తెలంగాణరాజకీయాలు

షర్మిలకు, విజయమ్మకు ఏబీఎన్ దిక్కయిందా..!

‘‘శత్రువుకి.. శత్రువే మిత్రుడు’’ అన్నట్లు.. ఒకప్పుడు ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి అంటే వైఎస్‌ ఫ్యామిలీకి పడేది కాదు. ఇప్పటికీ ఏబీఎన్‌ది అదే ధోరణి అనుకోండి. వైఎస్‌ రాజేశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా కూడా ఆ రెండు పత్రికలు.. ఆ రెండు పత్రికలు అంటూ సంభోదించేవారు. ఆ రెండు పత్రికలు ఏంటివో అందరికీ తెలిసిందే. అందులో ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. అంతటి బద్ధ శత్రుత్వం కలిగిన మీడియా హౌజ్‌ ఇప్పుడు వైఎస్‌ ఫ్యామిలీకి చేరువైంది.

ఆంధ్రజ్యోతి వైఎస్సార్‌‌ హయాం నుంచి కొనసాగిస్తున్న శత్రుత్వాన్ని ఆయన కొడుకు జగన్‌ మీద కూడా చూపింది. జగన్‌ జైలులో ఉన్నప్పుడు.. తర్వాత ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు వడ్డించింది. ఆయన అధికారంలోకి రాకుండా ఎనో ప్రయత్నాలు చేసింది. మొదటి విడతలో విఫలమైన జగన్‌.. సెకండ్‌ విడతలో మాత్రం సక్సెస్ అయ్యారు. విపక్ష పార్టీలు.. ‘పచ్చ’ పత్రికలు ఎన్ని కుట్రలు పన్నినా ఆయన సునాయసంగా విజయం సాధించారు.

ఇప్పుడు ఏపీలో జగన్‌కు ‘సాక్షి’ మీడియా ఒకటే సపోర్టుగా నిలిచింది. ఎందుకంటే.. అది కూడా ఆయన సొంత మీడియా కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక్కటే అధికార పార్టీ మీడియా. ఏపీలో జగన్‌ ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతిని ఏనాడో పక్కన పెట్టేశారు. ఒకవిధంగా ఆ రాష్ట్రంలో బహిష్కరణ కొనసాగిస్తున్నారు. అలాంటి మీడియా ఇప్పుడు వైఎస్‌ షర్మిలతోపాటు ఆమె తల్లి విజయమ్మకు ప్రధాన మీడియా అయింది.

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిలకు ఇప్పుడు ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి ఏ పేపర్లలో కనిపించని కవరేజీ ఇస్తోంది. తమ వార్త కవరేజీకి వీరికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఒకటే దిక్కయింది. ఏబీఎన్‌ను పిలిచి మరీ స్పెషల్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందిరా పార్కు వేదికగా జరిగిన షర్మిల ఉద్యోగ దీక్ష కూడా ఆద్యంతం ఇతర మీడియాలు పెద్దగా పట్టించుకోకపోయినా.. ఏబీఎన్‌ మాత్రం ఎప్పటికప్పుడు లైవ్‌ కవరేజీ ఇచ్చింది. చివరలో పోలీసులు వచ్చి దీక్ష భగ్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున కవర్‌‌ చేసింది. పోలీసులు అతి చేశారని.. అలాగే లీడర్లతోపాటు విజయలక్ష్మి స్పందనను కూడా వెంటవెంటనే ప్రసారం చేశారు. ఇది ముందు ముందు ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి మరి.

Back to top button