ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఎక్సైజ్ సిబ్బందిపై దాడి..!


మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపు అడ్డుకోవడం పెద్ద తలనొప్పిగా మారగా, మరోవైపు రాష్ట్రంలో తయారవుతున్న కాపుసారా అరికట్టడం అంతకంటే పెద్ద సమస్యగా తయారైంది. ఈ క్రమంలో అధికారులు సారా తయారీదారుల చేతుల్లో దాడులకు గురవుతున్నారు.

గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ అధికారులు సారా తయారీదారులు దాడి చేసిన ఘటన
చోటు చేసుకుంది. విజయపురిసౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ ఇచ్చిన సమాచారం ప్రకారం హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదే గ్రామంలో 7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

రెండు ఘటనలతో ఆగ్రహించిన సారా తయారీదారుల వర్గం ఎక్సైజ్ అధికారులపై ఊహించని రీతిలో దాడికి దిగింది. సుమారు 100 మంది వ్యక్తులు గుమిగూడారు. అయితే వీరిలో సుమారు 15 మంది వ్యక్తులు రాళ్ళతో మాచర్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తో పాటు సిబ్బంది, కారును దాడి చేశారు. దీనితో కొండారెడ్డి తో పాటు సిబ్బందికి గాయాలు కాగా కారు సైతం అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ ఐ హస్నాబాద్ తండా గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.