జాతీయంరాజకీయాలు

కేజ్రీవాల్ పని ఖతమేనా..?

Arvind Kejriwal
బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాలపై చాలా వరకు దృష్టి సారించింది. ఎక్కడైతే కమలం అధికారంలో లేదో.. అక్కడి ప్రభుత్వానికి చెక్ పెట్టే విధంగా ముందుకు సాగుతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎవరినీ కుదురుగా ఉండనివ్వడం లేదు.మొన్నటి వరకు పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణ స్వామిని మూడు చెరువుల నీళ్లు తాగించింది. అప్పటి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పుడు బీజేపీ కన్ను కేజ్రీవాల్ పై పడింది. కేజ్రీవాల్ ను సక్రమంగా పాలన చేసుకోకుండా.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అధికారాలు కట్టబెడుతూ.. సవరణ బిల్లు తీసుకొచ్చింది బీజేపీ. దీనికి రాష్రపతి ఆమోదం కూడా లభించింది.

బీజేపీకి దేశరాజధాని ఢిల్లీలో మరోసారి పాగావేయాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. మూడు ఎన్నికల నుంచి కేజ్రీవాల్ అడ్డుపడుతున్నాడు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సైతం వివిధ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నాడు. మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతులకు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు.

ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కేజ్రీవాల్ ను కట్టడిచేయాలన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటోరి ఆఫ్ ఢిల్లీ బిల్లుకు సవరణ చేస్తూ.. ఉభయ సభల్లో ఆమోదించుకుంది. రాజ్యసభలో విపక్షాలు కొంత ప్రతిఘటించినా.. బిల్లు ఆమోదం పొందింది. చివరకు రాష్ర్టపతి సైతం ఈ బిల్లను ఆమోదించడంతో కేజ్రీవాల్ కన్నా కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్ట్ నెంట్ గవర్నర్ బలంగా మారారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇక విలువ ఉండదు. కేజ్రీవాల్ ఇకపై తీసుకునే నిర్ణయాలు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతి తరువాతే.. అసెంబ్లీలో కేజ్రీవాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సి వస్తుంది. కేజ్రీవాల్ నుంచి అధికారాలు లాగేసుకునేందుకే బీజేపీ ఈ రకమైన బిల్లును తీసుకొచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేజ్రీవాల్ ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న కేజ్రీవాల్ కన్నా.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ బలవంతుడిగా మారారు. ఈ బిల్లుతో బీజేపీ ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది.

Back to top button