ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

హైకోర్టు సంచలన ఆదేశాలు..!

విశాఖ వైద్యుడు సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం విశాఖ సెషన్స్ మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. సుధాకర్ పై పోలీసుల దాడి సంఘటన విచారణకు సిబిఐకి అప్పగించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఎంతో పెరిగిందన్నారు. సుధాకర్ తల్లి మాట్లాడుతూ తన కుమారుడు మళ్ళీ వైద్యుడులా విధులు నిర్వహించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

వైద్యుడు సుధాకర్ రావు ఈ నెల 16వ తేదీన దారుణమైన స్థితిలో విశాఖ రోడ్లపై కనిపించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతనిని విశాఖ పోలీసులు తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టి, మండుటెండలో నడిరోడ్డుపై పడుకోబెట్టారు. అనంతరం అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి తరలించారు.18వ తేదీన ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తూ 20వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం జరిగిన విచారణలో 21వ తేదీ సాయంత్రానికి సుధాకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోవాలని విశాఖ సెషన్స్ జడ్జీని ఆదేశించింది.ఈ రోజు విచారణలో విశాఖ సెషన్స్ జడ్జి ఇచ్చిన నివేదిక, ప్రభుత్వం నివేదికలను పరిశీలించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.