ఎటువంటి సందేహంలేదు. చంద్రబాబు నాయుడే అనేకసార్లు ఈ విషయం గతంలో చెప్పటం జరిగింది. కానీ ఆచరణలో దానికి విరుద్ధంగా ప్రయాణం చేయటం జరిగింది. ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వం అప్పులుతెచ్చి మహానగరాన్ని నిర్మించటం కాదు, పరిపాలనకు కావాల్సిన కనీస వసతులతో పరిపాలన సాగిస్తూ మిగతా మౌలిక వసతులు, సాగు, తాగు నీటి సౌకర్యం లాంటి పనులకు ప్రాధాన్యమిచ్చి నిధులుకేటాయిస్తే ప్రజల కొనుగోలుశక్తి పెరిగి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు మెగా నగరాలగురించి ఆలోచించవచ్చు. కాబట్టి కేవలం పరిపాలనా కేంద్రానికే పరిమితమయితే భూమిమీద నడిచినట్లుంటుంది. లేకపోతే గాలిలో మేడలు కట్టినట్లుగానే ఉంటుంది.

నాలుగోది, చారిత్రక నేపధ్యం, ప్రాంతీయ ఆకాంక్షలు. అదేంటోగాని ఆంధ్ర ప్రజలు మొదట్నుంచి తమ అస్తిత్వంకోసం పోట్లాడుతున్నా ఫలితం మాత్రం అందని ద్రాక్ష లాగానే ఉంటుంది. బ్రిటిష్ హయాంలోనే స్వతంత్ర ప్రావిన్స్ కావాలని కోరుకున్నా కాంగ్రెస్ నాయకత్వం అందుకు సహకరించలేదు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ఉద్యమంలో పాల్గొనటంతో దానిముందు తమ ప్రాంతీయ ఆకాంక్షలు వెలిబుచ్చే అవకాశం లేకపోయింది. కానీ సైమన్ కమిషన్ ప్రతిపాదనలతో ఏర్పాటైన 1935 చట్టంలో ఒడిశా కు బెంగాల్ నుంచి విడదీసి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. ఆ తర్వాత స్వాతంత్య్రానంతరం పొట్టి శ్రీరాములు త్యాగంతో కాంగ్రెస్ నాయకత్వం దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయటం జరిగింది. దానికిముందుగా ఆంధ్ర-రాయలసీమ ప్రాంతీయ భావాలకనుగుణంగా శ్రీ భాగ్ ఒప్పందం జరిగింది. దానిప్రకారం రాజధాని కర్నూల్ లో, హైకోర్టు గుంటూరు లో ఏర్పాటుచేయడం జరిగింది. అంటే అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొన్ని షరతులతో జరిగిందని మరిచిపోవద్దు. ఇప్పటి ప్రాంతీయ ఆలోచనలకు అప్పుడే బీజాలు పడ్డాయి. కాబట్టి రాజకీయనాయకత్వం సమస్యను సున్నితంగా నడపాలి. దురదృష్టం అలా జరగకపోవటం తిరిగి ప్రాంతీయ వాదనలు బలపడటానికి దోహదం చేసాయి. ఇదే తెలంగాణలోనూ పెద్దమనుషుల ఒప్పందం అమలుచేయకపోవడంతో జరిగింది. అదే ఇప్పుడూ పొరపచ్చాలు పెరగటానికి కారణమయ్యింది. ఒకరిమీద ఇంకొకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేయటంతోనే అసలే అతుకులబొంతగా వున్నఐక్యత దెబ్బతిన్నది. ఉత్తరాంధ్ర, రాయలసీమవాసుల్ని కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్ర నాయకత్వం మీద వుంది. గతాన్నుంచైనా పాఠాలు నేర్వకపోవటం ఆంధ్ర నాయకత్వలోపం.

1. మహానగరం కొత్తగా ప్రభుత్వ డబ్బులతో నిర్మించాలనుకోకుండా వున్న విశాఖపట్నం నగరాన్ని పరిమితవనరులతో అభివృద్ధిచేయటం 2. పరిపాలనా నగరాన్ని వాణిజ్యనగరంతో మిళితంచేయకుండా పరిపాలనా కేంద్రం వరకే పరిమితం కావటం 3. గత చారిత్రక నేపధ్యం దృష్ట్యా ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించటం

ఈ విధానాలకు అనుగుణంగా వుండాలంటే మూడుప్రాంతాలను , మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించే ప్రతిపాదనలు ముఖ్యం. అందులో భాగంగా కర్నూలు లో హై కోర్టు ఏర్పాటుచేయడం చాలా అవసరం. ఎందుకంటే మద్రాస్ లో నుండి విడిపోవటానికి ఇష్టపడని వారిని ఒప్పించి శ్రీ భాగ్ ఒప్పందం చేసుకున్న స్ఫూర్తిని కొనసాగించకపోతే రాయలసీమ ప్రజలని వంచించినట్లే అవుతుంది. హై కోర్టు ఏర్పాటు తో శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తిని పూర్తిగా అమలుచేయలేకపోయినా హైకోర్టు ఏర్పాటుతో కొంతయినా వాళ్లకు న్యాయం చేసిన వాళ్లవుతారు. ఇంతవరకు అన్నిప్రాంతాలవాళ్ళకు ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు.

