జనరల్వ్యాపారము

గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వాళ్లకు అలర్ట్.. నవంబర్ నుంచి కొత్త నిబంధనలు..?


దేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ ఖరీదు ఎక్కువే అయినప్పటికీ వంట త్వరగా చేసుకోవడానికి వీలు ఉండటంతో ఎక్కువమంది గ్యాస్ సిలిండర్ ను వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి నియమనిబంధనలు మారుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తున్నాయి.

గ్యాస్ సిలిండర్ల డెలివరీలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ మోసాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో కంపెనీలు నియమనిబంధనల్లో మార్పులు చేశాయి. గ్యాస్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ కొత్త హోమ్ డెలివరీ సిస్టమ్ కు డీఏసీ అని పేరు పెట్టింది. డీఏసీ అనగా డెలివరీ అథెంటికేషన్ కోడ్. ఇకపై గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే కోడ్ ను డెలివరీ బాయ్ కు చెప్పాల్సి ఉంటుంది.

మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని గ్యాస్ వినియోగదారులు డెలివరీ బాయ్ దగ్గర ఫోన్ లో ఉండే యాప్ లో నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే మొబైల్ నంబర్ ను లేదా అడ్రస్ ను తప్పుగా ఇస్తారో వాళ్లు మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. కొన్ని సందర్భాల్లో వీళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉండవు. మొదట దేశంలోని 100 పట్టణాల్లో ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

అనంతరం దేశమంతటా ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను గతంలోలా సులువుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మారిన నిబంధనలు తెలుసుకోని పక్షంలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Back to top button