ప్రత్యేకంబిగ్ స్టోరీస్

భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. చంద్రునిపై స్థలం..?


సాధారణంగా భర్తలు భార్యలకు పెళ్లి రోజు కానుక అంటే నగలు, చీరలు ఇస్తుంటారు. అయితే ఒక భర్త మాత్రం భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేశారు. పెళ్లిరోజున భార్యకు చంద్రునిపై 3 ఎకరాల స్థలం ఇచ్చారు. రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన ఒక వ్యక్తి భార్యపై ప్రేమను చూపిన విధానం నెట్టింట వైరల్ అవుతోంది. భర్త ఇచ్చిన కానుక గురించి తెలిసి భార్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే అజ్మీర్ కు చెందిన ధర్మేంద్ర, సప్న దంపతులకు పెళ్లై చాలా సంవత్సరాలే అయినా ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ. డిసెంబర్ 24వ తేదీ పెళ్లిరోజు కావడంతో భార్యకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని ధర్మేంద్ర భావించారు. అనుకున్నదే తడవుగా లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ను సంప్రదించి చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. చాలారోజులు కష్టపడి స్థలం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి పెళ్లిరోజున ఆ పత్రాలను భార్యకు అందించారు.

అందరిలా బహుమతులు ఇస్తే కొత్తదనం ఉండదని భావించి చంద్రునిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చానని ధర్మేంద్ర వెల్లడించారు. ఊహించని కానుక దక్కటంపై సప్న స్పందిస్తూ భర్త తాను ఊహించని కానుక ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని.. ఇలాంటి కానుకను భర్త ఇస్తాడని తాను కలలో కూడా అనుకోలేదని ఆమె అన్నారు.

రాజస్థాన్ నుంచి చంద్రునిపై భూమి కొన్న తొలి వ్యక్తి ధర్మేంద్రనే కావడం గమనార్హం. నిజానికి చంద్రునిపై భూమి కొనడం సాధ్యం కాదు. కానీ కొన్ని వెబ్ సైట్లు ఔత్సాహికుల తృప్తి కోసం చంద్రునిపై స్థలాలు అమ్ముతాయి. గతంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. బీహార్ కు చెందిన నీరజ్ కుమార్ కూడా చంద్రునిపై స్థలాన్ని కొనుగోలు చేశారు.

Back to top button