ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

AP CM Jagan: చిక్కుల్లో జగన్.. ఈడీ కేసుల్లో కోర్టుకు.. ఏం జరుగనుంది?

లేపాక్షి,వాన్ పిక్ కేసుల్లో సెప్టెంబర్ 22న కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సీఎం జగన్ కు సమన్లు జారి చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది

ఏపీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారు. ఏపీలో అధికారంలో ఉండి.. కేంద్రంతో సఖ్యతతో ఉన్నా కూడా ఆయనను కోర్టు కేసులు బాధిస్తున్నాయి. ఇప్పటికే ఓ వైపు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ రద్దు అంటూ నానా రచ్చ చేస్తుండగా.. తాజాగా మరో కేసులో సీఎం జగన్ కోర్టు సమన్లు జారీచేయడం సంచలనమైంది.

లేపాక్షి,వాన్ పిక్ కేసుల్లో సెప్టెంబర్ 22న సీఎం జగన్ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు జారి చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. లేపాక్షి కేసులో వైఎస్ జగన్ తోపాటు 24 మందికి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఇందులో వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ధర్నానా ప్రసాద్ రావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఐఏఎస్ లు, మాజీ ఐఏఎస్ లు, జగతి పబ్లికేషన్స్, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ సహా పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి.

-కేసు ఇదీ..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో అనంతపురం జిల్లా గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో 8844 ఎకరాలను నామమాత్రపు ధరకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కేటాయించింది. దీనిపై కేసు నమోదైంది. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీ రూ.1326 కోట్ల విలువైన భూమికి రూ.119 కోట్లే చెల్లించిందని దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా జగన్ కు చెందిన కంపెనీల్లో రూ.70 కోట్లను ఇందూ కంపెనీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ పేర్కొంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తులో పెట్టుబడుల మళ్లింపులో అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేల్చింది.

-కేసుల ఉచ్చు..
ఇప్పటికే వాన్ పిక్ కేసులో జగన్ సహా 21 మందికి సమన్లు జారీ అయ్యాయి. ఇందులో రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవీ వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్నాన ప్రసాదరావు, నిమ్మగడ్డ ప్రసాద్, ప్రకాష్, ఐఏఎస్ అధికారు, జగన్ పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ తదితరులకు సమన్లు జారీ అయ్యాయి.

ఇప్పటికే రఘురామ వేసిన కేసుల్లో సీఎం జగన్ కు కోర్టు ద్వారా చిక్కులు వచ్చిపడ్డాయి. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను స్వీకరించింది. జగన్ సీఎంగా ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ స్వీకరించిన కోర్టు దీనిపై సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు ఇచ్చింది..

ఇప్పుడు మరో కేసులో సమన్లు జారీ అయ్యాయి. వరుసగా కేసుల్లో ఇబ్బందులు ఇప్పుడు జగన్ కు శరాఘాతంగా మారాయి. ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రశాంతంగా పాలిస్తున్న జగన్ కు ఈ పరిణామం ఒకింత కలవరపాటుకు గురిచేసేలానే ఉంది.

Back to top button