తెలంగాణరాజకీయాలు

కేసీఆర్ పై ఈటెల అసహనం!

సుమారు నెలరోజులుగా కరోనా టెస్ట్ లను తగ్గించి తెలంగాణాలో అసలు కరోనా లేదని అంటూ రోగుల కుటుంబాల ఇళ్లను తప్ప మొత్తం రాష్ట్రాన్ని ` గ్రీన్ జోన్’ గా కేసీఆర్ ప్రకటించడం పట్ల కరోనా పై పోరులో ముందుండి నడిపిస్తున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఆసహనానికిలోనవుతున్నారా?

రాష్ట్రంలో కరోనా టెస్ట్ లను తగ్గించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ రాష్ట్ర ప్రభుత్వంకు వ్రాసిన లేఖపై ఈటెల స్పందించిన తీరు అటువంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నది. ఒక వంక కేంద్ర ప్రభుత్వం లేఖ వ్రాయడం పట్ల అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఆమె చేసిన ఆరోపణలను పూర్తిగా సమర్ధిస్తున్నట్లు మాట్లాడటం పలువురికి విస్మయం కలిగిస్తుంది.

టెస్ట్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో చెప్పే ప్రయత్నం చేయకుండా ఆవేశంతో ఊగిపోవడం ఒక విధంగా ఆయన నిస్సహాయ పరిస్థితిని వెల్లడి చేస్తున్నది. `దారినపోయే దానయ్యలకు పరీక్షలు జరపాలా’ అంటూ టెస్ట్ ల తగ్గింపుపై స్పందించిన తీరు ఒక మంత్రి హోదాకు తగినట్లు కనిపించడం లేదు.

పైగా, “మీరేం(కేంద్రం) కోరుకుంటున్నారు? ఈ దశలో వందల సంఖ్యలో కేసులు రావాలని కోరుకుంటున్నారా? వందల శవాలు రావాలని కోరుకుంటున్నారా?’’ అని మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రంపై ధ్వజమెత్తారు. “ఈ దశలో” అంటే రంజాన్ దశలో అని అర్థమా అనే అనుమానం తలెత్తుతుంది.

మిత్రపక్షమైన ఎంఐఎం నాయకత్వం వత్తిడులకు లొంగి కరోనా పరీక్షలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. పరీక్షలు సరిగా జరిపితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు బైట పడతాయని మంత్రి గారి మాటలలోనే వెల్లడి అవుతున్నది. ఈ విధంగా వెల్లడి కాకుండా కప్పిపుచ్చడం కోసమే పరీక్షలను జరపడంలేదని కూడా స్పష్టం అవుతుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు, చికిత్సలు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొనడం  పరోక్షంగా తాను నిమిత్త మాత్రుడిని మాత్రమే అనే సంకేతాన్ని ఇచ్చిన్నట్లు వెల్లడి చేస్తున్నది. అవసరం ఉన్నా పరీక్షలు సరిగ్గా చేయడం లేదని పరోక్షంగా అంగీకరించినట్లు పలువురు భావిస్తున్నారు.

మొదట నెలరోజుల పాటు దేశం మొత్తం లోనే కరోనా కట్టడికి సమర్ధవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వంగా కేసీఆర్ గుర్తింపు పొందారు. అందుకు ప్రధాన సూత్రధారి ముందుండి ఈ పోరాటం నడిపించిన రాజేందర్.

అయితే గత నెల రోజులుగా రాజకీయ వత్తిడుల కారణంగా ఒక విధంగా ఆయన నిస్సహాయులుగా ఉండిపోయారా? అందుకనే ఆయన ఈ విధంగా కేంద్రం ఇచ్చిన లేఖపై స్పందిస్తున్నారా? అనే అనుమానాలు ఈటెల స్పందనలో వ్యక్తం అవుతున్నాయి.