జాతీయంరాజకీయాలుసంపాదకీయం

స్వాతంత్ర భారతావని లో 9 చారిత్రక తప్పిదాలు

సమయం ఆగకుండా ఎప్పటిలాగే గడిచిపోతుంది. లాక్ డౌన్ తో మన పనులకు ఫులుస్తాప్ పడిందిగానీ సమయానికి కాదు. చరిత్రలో ఎన్నింటిని వీక్షించిందో గదా. భూమి పై జీవరాశి పుట్టిన దగ్గర్నుంచి అదెలా పరిణామం చెందుతూ వచ్చిందో వీక్షిస్తూనే వుంది. అలాగే భారత్ దాస్య సృంఖాల నుంచి విముక్తిపొందిన విధానం అప్పటినుంచి ఇప్పటిదాకా మారుతున్న పరిణామాలు కూడా అలుపెరగకుండా వీక్షిస్తూనే వుంది. ఈ 73 సంవత్సరాల భారత్ ఎలా పురోగమనం చెందిందో ఎక్కడక్కడ తప్పుటడుగులు వేసిందో కూడా గమనిస్తూనే వుంది. ఈ తప్పటడుగులే లేకపోతే ఇంకా ఎంతగా ఎదిగేదో కూడా సమయానికి తెలుసు. తెలియందల్లా మనకే మిత్రమా. ఆ తప్పటడుగులేమిటో స్థూలంగా ఒక్కసారి పరిశీలిద్దామా.

చారిత్రక తప్పిదాలు 

  1. దేశ విభజన : మన పుట్టుకే లోపంతో జరిగింది. అప్పటిదాకా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కలిసివున్న భారతావని మతం పేరుతో విభజనకాబడటమే అన్నిటికన్నా పెద్ద తప్పు. మత రాజకీయాలకు అప్పుడే బీజం పడింది. పుట్టుక లో లేని భేదం, జాతి లో లేని తేడా, మతం పేరుతో నువ్వు వేరు, నేను వేరు అనటంలోనే అన్నింటికన్నా పెద్ద చారిత్రక తప్పిదం జరిగింది. మానవాళికి మచ్చ తెచ్చింది. ప్రపంచం లో ఎక్కడా కేవలం మతం కోసం విడిపోయిన సంఘటన చరిత్రలో లేదు. ఇది బ్రిటీష్ వాడు వాడి స్వార్ధం కోసం, ‘గ్రేట్ గేమ్’ లో భాగంగా వెళుతూ వెళుతూ మనకిచ్చిన ‘ బహుమతి’. అది తప్పని 1971 కి అందరికీ అర్ధమయ్యింది. అయినా రావణా కాష్టంలా అది పశ్చిమ సరిహద్దులో కాలుతూనే వుంది. రావణా కష్టం ఆరినా ఈ చిచ్చు ఆరేటట్లు లేదు.
