గెస్ట్ కాలమ్జాతీయంరాజకీయాలు

బిజెపిని ఇరకాటంలో పడవేసిన శ్రీశ్రీశ్రీ రవిశంకర్

పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను చేర్చకుండా ఆ మతం వారిని వెలివేస్తున్నారని అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలకు ఒకవంక సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న బిజెపి నేతలకు ఉచిత సలహా ఇచ్చి వారికి `సానుభూతి పరుడు’గా పేరొందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ ఇరకాటంలో పడవేశారు.

పాకిస్తాన్‌లో పీడనకు గురవుతున్న ముస్లింలను కూడా పౌరసత్వ సవరణ చట్టంలో చేర్చాలని సంచలన ప్రతిపాదన చేశారు. ఓ జాతీయ ఛానల్‌లో జరిగిన ‘సమ్మిట్ 2020’ సదస్సులో ఆయన మాట్లాడారు.

‘పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశానికి అత్యావశ్యకం. పాకిస్తాన్‌లో ముస్లింలలోని ఓ వర్గం తీవ్ర పీడనకు గురవుతున్నారు. మనం వారి గురించి కూడా ఆలోచించాలి. వారి దేశంలో పీడనకు గురవుతుంటే భారతదేశంలో ఆశ్రయం కల్పించడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా ఆయన ఇలాంటి సంచలన ప్రతిపాదనే కేంద్రం ముందు పెట్టారు. దేశంలో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా భారత పౌరసత్వం కల్పించాలని ఆయన సూచించారు.

‘‘సీఏఏలో శ్రీలంకీయులను కూడా చేర్చాలని సూచించా. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రచారం చేసి దాదాపు ఒక కోటి సంతకాలను కూడా దీనికి మద్దతుగా సేకరించాం. 35 సంవత్సరాలుగా జీవిస్తున్న శ్రీలంక శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించాలి’’ అని డిమాండ్ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.

అయితే ప్రస్తుత చట్టం కేవలం చారిత్రకంగా దేశ విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని సరిచేయడం కోసమే అని, మిగిలిన వారు భారత పౌరసత్వం పొందడానికి ప్రస్తుతం ఉన్న చట్టం సరిపోతుందని ప్రభుత్వం చెప్పడం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ చేసిన వాఖ్యలు రెండు నెలలుగా జరుగుతున్న నిరసన ఉద్యమాలలో ఆజ్యం పోసిన్నట్లే కాగలదు.