జాతీయంరాజకీయాలు

ఆ 15 లక్షల మంది సంగతి తేల్చవలసిందే!

ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థలు దిగ్బంధనం కావడంతో కొత్తగా దేశంలోకి కరోనా వైరస్ కేసులు వచ్చే అవకాశం దాదాపుగా లేదు. దేశంలోపల సహితం ఈ వ్యాధి ఉద్భవించిన దాఖలాలు కూడా లేవు. కేవలం విదేశాల నుండి వచ్చిన వారికి సోకడం, అది బయటపడక వారు యధావిధిగా తిరుగుతూ ఉండడంతో వారి కుటుంభం సభ్యులకు, వారికి సన్నిహితంగా వచ్చిన వారే రోజు రోజుకు పాజిటివ్ కేసులుగా బయటపడుతున్నాయి.

అందుకనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత రెండు నెలల్లో, జనవరి 18 నుండి మార్చ్ 23 వరకు, విదేశాల నుంచి దేశంలోకి 15 లక్షల మంది వచ్చారని గుర్తించింది. కాబట్టి వారందరిని గుర్తించి, వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం ద్వారా దీనిని కట్టడి చేయవచ్చని నిర్ణయానికి వచ్చింది.

అయితే వీరిలో పది శాతం మందికి కూడా ఇప్పటి వరకు పరీక్షలు జరపలేదు. పరీక్షలు జరిపిన వారిలో సహితం చాల తక్కువ మందిని మాత్రమే స్వీయ దిగ్బంధనంలో ఉంచారు. దానితో వీరందరిని గుర్తించి కోవిద్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కోరుతూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా లేఖలు వ్రాసారు.

కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ 15 లక్షల మందిపై గట్టి నిఘా ఉంచాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అయితే వారితో పాటు వారి కుటుంభం సభ్యులు, వారి ఈ రెండు నెలల్లో వారితో సన్నిహితంగా తిరిగిన వారిపై నిఘా ఉంచవలసిన అవసరం ఉంది. అంతటి సార్ధ్యం మన వైద్య వ్యవస్థకు ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ సహితం విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది . కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని కోరింది.

మరోవంక, మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం ఎదుర్కొనే ఇబ్బందులు కేంద్ర, రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరి సంఖ్య కోట్ల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాల్సి ఉంది.

వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల భారీ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉచితంగా ఆహారం అందేలా చూడాలని కోరింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, అద్దె వసతి గృహాలకు నిత్యావసరాలు అందేలా చూడాలని సూచించింది. విద్యార్థులు, వర్కింగ్ వుమెన్‌కి నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది.

ఈ దిశలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీల పాత్ర వహించేందుకు అడుగులు వేస్తున్నప్పటికీ ఆచరణలో ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడవలసి ఉంది.