ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వంద రోజులు దాటిన అమరావతి రైతుల ఉద్యమం

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతులు ప్రారంభించిన ఉద్యమం వంద రోజులు దాటింది. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించా లంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు నెలల తరబడి చేస్తున్న ఉద్యమం గురువారం వందరోజులకు చేరుకొంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు.

ప్రపంచ చరిత్రలోనే ఎరుగని విధంగా భవ్యమైన రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల సారవంతమైన భూములను ఉచితంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆ రాజధానిని మూడు రాజధానుల పేరుతో తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో దిగ్బ్రాంతికి గురై ఈ ఉద్యమం చేపట్టారు. అసమాన త్యాగాలు చేసిన రైతులను కనీసం చర్చలకు కూడా ప్రభుత్వం ఆహ్వానించకుండా, ఉద్యమకారులను `పైడ్ ఆర్టిస్ట్’లు అంటూ అధికార పక్షం వారే ఎగతాళి చేసే విధంగా వ్యవహరిస్తూ వచ్చారు.

మధ్యలో ఒకసారి నరసరావుపేట ఎంపీ ఎల్ కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి ప్రతినిధిగా అంటూ వచ్చి, వారి సమస్యలు విని, ముఖ్యమంత్రికి నివేదిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆయన ఆ ఉద్యయం వైపు చూడనే లేదు. అధికార పక్షానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు గాని, జిల్లా మంత్రులు గాని ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో 100వ రోజున భారీఎత్తున నిరసన తెలపాలని అమరావతి జేఏసీ నాయకులు భావించారు.

తొలుత పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే హై కోర్ట్ మొట్టికాయలు వేయడంతో పోలీసులు కొంచెం వెనుకడుగు వేశారు. కరోనా పేరుతో శిబిరాలు ఖాలీ చేయమని ఆరోగ్య శాఖతో నోటీసులు ఇప్పించారు. అది కూడా ఫలించలేదు. ఈ ఉద్యమంలో మహిళలు ముందుండి, నిరసనాలలోనే కాకుండా పోలీస్ దమననీతిని కూడా ఎదుర్కోవడం విశేషం. వంద రోజులలో అనేక రీతులలో ఉద్యమాలు జరిపి, దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

అయితే కరోనా వైరస్ ఉదృతి కారణంగా ప్రస్తుతం చెప్పుకోదగిన రీతిలో ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేయకపోయినా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొంటూనే నిరసనలను కొనసాగిస్తున్నారు. దీక్షాశిబిరాలలో పరిమితసంఖ్యలో, మనిషికి మనిషికి మద్య దూరం పాటిస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు జరుపుతున్నారు.

ప్రతిపక్షాలు సహితం దీక్ష శిబిరాల వద్దకు వచ్చి మొక్కుబడిగా మద్దతులు తెలపడమే గాని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎటువంటి సహకారం అందించడం లేదు. కనీసం ఇతర ప్రాంతాలలో ఈ ఉద్యమానికి సంఘీభావంగా నిరసనలు తెలిపే ప్రయత్నం కూడా చేయడం లేదు. దానితో ఒంటరిగా ఒక వంక న్యాయపోరాటం, మరోవంక రాజకీయ పోరాటం జరుపుతున్నారు.

ఉద్యమం 100వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, రైతుకూలీల మృతి పట్ల సంతాప సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. పలు గ్రామాల్లో ఇళ్ళల్లోనే ఉండి రైతులు నిరసనలు తెలిపారు. అమరావతి ఉద్యమంలో మృతి చెందినవారిని స్మరిస్తూ గురువారం రాత్రి ఇళ్ళ దగ్గర రైతులు 7.30 గంటల నుంచి 8వరకు కొవొత్తులు వెలిగించారు.