ఆరోగ్యం/జీవనంప్రత్యేకం

కడప బాలిక కంటి నుంచి రక్త కన్నీరు.. వైద్యులు ఏమన్నారంటే..?

సాధారణంగా ఎవరైనా బాధ పడితే వాళ్ల కంటి నుంచి నీళ్లు మాత్రమే వస్తాయి. అయితే ఆ బాలిక కంట్లో మాత్రం కన్నీటికి బదులుగా రక్తం కారుతోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన బాలిక అరుదైన సమస్యతో బాధ పడుతోంది. ఇప్పటివరకు శరీరంలో వేడి పెరిగితే చెవి, ముక్కు, నోటి నుంచి రక్తం వస్తుందని చాలా మందికి తెలుసు. అయితే కంటి నుంచి రక్తం కారడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది.

ఇదొక అరుదైన సమస్య అని.. బాలిక కంట్లో నుంచి రక్తం రావడానికి కారణాలు తమకు కూడా తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చూపించడంతో పాటు పలు ఆస్పత్రులను సంప్రదించినా ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే పులివెందుల మండలం చిన్న రంగాపురంలోని జ్యోతి, యువరాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి పాలాక్షి కంటి నుంచి రక్తం కారుతున్న సమస్యతో బాధ పడుతోంది.

పులివెందులలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాలాక్షి గత 15 రోజులుగా ఈ సమస్యతో బాధ పడుతోంది. పాలాక్షి రక్తం కారుతున్న సమయంలో కంటిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు సైతం ఆవేదన చెందుతున్నారు. బాలిక తల్లిదండ్రులు తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో ఒక వైద్యుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉందని పులివెందులలోని వైద్యులు చెబుతున్నారని.. అయితే అక్కడ పరీక్షలకే 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుందని చెప్పారని తెలుస్తోంది.

ఎవరైనా దాతలు సహాయం చేస్తే తమ కూతురికి చికిత్స చేయిస్తామని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. కొందరు వైద్యులు ఈ వ్యాధిని ‘హెమలాక్రియా’ అంటారని.. కొందరిలో ఇది తాత్కాలికంగా జరుగుతుందని చెబుతున్నారు. రోగి శరీరతత్వాన్ని బట్టి ఈ సమస్య వస్తుందని వెల్లడిస్తున్నారు. యాంటి బయోటిక్స్, హర్మనల్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యలను దూరం చేయవచ్చని చెబుతున్నారు.

Back to top button