  2. సామాజిక విభజన : బ్రిటీష్ వాడు పెట్టిన చిచ్చు నుండి మనం బయట పడలేదు. మన పెద్దలు సెక్యులర్ రాజ్యాంగాన్ని తయారుచేసి మతాన్ని ప్రభుత్వాన్నుంచి వేరుచేసినా చివరలో వుమ్మడి పౌర సంస్కృతి పై రాజీపడి క్షమించరాని తప్పు చేశారు. ఆ పాపమే మనల్ని ఈ రోజుకీ వెంటాడుతుంది. నీ మతం వేరు, నా మతం వేరు అనే భావన చివరకు నువ్వు వేరు, నేను వేరు అనేదాకా ఈ రోజు వచ్చిందంటే అది ఆ రోజు మన రాజ్యాంగ పెద్దలు వేసిన బీజమే. ఆధునిక ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ముందుగా పౌరులందరూ ఒక్కటనే భావం బలపడాలి. అది బలపడాలంటే జాతి, కుల, మత బేధ భావం అంతరించాలి. లేకపోతే ఆధునిక ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు. యూరప్ లో వచ్చిన పునరుజ్జీవన ఉద్యమం పునాదిగా మొట్టమొదట ఏర్పడిన ప్రజాస్వామ్య రిపబ్లిక్ అమెరికా. అక్కడ జాతి విభేదాన్ని , లింగ అసమానతల్ని నిర్మూలించక పోయినా మత గుర్తింపు ఆధార సామాజిక విభజనను అంతమొందించారు.  మరి మనమేం చేశాం. మతం పేరుతో వేరు వేరు పౌర చట్టాల్ని చేశాం. అదేమన కొంపముంచింది. అదే భారతదేశం నుంచి అమెరికా నో , ఇంగ్లాండో , జర్మనీ నో, ఫ్రాన్సో, ఆస్ట్రేలియా నో వెళితే అక్కడ వున్న వుమ్మడి పౌర చట్టాల కిందనే పనిచేస్తాము. అక్కడలేని అభ్యంతరం మన దేశం లో ఎందుకో అర్ధం కాదు. అంబేద్కర్ మహనీయుడు హిందూ చట్టాలను సంస్కరించి ఉండకపోతే కనీసం ఈ మాత్రమయినా సమాజం వుండేది కాదు. సంప్రదాయవాదులు అప్పుడూ దాన్ని వ్యతిరేకించారు. అయినా మన రాజకీయ నాయకత్వం ధైర్యంగా ముందడుగు వేసింది. అదే వుమ్మడి పౌర చట్టం విషయం లో తోకముడిచింది. ఆ విభజనే ఈ రోజు ఏకు మేకై గుర్తింపు రాజకీయాలను పెంచి పోషిస్తుంది.
  3. కాశ్మీర్ విభజన : 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం జరిగిన కాశ్మీర్ విలీనాన్ని తుంగలోతొక్కి ప్రజల కోరిక మేరకు అనే  కొత్త అంశాన్ని ( చట్టం లో లేక పోయినా) , ఎటువంటి అధికారం లేకపోయినా ప్రచారం చేయటం క్షమించరాని చారిత్రక తప్పిదం. చట్టబద్ధంగా విలీనమైన  భూభాగాన్ని దుండగులు ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఐక్యరాజ్యసమితి కి  నివేదించటం, తర్వాత ఐక్యరాజ్యసమితి దాన్ని ‘ వివాదం’ గా చేస్తే కిమ్మనకుండా కూర్చోవటం కన్నా పాలకుల వైఫల్యం చరిత్రలో ఇంకేముంటుంది. అసలు చట్టం లో లేని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐక్యరాజ్యసమితి కి నివేదించటం కన్నా ఘోర తప్పిదం ఇంకేముంటుంది? ఆ అధికారం చట్టం లోని ఏ నిబంధన కింద వుందో ఇన్ని సంవత్సరాల తర్వాత నైనా ఎవరైనా చెప్పగలరా? మిగతా అన్ని సంస్థానాలు ప్రత్యేక రాజ్యాంగాలు లేకుండా భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటామని తీర్మానం చేస్తే అదేపని చేయటానికి కాశ్మీర్ మహారాజు తో మంతనాలు జరిపి ఒప్పించకుండా ( ఆ పనికి మహారాజు ఒప్పుకునే అవకాశం వుండేది) అధికారం లేని వ్యక్తుల సలహాలతో ప్రత్యేక రాజ్యాంగానికి బాటలు వేయటం తో అక్కడి ప్రజలకి మేము వేరు అనే భావన కలగటానికి పాలకులే కారణమయ్యారు. ఇది కూడా చారిత్రక తప్పిదమే. కాశ్మీర్ వేర్పాటువాదులకు ఇది ఆయుధంగా మారింది.
