ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఆ జీవోను రద్దు చేసిన హైకోర్టు..!


రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగుతూనే ఉన్నాయి. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగులు వేయడంపై మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా జీవోను కోర్టు దిక్కరణగా ఎందుకు భావించకూడని ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది. మే 28వ తేదీ లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో అనంతరం కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు చెప్పిందని 623 జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం చేసిన చింతపాటి సోమయాజులు తెలిపారు.

గతంలో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని, ఎటువంటి రంగులు వేయాలనేదానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టును సమర్థిస్తూ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 623 జీవోను జారీ చేసింది. మూడు రంగులకు పైన టెర్రా కోట్(మట్టిరంగు) రంగును బార్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. పైగా ఈ మూడు రంగులు దేనికి సంకేతమో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మళ్లీ అవే రంగులు ఎంపిక చేసి జీవోను ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. జీవో 623 పై దాఖలు అయిన ఫీల్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా ఈ రోజు హైకోర్టులో దీనిపై వాదనలు జరిగాయి.