తెలంగాణరాజకీయాలు

50 వేల కరోనా టెస్టుల నిర్ణయం వెనుక కారణం మీదేనా?


తెలంగాణలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో తొలినాళ్లలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితయ్యయాయి. కరోనా పరిస్థితి కట్టడిలోనే ఉందనే ప్రభుత్వం కూడా భావించింది. అయితే గత రెండువారాలుగా తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలకు కూడా అన్నిరంగాలకు అనుమతులను ఇచ్చింది. తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉన్న ఏప్రిల్‌ వరకు 941 కేసులు నమోదయ్యాయి. కాగా జూన్ నెలలో గత రెండు వారాల్లోనే 2276 కేసులు నమోదవడం ఆందోళన కలిగింది. కేసులు సంఖ్య జీరోకు వెళుతుందని అనుకున్న దశ నుంచి మళ్లీ కేసులు భారీగా నమోదవుతుండటం చూస్తుంటే వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సహా ఐదు జిల్లాల్లోని 30నియోజకవర్గాల పరిధిలో 50వేలు టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయివేట్ ల్యాబుల్లోనూ కోవిడ్ పరీక్షలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రయివేట్ ఆసుపత్రిల్లో వైద్యం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా టెస్టులు పెద్దఎత్తున నిర్వహించాలని ప్రజలు ఎప్పటి నుంచి కోరుతున్న ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణలో ఇప్పటివరకు 40వేలమందికి టెస్టుగా నిర్వహించగా ఏపీలో 5 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలోనూ టెస్టుల సంఖ్య పెంచాలనే డిమాండ్ వచ్చింది. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చికిత్స అందించడం చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ సర్కార్ ట్రేస్.. టెస్ట్.. ట్రీట్మెంట్ ను ఇన్నాళ్లూ ఐసీఎంఆర్ మార్గదర్శకాల పేరుచెప్పి టెస్టుల అంశాన్ని పక్కనపెట్టింది. అదేవిధంగా కొన్ని కేసుల్లో ఎవరి వల్ల కరోనా సోకిందనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసులు ఎక్కువ నమోదు కాకుండా ఉండేందుకు టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Back to top button