అప్పటి ముచ్చట్లు

1942లోనే చీప్ పబ్లిసిటీ.. ఎగబడిన జనం !

Cheap film publicity
థియేటర్స్ కి జనాలను తీసుకురావడానికి చేసేవే ‘పబ్లిసిటీ ట్రిక్స్’. ఈ మధ్య కాలంలో ఈ పబ్లిసిటీ ట్రిక్స్ బాగా దిగజారిపోయాయని, మనం ఏదో ఇప్పుడు తెగ విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాం గానీ, ఆ రోజుల్లో ఇలాంటివి మరీ ఎక్కువుగా జరిగేవి, ఇంతకీ ఆ రోజులు అంటే.. సినిమా పుట్టిన ప్రారంభం రోజులు అన్నమాట. అది 1942వ సంవత్సరం.. అప్పుడే రిలీజైన ‘భక్త నందనార్’ అనే ఓ తమిళ సినిమా కోసం ఓ విచిత్ర పబ్లిసిటీ ప్రయోగం చేశారు. ఆ పబ్లిసిటీ ట్రిక్ అప్పటి సమాజాన్ని ఒక విధంగా షాక్ కి గురిచేసింది.

1942 లో జెమిని పతాకం పై వాసన్ మురుగదాస్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘భక్త నందనార్’ చిత్రం. ఎంతో కష్ట పడి ఈ సినిమాని పూర్తి చేశారు. అందుకే తమ సినిమాకు ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ రావాలని.. నిర్మాత వాసన్ అప్పటిదాకా సౌత్ లో ఎవరూ చేయని ఓ పబ్లిసిటీ ట్రిక్ ను వాడారు. తమ సినిమాలోని 31 పాటల్లో.. ఉత్తమమైన మూడు పాటలను ఎంపిక చేసి మాకు పంపాలని, అలా పంపిన వారికీ మంచి ప్రైజ్ మనీ ఇస్తామని ఒక ప్రకటన చేసారు. ప్రైజ్ మనీ భారీగా ఉండటంతో అప్పటి ప్రేక్షకులు ఆ ప్రకటన పట్ల ఆసక్తి కనబర్చారు.

పైగా చేయాల్సింది కూడా చిన్న పని.. సినిమా చూసి థియోటర్ దగ్గర ఇచ్చే పాటలు లిస్ట్ ఉన్న ఓ షీట్ లో తమకు నచ్చిన మూడు పాటల పై ఒక టిక్ కొట్టాలి. టిక్స్ కొట్టిన ఆ స్లిప్ ను థియోటర్ దగ్గర పెట్టిన భాక్స్ లో వేసేయాలి. మరోపక్క ఈ సినిమా పాటల రికార్డులు చిత్ర శతదినోత్సవం దాకా మార్కెట్లోకి విడుదల కానివ్వలేదు నిర్మాత. ఆ కారణంగా ఈ సినిమా పాటలు వినడానికి ప్రేక్షకులు పదేపదే చిత్రాన్ని చూడాల్సి వచ్చింది. ఇంతకీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ? 10 వేల రూపాయలు. ఆ రోజుల్లో పదివేలు అంటే.. ఈ రోజు కోటి రూపాయిలతో సమానం అనుకోవచ్చు. అందుకే జనం ఎగబడ్డారు.

మొత్తానికి ఒకే ఒక్క ప్రకటన వల్ల థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. నిర్మాతకు కాసుల వర్షం కురిసింది. సినీ పెద్దల సమక్షంలో, మీడియాని పిలిచి లాటరీ నిర్వహించారు. చివరికి 20 మందికి ఈ బహుమతి మొత్తాన్ని సమంగా పంచారు. నిర్మాతకి పోయింది ఏమి లేదు, వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని పంచి పెట్టాడు. మొత్తానికి ఈ రేంజ్ పబ్లిసిటీని ఈ రోజు వరకూ మళ్ళీ ఎవ్వరూ చేయలేకపోయారు.

Back to top button