ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

మ‌రి, పులివెందుల యురేనియం సంగతేంటీ?

ఇప్పుడు ఏపీలో చ‌ర్చ జ‌రుగుతున్న అంశాల్లో ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యం కూడా ఉంది. చిత్తూరు జిల్లాలోని అమ‌ర‌రాజా ఫ్యాక్ట‌రీ కాలుష్యం వెద‌జ‌ల్లుతోంద‌ని ప్ర‌భుత్వ చెబుతోంది. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు సైతం ఇదే విష‌య‌మై న్యాయ‌స్థానంలో నివేదిక ఇచ్చింది. అయితే.. కేవ‌లం అమ‌రరాజా ఫ్యాక్ట‌రీ మీద‌నే కాలుష్య ఆరోప‌ణ‌లు ఉన్నాయా? మిగిలిన ఫ్యాక్టరీల మీద కూడా ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది.

ఈ ఫ్యాక్ట‌రీ కాలుష్యాన్ని వెద‌జ‌ల్లుతోంద‌నే కార‌ణంతో అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. ఇందులో ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య త‌ప్ప‌.. వాస్త‌వం లేద‌నేది వారి కంప్లైంట్‌. ఇందుకు పులివెందుల లోని యురేనియం ప్లాంట్ నే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. అక్క‌డి ప్లాంట్ వ‌ల్ల తీవ్ర‌మైన కాలుష్యం వెద జ‌ల్లుతోంద‌ని ఎంతో కాలంగా స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని చెబుతున్నారు.

2008లో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పులివెందుల‌లో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప‌లు చోట్ల యురేనియం ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని భావించినా.. స్థానికులు అభ్యంత‌రం చెప్ప‌డం వ‌ల్ల‌నే.. పులివెందుల‌లో ఏర్పాటు చేయించార‌ని అంటున్నారు. క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని తుమ్మ‌ల‌ప‌ల్లిలో ఈ ప్లాంట్ ఉంది. ఈ యురేనియం ప్లాంట్ వ‌ల్ల విప‌రీత‌మైన కాలుష్యం ఉత్ప‌త్తి అవుతోంద‌ని, స‌మీపంలోని పొలాల‌న్నీ నిర్వీర్యం అయిపోయాయ‌ని చెబుతున్నారు.

అనేక మంది దీర్ఘ‌కాలిక రోగాల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని తేలింద‌ని గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేకే కొట్టాల‌, క‌నంప‌ల్లె ఊళ్ల‌ను పూర్తిగా ఖాళీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టుగా కూడా చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ.. ఈ యురేనియం ఫ్యాక్టరీకి అనుబంధంగా రెండో ప్లాంట్ ను ఏర్పాటు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని, మొద‌టి ప్లాంట్ ను కూడా విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. త‌ద్వారా.. రోజుకు 9 వేల ట‌న్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేసే టార్గెట్ తో యూసీఐఎల్ యాజ‌మాన్యం ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు.

ఇంత జ‌రుగుతున్నా ప‌ట్టించుకోని వైసీపీ సర్కారు.. అమ‌ర‌రాజా ఫ్యాక్ట‌రీపై పొల్యూష‌న్ పేరుతో చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డం ఏంట‌ని అడుగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫ్యాక్ట‌రీపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంద‌ర్భం కూడా లేద‌ని అంటున్నారు. ఇదంతా ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న దాడిగా చెబుతున్నారు. త‌మ‌కు అనుకూలంగా లేనివారిపై దాడులు చేస్తూ.. అనుకూలంగా ఉన్న‌వారిని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నార‌ని, ఇందుకోసం ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను కూడా వినియోగించుకుంటున్నార‌ని ఆరోపిస్తున్నారు.

Back to top button