మిర్చి మసాలా

కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం!

కరోనా వైరస్ ప్రభలుతున్న వేళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే కరోనా పై వదంతులు వ్యాప్తి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటోంది.

ఈ ప్రచారం నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. అంతేకాదు అసత్య ప్రచారాలు చేసిన వారికి కరోనా వస్తోందని శాపనార్థాలు పెట్టారు.

సిఎం కెసిఆర్ హెచ్చరించిన మరునాడే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయం కోరినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

తెలంగాణా రాష్ట్రంలోకి ఆర్మీ అడుగుపెట్టిందని అసత్య ప్రచారం చేశారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా రెడ్ జోన్‌ గా ప్రకటించలేదు.

మద్యం దుకాణాలను తెరుస్తారని కూడా జోరుగా ప్రచారం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎవరు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఈ ప్రచారం సాగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దీంతో కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోమారు హెచ్చరించినట్లైంది.

Back to top button