ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

టీడీపీని జూ.ఎన్టీఆర్ బతికించగలడా?

Can J.NTR survive TDP?

‘నడిసంద్రముల దేవా.. నడిపించు మా నావా’ అని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు స్టార్ హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. చంద్రబాబు వయసు అయిపోయిన వేళ.. లోకేష్ శక్తి సామర్థ్యాలు తెలిసిన వేళ జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ నేతలు జపం చేస్తున్నారు. కానీ టీడీపీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా? చంద్రబాబు, లోకేష్ ను మించి టీడీపీని జూనియర్ బతికించగలడా? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.?

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు చేపడితే టీడీపీని లీడ్ చేయగలడు.. కొన్నేళ్లు సరిగ్గా నడిపించగలడు.. కానీ దాన్ని విజయతీరాలకు చేర్చలేడని.. సీఎం పీఠం అధిరోహించలేడని అంటున్నారు. ఎందుకంటే దిగ్గజాలైన చిరంజీవి, పవన్ కే సాధ్యం కానీ ఏపీ సీఎం పదవి అంత పాపులర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యమవుతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న?

చంద్రబాబు, లోకేష్ శక్తి సామర్థ్యాలపై చాలా మంది టీడీపీ సీనియర్లు అపనమ్మకంతో ఉన్నారు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు సైతం లోకేష్ పై కామెంట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినదించారు. పార్టీని రక్షించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలంటున్నారు. తెలుగుదేశం బాహుబలి ఎన్టీఆర్ అంటున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ శక్తి టీడీపీని అధికారంలోకి తేవడానికి సరిపోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. 2009 ఎన్నికల్లో చంద్రబాబు కోరిన మేరకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీ తరుఫున ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం. అంతేకాకుండా.. ప్రచారం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద యాక్సిడెంట్ కు గురయ్యాడు. చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయినా ఆ సానుభూతి టీడీపీకి దక్కలేదు. ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయలేదు. సానుభూతితో టీడీపీకి ఓట్లు రాలేదంటే జూనియర్ ప్రభావం అర్థం చేసుకోవచ్చు. అయినా టీడీపీ నేతలు లోకేష్ కంటే మెరుగైన జూనియర్ ఎన్టీఆర్ పై ఆశలు పెంచుకున్నారు. కానీ టీడీపీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా? లేదా? అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

తెలుగుదేశం పార్టీని అంత ఈజీగా ఎన్టీఆర్ చేజిక్కించుకునే పరిస్థితి లేదు. 1996లో నాడు సీనియర్ ఎన్టీఆర్ ను పదవిలోంచి దించి పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాటి నుంచి నేటి వరకు వ్యతిరేకులను ఏరివేసి పార్టీని తన కబంధ హస్తాల్లో బంధించాడు. నందమూరి ఫ్యామిలీకి సైతం తెలుగుదేశంలో ఎలాంటి స్థానం లేకుండా చేశారు. టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లే రాజు, మంత్రులు. పెట్టని గోడలా పార్టీని చేసుకున్న చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కాదని అంటున్నారు. చంద్రబాబు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కు పట్టాభిషేకం చేస్తే తప్ప ఆయన చేతుల్లో పోయే చాన్స్ లేదు. లోకేష్ ఉండగా.. బాబు జూనియర్ కు అస్సలు పట్టాభిషేకం చేయలేడు. అలా చేస్తే లోకేష్ అసమర్థుడు, అనర్హుడు అని.. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కు తనే సమాధి చేసినవాడు అవుతాడు. కొడుకును అక్కరకు రానివాడిగా మార్చేసిన వాడవుతాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాకుండా తండ్రీకొడుకులు పటిష్టమైన కోటగోడలు నిర్మించారనే చెప్పొచ్చు.

దీన్ని మునిగిపోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లోకేష్ చేతుల్లోనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టేకప్ చేయడం అంత ఈజీ కాదు.. తిరుగుబాటు చేసే వారంతా వేరే పార్టీలోకి వెళ్లడం.. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీ పెట్టడం తప్పితే టీడీపీని చేజిక్కించుకొని ఏలడం జూనియర్ వల్ల కాదంటున్నారు.

ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వల్లనే రాజ్యాధికారం సాధ్యం కావడం లేదు. వారితో పోల్చితే జూనియర్ ఎన్టీఆర్ కు మరింత కష్టం. సో ఇప్పుడు టీడీపీని బతికించగల సామర్థ్యం ఎన్టీఆర్ కు లేదనే చెప్పాలి. అయినా ఆయనను ఆ తండ్రి కొడుకులు అస్సలు పార్టీలోకి రానీయరు. మునుపటిలా సెంటిమెంట్ రాజకీయాలు ఏపీలో పనిచేయడం లేదు.

-నరేశ్

Back to top button