ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలకు శుభవార్త.. గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామ సచివాలయాలలో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇకపై కొత్త ఆధార్ కార్డ్ కావాలన్నా, ఆధార్ కార్డ్ లోని వివరాలను మార్చుకోవాలన్నా గ్రామ సచివాలయాల ద్వారా ఆ వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. జూలై రెండోవారంలో సీఎం జగన్ ఈ సేవలను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా ఈ విషయాలను వెల్లడించారు. మొదట 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

ఆ తరువాత దశల వారీగా రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయాలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భరత్ గుప్తా మాట్లాడుతూ ఏపీలో 226 మండలాల్లో ప్రస్తుతం ఆధార్ సేవలు అందుబాటులో లేవని ఈ మండలాల్లో మొదట ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ మండలాలతో పాటు జిల్లాకు 20 చొప్పున అదనంగా గ్రామ, వార్డ్ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని భరత్ గుప్తా వెల్లడించారు.

జాయింట్ కలెక్టర్లకు ఆధార్ సేవలను గ్రామ సచివాలయాల్లో ప్రారంభించాలన్న నిర్ణయాన్ని అప్పగించారని సమాచారం. ఇప్పటికే పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకులలో ఆధార్ సేవలు అందుబాటులో ఉండగా గ్రామ సచివాలయాలలో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

Back to top button