  4.  చైనా తో సంబంధాలు : చైనా మనకన్నా రెండు సంవత్సరాల తర్వాత జపాన్ ని ఓడించి, అంతర్యుద్ధం నుంచి బయటపడి పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. అది ప్రజాస్వామ్య దేశంగా కాకుండా ప్రపంచం లోనే అతి పెద్ద కమ్యూనిస్టు దేశంగా అవతరించింది. ఈ పరిణామాన్ని భారత్ మనస్పూర్తిగా ఆహ్వానించింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో చైనా వైఖరిని అంచనా వేయటం లో పెద్ద తప్పే చేసింది. చైనా మాటలను గుడ్డిగా నమ్మింది. ఐక్యరాజ్యసమితి లో తైవాన్ స్థానం లో కమ్యూనిస్టు చైనా ని తీసుకోవాలని కోరింది. అదేసమయం లో చైనా టిబెట్ ని ఆక్రమించుకుంటే మిన్నకుంది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన భూబాగం ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రహస్యంగా ఆక్రమించుకుంటే కనీసం తెలుసుకోలేకపోయింది. చివరకు భారత్ పై యుద్ధానికి దిగిందాకా చైనా ని నమ్ముతూనే వుంది. చైనా తో వున్న సరిహద్దు తగదాలని పరిష్కరించుకోవటానికి వ్యూహాత్మకంగా టిబెట్ వ్యవహారాన్ని వాడుకొని వుండాల్సింది. టిబెట్ చైనా లో అంతర్భాగమని ఒప్పుకోకుండా వుండాల్సింది. అన్ని తురుపు ముక్కలు వదులుకొని చైనా ని పైన కూర్చోబెట్టింది. ఆ తర్వాత చైనా మనన్ని దెబ్బతీయటానికి నాగా వేర్పాటువాదుల్ని, ఇతర ఈశాన్య భారత వేర్పాటు వాదుల్ని , అంతర్గత తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఒకవైపు ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ లోపల , బయట వున్న ప్రతిపక్ష నాయకులూ మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి చైనా ని గుడ్డిగా నమ్మటం పెద్ద చారిత్రాత్మక తప్పిదం. అది తెలుసుకునే టప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
  5. ప్రాధమిక విద్య నిర్లక్ష్యం చేయటం : చైనా ని అమితంగా అభిమానించే నాయకత్వం వారు అమలుచేసిన విద్యా సంస్కరణలను గుర్తించలేదు. మొదట కావాల్సింది సంపూర్ణ అక్షరాస్యత అనే సత్యాన్ని గ్రహించటానికి అర్ధ శతాబ్దం పట్టింది. అంటే అర్ధ శతాబ్దం వెనకబడ్డట్టే కదా. కిందనుంచి పైకి అనే సూత్రం బదులు పైనుంచి కిందకు అనే సూత్రాన్ని పాటించబట్టే ఈ గ్రహణం  పట్టింది. దానితో 72 సంవత్సరాల తర్వాత కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయాం. ఇది సమాజ పురోగమనానికి ప్రతిబంధకంగా తయారయ్యింది. ఈ చారిత్రక తప్పిదాన్నుంచి మేలుకొని గత రెండు దశాబ్దాలనుంచి అంగలు వేస్తున్నాము. త్వరలో మన లక్ష్యానికి చేరువవుతామని ఆశిద్దాం.
  6. తప్పుడు పారిశ్రామిక విధానం : విద్యావిధానం లో లాగే పారిశ్రామిక విధానం లోనూ తప్పిదాలు చేస్తూ వచ్చాం. మొదట్లో బొంబాయి ప్లాన్ పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త చొరవతో మొదలైన పారిశ్రామిక విధానం రాను రానూ పురోగతి లో పయనించే బదులు తిరోగమనం లో పయనించింది. చిన్న, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి బారీ పరిశ్రమల పైనే దృష్టంతా పెట్టింది. అదీ కేవలం ప్రభుత్వ రంగం లో మాత్రమే. మొదట్లో పెట్టుబడిదారి దేశాలు రాజకీయంగా పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్ కి వ్యతిరేకంగా వుండటం వాస్తవమే అయినా ఆర్ధికరంగం లో తర్వాత దశలోనైనా ఆ దేశాల పెట్టుబడులను ఆహ్వానించే చర్యలు చేపట్టలేదు. దక్షిణ కొరియా, ఆ గ్నేయేసియా దేశాలు ఆ అవకాశాల్ని అందిపుచ్చుకున్నాయి. తర్వాత దశలో డెంగ్ షియవోపింగ్ నాయకత్వాన చైనా మార్కెట్ ఆర్ధిక వ్యవస్థ లోకి మారి ప్రపంచపెట్టుబడులను  ఆహ్వానించినా మనం మాత్రం మడికట్టుకోని కూర్చున్నాము. చివరకు తప్పని పరిస్థితుల్లోనే 1991 లో సరళీకృత విధానాన్ని పాటించటం మొదలుపెట్టాం. అంటే దాదాపు అర్ధ శతాబ్దం మిగతా ప్రపంచం తో వెనకబడ్డామన్న మాట. లేకపోతే ఇప్పటికి చైనా తో సమాన స్థాయి లోనైనా వుండేవాళ్ళం. మనం చేసిన తప్పుడు ప్రయోగాలు సంస్కరించుకోవటానికి తీసుకున్న సమయం అతి విలువైనదని మరచిపోవద్దు.
