తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

తెలంగాణ రాజకీయం ఇంకో మూడు రోజులు ఉత్కంటే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి . అయితే ఫలితాలకోసం ఇంకో మూడురోజులు ఉత్కంఠగా ఎదురుచూడక తప్పదు . పోలింగ్ సరళిచూస్తే గ్రామీణ ప్రాంతాలు 2014 కన్నా అధికంగా ఓటు వేశారు .అదేసమయంలో హైద్రాబాదులో పోలింగ్ మునుపటికన్నా తగ్గింది . ఆశ్చర్యకరంగా పాతబస్తీప్రాంతంలో ఓటింగ్ బాగా తగ్గింది. అలాగే ఆంధ్ర మూలాలువున్న ప్రాంతంలో పోయినసారికన్నాపెరిగిందనే చెప్పాలి. అయితేఅదేమీ అంతగణనీయంగా లేదు. ఈ పోలింగసరళిని ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. కాకపోతే పాతబస్తీ లో గణనీయంగా తగ్గటం ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి.

 

ఇంతకుముందెప్పుడూ ఇటువంటి పరిణామం చోటుచేసుకోలేదు. ఇది ఎన్నికలకమిషన్ సమర్ధంగా వ్యవహరించటంవలన జరిగిందా లేక పాతబస్తీ ముస్లింప్రజల ఆలోచనల్లో మార్పువచ్చిందో వేచిచూడాల్సిందే. రెండోది హైద్రాబాదులో ఓటింగ్ తగ్గటానికి ప్రజలు గ్రామాలకు తరలివెళ్లటం ఒక కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి వీళ్ళలో ఎక్కువమందికి రెండుచోట్ల ఓటువుంది. మరి ఒకవ్యక్తి కి ఒకే ఓటు అనే నిబంధన ఖచ్చితంగా అమలుచేసే యంత్రాంగం లేదు. అదే ఆంధ్రమూలాలువున్న ప్రజలు కూడా అటు ఆంధ్రాలో ఇటు హైద్రాబాదులో ఓటు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళు ఆంధ్రాలో ఎన్నికలులేవుకాబట్టి ఇక్కడే ఓటు వేసినట్లు తెలుస్తుంది. మరి ఈలోపాన్ని సరిచేయాలంటే ఎన్నికల కమిషన్ కి అంత తేలికకాదు. ఇక గ్రామీణప్రాంతంలో ఎక్కువ పోలింగుపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారు తమకు అనుకూలమని వాదిస్తున్నారు. ఇదీ స్థూలంగా పోలింగ్ సరళి.

 

ఇక ఎగ్జిట్ ఫలితాలు ఇంకా ఉత్కంఠతని రేపాయి. మొత్తం జాతీయ చానళ్ళు తెరాస గెలుస్తుందని చెబితే లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పింది. ఓ విధంగా ఇది రాజగోపాల్ సర్వే విశ్వసనీయతకు సవాలు. ఇంతకుముందు తనుచేసిన సర్వేలు వాస్తవఫలితాలకు దగ్గరగా ఉండటంతో రాజగోపాల్ సర్వేని కొట్టివేయలేని పరిస్థితి. కాకపోతే తనసర్వే తప్పించి మిగతా అన్నీ తెరాస ఘంటాపధంగా గెలుస్తాయని చెబుతున్నాయి. దీనితో ఇరుపక్షాలూ తామే గెలుస్తామనే ఆశతో వున్నాయి. అలాగే ప్రజలుకూడా సందిగ్దావస్థలో ఉండిపోయారు.

ఒకవేళ తెరాసగెలిస్తే

కేసీఆర్ తిరుగులేని నాయకుడుగా ఎదగటం ఖాయం. ఓ మమతా బెనర్జీ లాగా , నవీన్ పట్నాయక్ లాగా, అరవింద్ కేజరీవాల్ లాగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పటం జరుగుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తనపాత్ర పెరిగే అవకాశంఉంది. తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేయటంలో గణనీయమైన పాత్ర పోషించే అవకాశముంది. ఇది ఆసమయంలో కాంగ్రెసుకి దెబ్బే.

 

రెండోది చంద్రబాబునాయుడు రాజకీయభవితవ్యం ప్రస్నార్ధకంగా మారుతుంది. దీని ప్రభావం ఆంధ్రాలో జరిగే ఎన్నికలపై ఉంటుంది. తను ఆత్మరక్షణలో పడాల్సివస్తుంది.

ఒకవేళ ప్రజాకూటమి గెలిస్తే

ఇది దేశ రాజకీయాల్లో కాంగ్రెసుకు, ప్రాంతీయంగా చంద్రబాబునాయుడుకి లబ్ది చేకూరుతుంది. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ నాయకత్వం బలపడటానికి , అదేసమయంలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకుడుగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే ఆంధ్రా విషయానికి వస్తే చంద్రబాబునాయుడుకి నైతికబలం చేకూరుతుంది. అంతేకాకుండా ఆంధ్రాలో కాంగ్రెసుతో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం మెరుగవుతుంది. అయితే అది ఏమేరకు ఉపయోగపడుతుంది, ఆంధ్రా ప్రజలు విభజనలో కాంగ్రెస్ పాత్ర నేపథ్యంలో ఈ కలయికను ఏమేరకు అంగీకరిస్తారు అనేది చర్చనీయాంశమే . ఇప్పటివరకు ఆంధ్రా తెలుగుదేశంలో కాంగ్రెస్ కలయికను వ్యతిరేకించే క్యాడర్ ని ఒప్పించటానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్రాలో ముక్కోణపు పోటీ ఖాయమయింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం జరగాలని చంద్రబాబునాయుడు కోరుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ క్యాడర్ లో కూడా ప్రజాకూటమి విజయం సాధిస్తే ఇప్పుడున్న వ్యతిరేకత తగ్గి తెలుగుదేశంతో కలిసి వెళ్ళటానికి సుముఖత ఏర్పడుతుంది.

 

అందుకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రా రాజకీయాలు ఈ ఫలితాలతో ప్రభావితమవుతాయి . అందుకనే ఏం జరుగుతుందోనని ఫలితాలకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అందరం మూడు రోజులు వేచిచూడక తప్పదు.

— రామ్