సంపాదకీయం

వ్యవసాయానికి తప్పని గడ్డుకాలం

Modi Farmers Schemes
అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా.. తమ సపోర్టు పూర్తిగా రైతులకే అన్నట్లు గొప్పలకు పోతుంటాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కోసం ఇది చేస్తాం.. రైతుల కోసం అది చేస్తాం అంటూ అమలు సాధ్యపడని హామీలిస్తుంటారు. వాటన్నింటినీ నమ్మిన రైతు ఏదో ఒక పార్టీకి ఓటేసి గెలిపిస్తుంటాడు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి చివరికి మోసపోతుంటాడు. అధికారంలోకి వచ్చిన పార్టీ రైతుల కోసం ఏవో నామమాత్ర పథకాలు ప్రవేశపెట్టడం చూస్తుంటాం.

ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ కూడా రైతులను అదేవిధంగా మోసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా.. రైతు బంధు.. పీఎం కిసాన్‌ యోజన.. పేరిట అటు కేంద్ర, ఇటు రాష్ట్రాలు రైతుల కోసం స్కీమ్‌లు అమలు చేస్తున్నాయి. కానీ.. రైతులకు కుడి చేత్తో సాయం చేస్తున్న ప్రభుత్వాలు ఎడమ చేతితో లాగేసుకుంటున్నాయి. చివరికి వ్యవసాయం దండగ అనే ఆలోచన రైతుల్లో కలిగిస్తున్నారు. ఏ రైతు అయినా.. వారసత్వంగా వస్తున్న తన భూమిలో తనతోపాటే తన కొడుకు కూడా వ్యవసాయం చేయాలని కలలు కంటాడు. కానీ.. ఈ ప్రభుత్వాల తీరుతో ఏ రైతు కూడా ఇప్పుడు అలా కోరుకోవడం లేదు.

అవకాశాలను వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు ఇవ్వవు.. సమయానికి కూలీలు దొరకరు.. అన్నట్లుగా ఉంది రైతాంగం దుస్థితి. అంతేకాదు.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచేసి మరో భారం మోపింది. ఒక్కసారిగా ఎరువుల ధరలను పెంచేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. విజన్‌ 2022 అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వాలు.. వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టుతున్నారు.

ఇప్పుడు వ్యవసాయంలో ఖర్చులను చూసి రైతు భయపడాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అన్నదాత పరిస్థితి తయారైతే.. ముందు ముందు ఆ కనీస మద్దతు ధరకు కూడా గండి కొట్టడమెలా అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పల్లెలకు పట్టుకొమ్మల్లాంటిదైన వ్యవసాయాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. దోపిడీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అటు ఎరువుల భారం వేశారు. మరోవైపు ఇష్టారాజ్యంగా స్వేచ్ఛా మార్కెట్‌కు వదిలేశారు. దీంతో తీవ్ర పరిణామాలే ఉత్పన్నం అయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.

భవిష్యత్తులో క్రాప్‌హాలీడేలు సైతం ప్రకటించాల్సిన పరిస్థితే వస్తుందని.. స్వచ్ఛందంగా సాగుకు వీడ్కోలు పలకాల్సిన సందర్భం వస్తుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్టుబడులు తమతో కావు బాబోయ్‌ అంటూ పొలాలను బీడుగా వదిలేసే పరిస్థితి రాబోతోంది. ఏటా కేంద్రానికి జాతీయ ఆదాయంలో వ్యవసాయం నుంచే 12 శాతం వరకు లభిస్తుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆ ఆదాయం 60 శాతం వరకు ఉండేది. అప్పుడు పరిశ్రమలు, సేవారంగం నామమాత్రమే. దీంతో వ్యవసాయమే దేశానికి వెన్నుముకలా అయ్యేది.

కానీ.. రానురాను వ్యవస్థలో మార్పులు జరిగాయి. ఈ మధ్య కాలంలో సేవారంగం మేజర్‌‌ షేర్‌‌ ఆక్రమించేసింది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ దేశంలో ఆహారోత్పత్తుల దుస్థితి ఏంటనేది భవిష్యత్‌ ఆలోచించలేకపోతోంది. ప్రజల జీవన ప్రమాణాలను వ్యవసాయరంగమే నిర్దేశించేది. ఇటీవలి కాలంలో మేజర్ షేర్ సేవారంగం నుంచి వస్తోంది. తాజాగా.. ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల అవసరమైన ముడి పదార్థాల ధరలు కూడా ఆటోమెటిక్‌గా పెరగడం ఖాయం. అంతెందుకు ట్రాక్టర్‌‌ కదలాలన్నా డీజిల్‌ కావాలి.

డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు గత ఆరేడు నెలలుగా రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు వీటి రేట్లు ప్రజల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఈ ధరల ప్రభావంతో అటు రవాణా రంగం.. ఇటు వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ ఉత్పత్తుల ధరలు పెంచి అమ్ముకునే వీలుండదు. ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ఇచ్చేందుకే నానా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. మరో వైపు.. వ్యవసాయ రంగంలో 40 శాతం భూమి ఇప్పటికే కౌలుదారుల చేతుల్లో ఉంది. 20 ఏళ్లుగా ఇది పెరుగుతూ వస్తోంది. మరోవైపు పట్టణాల్లో సాఫ్ట్ వేర్, ఇతర స్థిర ఆదాయం కల ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు చాలా మంది భూములు కొంటున్నారు. ఇదొక పెట్టుబడి సాధనంగా వారు చూస్తున్నారు. వారు సాగుదారులు కాదు. మళ్లీ కౌలుదారులకే అప్పగిస్తున్నారు. ఇందువల్ల భూముల విలువ పెరిగిపోతోంది. వాస్తవ ఉత్పత్తి ఆదాయంతో సంబంధం లేకుండా కోట్ల రూపాయలకు పొలాల విలువ చేరిపోతోంది. పంట ఆదాయం పెరగడం లేదు. రైతుభరోసాలు, రైతు బంధులు, కిసాన్ యోజనల ద్వారా ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం భూమి యజమానులైన వారి ఖాతాల్లోనే పడుతోంది. నిజానికి భూములను సాగు చేసేవారికి పైసా దక్కడం లేదు. దీంతో కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే సాగు చేయడానికి ఎవరూ ముందుకు రాని వాతావరణం తప్పదేమో అనిపిస్తోంది.

Back to top button