సమస్యల్లా అమరావతి, విశాఖ మధ్య అధికార విభజనతోనే. జగన్ ప్రతిపాదించిన శాసన , కార్యనిర్వాహక విభజన ఎంతవరకు ఆచరణ సాధ్యమనేది పరిశీలించాల్సిన అవసరం వుంది. విశాఖపట్నానికి అన్ని వసతులు ఉన్నాయనేది వాస్తవమే . కానీ అది రాష్ట్రానికి ఓ మూల ఉందనే వాదన వినబడుతుంది. కానీ అది వాస్తవం కాదు. ఉత్తరాంధ్ర వాళ్లకు హై కోర్టు పనులకోసం కర్నూలు వెళ్ళటం ఎంత కష్టమో రాయలసీమ వాళ్లకు విశాఖపట్నం రావటం అంతే కష్టం. రెండింటిలో తేడా ఏమీ లేదు. భౌగోళికంగా అందుబాటులో ఉండటమనేది ఒక అంశమే గానీ దాన్ని బట్టే రాజధానీ ఉండాలని కోరుకోవటం హేతుబద్ధతకాదు. మన దేశ రాజధాని మనకు అందుబాటులో లేదు. తమిళనాడు రాజధాని ఓ మూలవుంది. కేరళ రాజధాని తిరువనంతపురం, కర్ణాటక రాజధాని బెంగుళూరు లు కూడా మధ్యలో లేవు. కాబట్టి దానిమీద ఆధారపడి మాత్రమే నిర్ణయం తీసుకోజాలము. రెండోది, దాదాపు 30 వేల ఎకరాలు రైతులనుంచి సేకరించటం జరిగింది కాబట్టి అక్కడనే రాజధాని ఉండాలి. ఇదీ సహేతుకం కాదు. కాకపోతే రైతులకు అన్యాయం జరగకూడదు. రైతులు అక్కడ రాజధాని కడతామంటేనే భూమి ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ ఆశలను రాజకీయమార్పిడితో నిరాశచేశారు. దీని పూర్తిగా కొట్టివేయలేము. అక్కడనుంచి కార్యనిర్వాహక కేంద్రాన్నితరలించేముందు వాళ్ళ ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది. ఇక మూడోది ముందు ముందు ఇలా రాజకీయ అధికారమార్పిడి జరిగినపుడల్లా రాజధాని మారదని గ్యారంటీ ఏమిటి? దీనికీ ప్రభుత్వం సమాధానమివ్వాలి. చివరి రెండు అంశాలు సరైనరీతిలో సంతృప్తి పరిచిన తర్వాతే కార్యనిర్వాహక కేంద్రాన్ని విశాఖకు తరలించాలి. అలాకాకుండా అధికారమార్పిడి జరిగినప్పుడల్లా నిర్ణయాలు మారుతుంటే ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నట్లేనని గుర్తించాలి.

చివరగా చెప్పేదేంటంటే విశాఖపట్నాన్ని వాణిజ్య రాజధానిగా మార్చటానికి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చటం ప్రాధాన్యతా అంశాల్లో ఒకటికావాలి. దానికి మహానగరంగా మారే అవకాశాలు మెండుగా వున్నాయి. రెండోది, కర్నూలు లో హైకోర్టు ఏర్పాటుచేయటం పై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. మూడోది, అమరావతి, విశాఖమధ్య పరిపాలనా విభజనపై మరికొంత అధ్యయనం చేసి వీలైనంత విస్తృత అభిప్రాయాన్ని సేకరించి అందరితో కాకపోయినా ఎక్కువమంది అభిప్రాయంతో ఈ పని చేయాలి. దీనిలో రాజకీయాలకన్నా రాష్ట్రప్రయోజనాలను దృష్టిలోవుంచుకొని అన్ని పార్టీలు వ్యవహరించాలి. ప్రభుత్వంలో వున్న వైస్సార్సీపీ ఇందుకు చొరవ తీసుకోవాలి. అలా అయితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. లేకపోతే తిరిగి రాష్ట్రాన్ని అందరూకలిసి అంధకారంలోకి తీసుకెళ్తారు. ఇది గమనించి విజ్ఞతతో వ్యవహరిస్తారని ఆశిద్దాం.

Comment here