అంతర్జాతీయంరాజకీయాలు

బిల్ గేట్స్ దంప‌తుల విడాకులు!

Bill And Melinda మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ దంప‌తులు ప్ర‌పంచానికి షాకింగ్ న్యూస్ చెప్పారు. త‌మ 27 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్ట‌బోతున్న‌ట్టు వెల్ల‌డించి అంద‌రినీ నివ్వెర‌ప‌రిచారు. ఈ మేర‌కు వారిద్ద‌రూ ట్విట‌ర్ ద్వారా సంయుక్త‌ ప్ర‌క‌టన చేశారు. ప్ర‌స్తుతం బిల్ గేట్ వ‌య‌సు 65 సంవ‌త్స‌రాలు. ఆయ‌న భార్య‌త మెలిందా వ‌య‌సు 56 ఏళ్లు.

సోష‌ల్ మీడియాలో వారు వెల్ల‌డించిన ప్ర‌క‌ట‌న ఏమంటే.. ‘‘ఎన్నో స‌మాలోచ‌న‌లు, ఎంతో మ‌థ‌నం త‌ర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాం. గ‌డిచిన 27 సంవ‌త్స‌రాల్లో మేము ముగ్గురు పిల్ల‌ల‌ను అత్య‌ద్భుతంగా తీర్చి దిద్దాం. దాంతోపాటు ప్ర‌పంచంలోని ప్ర‌తిఒక్క‌రూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మ‌కంగా ఎదిగేలా మా ఫౌండేష‌న్ ద్వారా కృషి చేశాం. ఈ మిష‌న‌ల్ లో మా భాగ‌స్వామ్యం ఎప్ప‌టికీ కొన‌సాగుతుంది. కానీ.. భార్యాభ‌ర్తలుగా ఇక కొన‌సాగ‌లేమ‌ని భావించాం. కొత్త ప్ర‌పంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా.. మా వ్య‌క్తిగ‌త ఆకాంక్ష‌ల‌ను, మా విడాకుల నిర్ణ‌యాన్ని అంద‌రూ గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నాం’’ అని ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించిన మైక్రోసాఫ్ట్ ను స్థాపించిన బిల్ గేట్స్ వేగంగా ఎదిగారు. ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ గా వినియోగిస్తున్న సాఫ్ట్ వేర్ల‌లో దాదాపు 80 శాతం మైక్రోసాఫ్ట్ నే వాడుతున్నారు. ఆ విధంగా ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా ఎదిగాడు గేట్స్‌. అయితే.. త‌న సంపాద‌న‌లో చాలా వ‌ర‌కు స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు వినియోగించారు. ఆవిధంగా ఇప్ప‌టి వ‌ర‌కు 53 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేశారు.

ఇక‌, బిల్ గేట్స్ భార్య మెలిందా కంప్యూట‌ర్ సైన్స్ లో డిగ్రీచేశారు. ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి, మైక్రోసాఫ్ట్ లో ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్ గా చేరారు. అప్పుడు బిల్ గేట్స్ సీఈవోగా ఉన్నారు. అప్ప‌టి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో వివాహం చేసుకున్నారు.

వీళ్లిద్ద‌రూ క‌లిసి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి వైదొల‌గిన గేట్స్‌.. తాజాగా గ‌తేడాది మార్చి 14న మైక్రో సాఫ్ట్ కు పూర్తిగా రాజీనామా చేశారు. అప్ప‌ట్నుంచి సామాజిక కార్య‌క్ర‌మాల్లోనే గ‌డుపుతున్నారు. అలాంటి గేట్స్ దంప‌తులు ఈ వ‌య‌సులో విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

Back to top button