  7. వ్యవసాయ రంగంలోనూ ఎన్నో తప్పిదాలు : వ్యవసాయ రంగం లో అధికోత్పత్తి సాధించటానికి, స్వయం సమృద్ధి సాధించటానికి , ఆధునీకీకరణ పద్ధతులు అవలంబించటానికి తీసుకున్న చర్యలు ఈ రోజుకీ ప్రపంచ స్థాయికి చేరుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత కూడా ప్రయోగాల దశలోనే వున్నాం. ఇప్పుడిప్పుడే ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి. ముందుగా చెప్పాలంటే ఉత్పత్తి స్థాయి ఆకుపచ్చ విప్లవం తర్వాత పెరిగినా ఇప్పటికీ ప్రపంచ స్థాయికి చాలా దిగువున వున్నాం. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థని నిర్మించుకోలేకపోయాం. అధునాతన వ్యవసాయం అప్పటికన్నా మెరుగైనా  ప్రపంచ స్థాయి తో పోలిస్తే చాలా వెనకబడి వున్నాం. భారీ సంస్కరణలు చేపట్టే ధైర్యం రాజకీయ నాయకత్వానికి లేకుండా పోయింది. ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించినా మనకున్న సానుకూల పరిస్థితుల్లో ఇంకా ఎంతో చేయాల్సి వుంది.
  8. సాంస్కృతిక , చారిత్రక వ్యవహారాల్లో తప్పిదాలు: ముందుగా చెప్పాల్సివస్తే మన చరిత్ర ని వక్రీకరించిన విధానాన్ని గురించి చెప్పాలి. ఉదాహరణకు మన ఆధునిక చరిత్రలో స్వాతంత్ర పోరాటం గురించి పూర్తి వక్రీకరణలు చోటుచేసుకోవటం చూశాం. భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర పోరాట యోధుల్ని కించపరిచే విధంగా , నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నడిపిన పోరాటాన్ని పూర్తిగా విస్మరించే విధంగా , మొత్తం స్వాతంత్ర పోరాట చరిత్రలో కాంగ్రెస్ తప్పితే మిగతా వాళ్ళు చేసిన త్యాగాలని విస్మరించటం ఒకటేమిటి అన్నీ వక్రీకరణలే. పాత చరిత్ర చూసినా ఈ గడ్డమీద జరిగిన వీరోచిత పోరాటాల్ని తక్కువ చూపించటమో, విస్మరించటమో జరిగింది. చరిత్ర ని సరిగ్గా చూపించటమే కాకుండా దాన్నుంచి ప్రతి భారతీయుడు ప్రేరణ పొందేలా వుండాలి. ఇక సాంస్కృతికంగా  చూస్తే మనకున్న వారసత్వం బహుకొద్ది దేశాలకు మాత్రమే వుంది. మనదేశం లో జన్మించిన బౌద్ధం విశ్వవ్యాప్తం చెందింది. అయినా  ఆ వారసత్వ సంపదని ప్రపంచానికి చెప్పటం లో , వాళ్ళను మనదేశానికి రప్పించటం లో చేయాల్సింది ఎంతో వుంది. ప్రతిదేశానికి వాళ్ళ జాతీయ వాదమే వాళ్ళ బలం. ఏ పురాతన వారసత్వం లేకపోయినా అమెరికా తన జాతీయ వాదాన్ని బలంగా ప్రజల మనస్సులో నాట గలిగింది. కమ్యూనిస్టు దేశమైన చైనా ఈరోజు ఇంత  బలంగా ఉండటానికి ఓ కారణం వారి జాతీయవాదం. మరి ఎంతో చారిత్రక, సాంస్కృతిక వారసత్వం గల భారత్ ఇటీవలిదాకా దాన్ని ఉపయోగించుకొని దేశాన్ని బలోపేతం చేయటం లో ఎంతో వెనక బడింది. ఇదికూడా ఓ చారిత్రక తప్పిదమే.
