ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వ‌రుస విజ‌యాలు పార్టీకి ప్ర‌మాద‌మేనా?

YCP‘పెరుగుట విరుగుట కొర‌కే’ అన్న‌ది నానుడి. ఇది రాజ‌కీయాలకూ వ‌ర్తిస్తుంది. వ‌రుస విజ‌యాలు ఆనందాన్ని క‌లిగించిన‌ప్ప‌టికీ.. స‌మ‌స్య‌ల‌ను కూడా మోసుకొస్తుంటాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి, ప‌రిష్క‌రించ‌క‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. రాజ‌కీయ విశ్లేష‌కుల‌తోపాటు వైసీపీలోని కొంద‌రు కూడా ఈ త‌ర‌హా విశ్లేష‌ణ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఏక‌ప‌క్ష విజ‌యం న‌మోదు చేసింది. తాజాగా జ‌రిగిన తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌ఢంకా మోగించింది. ఇది పార్టీ శ్రేణుల‌కు ఎంతో సంతోషం క‌లిగించే అంశం అని చెప్ప‌డంలో సందేహ‌మే లేదు. కానీ.. ఇదే ప‌రంప‌ర కొన‌సాగిన‌ప్పుడు ఇబ్బందులు కూడా వ‌స్తాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలా వ‌చ్చే ప్ర‌ధాన ఇబ్బందుల్లో ఒక‌టి అహం పెర‌గ‌డం. త‌న‌కు ఎదురు లేదు అన్న భావ‌న‌లోకి వెళ్లిపోయే అవ‌కాశం ఉంటుంది. ఇది జ‌గ‌న్ కావొచ్చు.. ఇంకెవ‌రైనా కావొచ్చు. జ‌గ‌న్ విష‌యానికే వ‌స్తే.. ఆయ‌న స‌హజంగానే దూకుడు స్వ‌భావం క‌లిగి ఉంటారు. దానికి వ‌రుస విజ‌యాలు తోడైన‌ప్పుడు.. ప్ర‌జ‌లు త‌న‌వెంట‌నే ఉన్నార‌ని, త‌న‌కు తిరుగే లేద‌న్న భావ‌న‌తో అనూహ్య‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనివ‌ల్ల పార్టీకి ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని అంటున్నారు.

ఇప్ప‌టికే వైసీపీలో స‌ర్వం జ‌గ‌న్ మ‌య‌మే. ఆయ‌న నెంబర్ గా ఉన్నారు. కానీ.. రెండు, మూడు స్థానాల్లో ఎవ‌రు ఉన్నారు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం క‌నిపించ‌దు. ఇలా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం చాటుతున్న‌ప్పుడు ఆయ‌న‌కు క‌ఠిన‌మైన‌ స‌ల‌హాలు ఇచ్చే ధైర్యం ఎవ్వ‌రూ చేయ‌లేరు. ఈ ప‌రిస్థితి కూడా ఒంటెత్తు పోక‌డ‌కు దారితీస్తుందేమోన‌న్న‌ది వైసీపీలోని ప‌లువురి ఆందోళ‌న‌కు కార‌ణం.

మ‌రోవైపు.. ప్ర‌జ‌ల నుంచి పార్టీకి స‌మ‌స్య‌లు వ‌చ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. విజ‌యాల సంఖ్య పెరిగిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల్లో అంచ‌నాలు, ఆకాంక్ష‌లు కూడా అదే స్థాయిలో పెరిగే అవ‌కాశం ఉంటుంది. దీంతో.. అప్ప‌టికే మోస్తున్న‌వాటికి మ‌రికొన్ని జ‌త క‌లుస్తుంటాయి. అవ‌న్నీ క‌లిసి భారంగా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంటుంది. వాటికి న్యాయం చేయ‌లేక‌పోతే.. పార్టీ పుట్టి మునిగే ఛాన్స్ కూడా లేక‌పోలేదు. ఈ ప‌రిస్థితిని హ్యాండిల్ చేయ‌డం మీద‌నే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రిస్థితి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు.

Back to top button