తెలంగాణరాజకీయాలు

తెలంగాణ సీఎం అవుతానన్న షర్మిల అరెస్ట్

Arrest of YS Sharmila

తెలంగాణకు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని శపథం చేశారు వైఎస్ షర్మిల. బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమన్నారు. ఈరోజు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్ష చేపట్టారు. అయితే షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

షర్మిల దీక్షకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

అయితే దీక్ష భగ్నంపై షర్మిల మండిపడ్డారు. ఇందిరాపార్క్ నుంచి లోటస్ పాండ్ కు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద షర్మిలను అడ్డుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలోనే లోటస్ పాండ్ కు తరలించారు.

దీనికి నిరసనగా షర్మిల తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దీక్ష కొనసాగించారు. తన అనుచరులు, కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోనని శపథం చేశారు. మరోసారి తనపై చేయి పడితే ఊరుకోనని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా షర్మిల స్వయంగా నినాదాలు చేశారు. తాను ఏదో ఒకరోజు తెలంగాణకు సీఎం అవుతానంటూ నినదించారు. బంగారు తెలంగాణ సాధిస్తానన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు.

Back to top button