  9. కొన్ని తప్పుడు పోకడలు : చివరగా చెప్పాల్సివస్తే భారత్ లో రెండు విషయాలు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకటి అవినీతి విలయతాండవం చేయటం. ప్రపంచం లోని ఎక్కువ అవినీతికర దేశాల్లో భారత్ వుండటం సిగ్గుచేటు. దీనికి బీజాలు మొదట్లోనే పడ్డాయి. అధికారం లో ఎక్కువ కాలం వున్న పార్టీ రాజకీయ నాయకత్వం మొదట్నుంచీ అవినీతి విషయం లో చూసి చూడనట్లు ఉండటమే ప్రధాన కారణం. అప్పుడే కనుక కఠిన చర్యలు తీసుకొని వుండివుంటే మిగతావారికి ఓ హెచ్చరికగా వుండేది. కానీ అందులో ఉదాసీనత తో వ్యవహరించటం తో సమాజం మొత్తం కలుషితమై ఇప్పుడు నీతి, నిజాయితీలు కాగడా వేసి వెదికినా కనబడకుండా అయిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. కాకపోతే కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ మాత్రమే.  అలాగే రెండోది వారసత్వ రాజకీయాలు. ఇందుకూ ప్రధాన కారణం గ్రాండ్ ఓల్డ్ పార్టీ బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే ఆ పార్టీ వునికే ప్రస్తుతం దానిపై ఆధారపడివుంది. ఇది ప్రజాస్వామ్యం బలహీనపడటానికి దారితీస్తుంది. ఇది దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలలో వుంది.  ఆధునిక ప్రజాస్వామ్యం మనుగడ కు  ఈ పోకడలు అడ్డంకులని  ప్రజలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ప్రజాస్వామ్యం బలపడుతుంది.ఇవి సంపూర్ణమని అనుకోవటం లేదు. స్థూలంగా లాక్ డౌన్ లో కూర్చొని ఆలోచిస్తుంటే అప్పుడి కప్పుడు మనసుకి తట్టినవి మీ ముందుంచు తున్నాను. ఇలాంటి ఆలోచనలు ఇంకా చాలా మంది దగ్గర వుంటాయి. అవన్నీ ఒకరి కొకరు పంచుకుంటే  మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. మరి ఇన్ని చారిత్రక తప్పిదాలున్నా భారత్ అప్రతిహతంగా ముందుకు సాగుతుందంటే ఈ తప్పిదాలే లేకుంటే ఇంకెంత అద్భుతంగా మన ప్రగతి ఉండేదో ఆలోచించండి. ఇప్పటికైనా మనకున్న పెద్ద సంపద మన ప్రజాస్వామ్యమే. భావ స్వేచ్చ, వాక్స్వాతంత్రం , సహన భావం , సౌహార్ద్రత లే మనల్ని , మనదేశాన్ని కాపాడుతాయని బలంగా విశ్వసిస్తున్నా.సమయం ఈ ఆలోచలని కూడా తనలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతూనే వుంది. చరిత్ర నడుస్తూనే వుంటుంది. అందులో మనం సూత్రదారులం కాదు పాత్రధారులం మాత్రమే .