తెలంగాణరాజకీయాలు

తెలంగాణ కేబినెట్‌.. ఆ మంత్రులకు ఉద్వాసనే!

Telangana Cabinet
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికితోడు సీఎం కేసీఆర్‌‌ కూడా ఈసారి వినూత్నంగా మంత్రివర్గ కూర్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఇప్పుడున్న వారిలో చాలా మందికి ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. వారందరినీ పక్కన పెట్టి కొత్త ముఖాలకు ఛాన్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట.

ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి గతంలో కేటీఆర్ పట్టాభిషేకంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినప్పుడు మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన పలికేసి.. కొత్త టీంతో కేటీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కేసీఆరే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొంత మంది మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే మరికొందరి తీరు వివాదాస్పదమయింది. ఈ కారణంగా ఆయన నలుగురైదుగురు మంత్రుల్ని తీసేసి కొత్త వారికి ఛాన్సివ్వాలని అనుకుంటున్నారు.

తెలంగాణలో రోజుకో మంత్రి కొత్త వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్‌ను వాటాల కోసం బెదిరించిన ఆడియో టేప్ వైరల్ అయింది. ఇప్పటికే కేసీఆర్‌తో ఈటల రాజేందర్‌కు గ్యాప్ పెరిగిపోయిందని టాక్‌. అదే సమయంలో టీఆర్ఎస్ అనుబంధ మీడియా సంస్థలుగా పేరు పడిన చానళ్లలో కొంత మంది మంత్రులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలన్నీ పక్కా ప్రణాళిక ప్రకారమే వేస్తున్నారని.. వాటిల్లో ఉన్న మంత్రులకు పదవి గండమేననడానికి సూచనలని అంటున్నారు.

దీనికితోడు ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఉద్యమకారులకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదన్న అభిప్రాయం పెరగడంతో.. దానిని తొలగించేందుకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కేసీఆర్ కొత్త ఫార్ములాను ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను పరిమితం చేస్తూ టీఆర్ఎస్ బలాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత ఇప్పుడు కేసీఆర్‌‌పై ఉంది. అందుకే.. కొత్త వర్గాలను ఆకట్టుకోవడం కాదు.. ఉన్న వర్గాల్లో అసంతృప్తి పెరగకుండా చూసుకోవడం ఆయన ప్రధాన టాస్క్‌. మినీ మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టి ఆ దిశగా తన రాజకీయ వ్యూహాల్ని అమలు చేసే అవకాశాలున్నాయి. సరికొత్త మంత్రివర్గ కూర్పుతో పాలన స్టార్ట్‌ చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది.

Back to top button