ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

కాణిపాకం టెన్షన్: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెగ యాక్టివ్ అయిపోయింది. అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేయతలపెట్టిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించి దాన్ని ఆపించేసింది. ప్రొద్దుటూరులో సక్సెస్ అయిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు కాణిపాకంలో పడ్డాయి. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా బీజేపీ ప్లాన్ చేసింది.

అధికార వైసీపీ, ప్రతిపక్ష బీజేపీల మద్య ఇప్పుడు ‘సత్య ప్రమాణాల’ రాజకీయం మొదలైంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఆలయాల్లో ప్రమాణాల వరకూ వెళ్లారు. దేవుళ్లతోనే తేల్చుకుంటున్నారు. కాణిపాకంలో తాజాగా బీజేపీ నేతల సత్యప్రమాణాలు వ్యవహారం అధికార వైసీపీకి కాకరేపుతోంది.

చిత్తూరు జిల్లా కాణిపాకంలో వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య సత్య ప్రమాణాల చాలెంజ్ ఉద్రిక్తితకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వ్యవహారంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న బీజేపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలకు దిగారు. వ్యక్తిగతంగా దూషించుకున్నారు.

ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇది చివరకు సత్యప్రమాణాల దాకా వెళ్లింది. ఇప్పుడు బీజేపీ నేత విష్ణు కాణిపాకం చేరుకొని సత్య ప్రమాణం చేశారు. తనపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని కాణిపాకం ఆలయంలో విష్ణువర్ధన్ రెడ్డి సత్య ప్రమాణం చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే సైతం సత్య ప్రమాణానికి రావాలని చాలెంజ్ విసిరారు.

బీజేపీ నేత విష్ణు మాట్లాడుతూ ఏ ఆశ్రమము, మఠం వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు అలాగే నేను ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని తెలిపారు. ఈ రోజు నేను దేవుడు ఆలయంలో ,అధికారులు ,వేదపండితుల మా పార్టీ శ్రేణుల సమక్షం లో ప్రమాణం చేస్తున్నానని తెలిపారు..

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలపై నిరూపించాలని లేదంటే ప్రమాణం చేయాలని విష్ణు సవాల్ చేశారు. రాచమల్లు మహిళలను అవమాన పరిచి మాట్లాడాడని.. రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలకు నా కుటుంబ సభ్యులుగా భావించి పసుపు కుంకుమ చీర పంపుతానని విష్ణు అన్నాడు. కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోడాని వైసీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు కు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేక పోవచ్చని ఎద్దేవా చేశారు.

బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ‘సత్య ప్రమాణానికి’ సవాల్ చేసినప్పటికీ ఆ సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించలేదు.

కాణిపాకంలో సత్యప్రమాణానికి వచ్చిన బీజేపీ నేత విష్ణుతో వందలాది మంది బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. సత్య ప్రమాణాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దైవ దర్శనానికి అనుమతిస్తామన్నారు.

బీజేపీ, వైసీపీ నేతల మధ్య చోటుచేసుకున్న ఈ సత్య ప్రమాణాల ఛాలెంజ్ ఈరోజు కాణిపాం వేదికగా ఏ మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి. బీజేపీ నేత విష్ణు ప్రమాణం చేయగా.. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణానికి కాణిపాకం వస్తారా? సవాల్ ను స్వీకరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ పరిణామాలతో ఇప్పుడు కాణిపాకంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Back to top button