అంతర్జాతీయంటెక్నాలజీ

గూగుల్ ఆధిప‌త్యానికి చెక్‌!

ఈ ప్ర‌పంచంలో దాదాపు 95 శాతం మంది నెటిజ‌న్ల‌కు ఏ స‌మాచారం కావాల‌న్నా.. జైకొట్టేది గూగుల్ కే! ఇంట‌ర్నెట్‌ పై గూగుల్ గుత్తాధిప‌త్యం ఎంత అనేది చెప్ప‌డానికి ఈ లెక్క చాలు! గూగుల్ కాకుండా.. ఇత‌ర సెర్చ్ ఇంజిన్స్ లేవా? అంటే చాలానే ఉన్నాయి. కానీ.. యూజ‌ర్ల‌కు గూగుల్ కు త‌ప్ప, మ‌రో పేరు తెలియ‌నే తెలియ‌దు. వంద‌లో ఐదు శాతం మందికి మాత్ర‌మే మిగిలిన సెర్చ్ ఇంజిన్ల గురించి తెలుసు. ఈ ప‌రిస్థితి అతి త్వ‌ర‌లో మార‌బోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఇక‌పై గూగుల్ తోపాటు ఇత‌ర సెర్చ్ ఇంజిన్లు కూడా క‌నిపించ‌బోతున్నాయి.

గూగుల్ ఏక‌ఛ‌త్రాధిప‌త్యానికి యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ) చెక్ పెట్టింది. ఈ యూనియ‌న్లో 27 ఐరోపా దేశాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మిగిలిన సెర్చ్ ఇంజిన్ల‌కు సైతం అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ దేశాల కూటమి ఆదేశించింది. ఈ ఆదేశాల‌కు గూగ‌ల్ త‌లొంచింది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో యూర‌ప్ లోని అన్ని దేశాల్లోనూ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో గూగుల్ మాదిరిగానే ఇత‌ర సెర్చ్ ఇంజిన్లు కూడా డిఫాల్ట్ గా ఉచితంగా ఉండ‌బోతున్నాయి.

గ‌తంలో మిగిలిన సెర్చ్ ఇంజిన్లు ఆండ్రాయిడ్ స్క్రీన్ల‌పై క‌నిపించాలంటే.. వేలంలో పాల్గొనాల‌ని గూగుల్ ప్ర‌క‌టించింది. 2019లో ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పుడు ఈయూ ఆదేశం నేప‌థ్యంలో ఉచితంగానే వాటిని అందుబాటులోకి తేనుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం యూర‌ప్ లో ప్రాచుర్యం పొందిన ఐదు సెర్చ్ ఇంజిన్లు ఆండ్రాయిడ్ స్క్రీన్ పై ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి.

దీనిపై గూగుల్ డైరెక్ట‌ర్ అలివ‌ర్ బెదెల్ మాట్లాడుతూ.. అర్హ‌త గ‌ల సెర్చ్ ఇంజిన్లు ఉచితంగా స్క్రీన్ల‌పై క‌నిపించేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. అదేవిధంగా స్క్రీన్ పై సెర్చ్ ప్రొవైడ‌ర్ల సంఖ్య‌ను కూడా పెంచుతామ‌ని చెప్పారు. ఈ మార్పుల‌న్నీ అతి త్వ‌ర‌లో సెప్టెంబ‌ర్ నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపారు. ఇందులో ‘డ‌క్ డ‌క్ గో’, ఎకోసియా వంటి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి.

ఈ నిర్ణ‌యంపై మిగిలిన సెర్చ్ ఇంజిన్లు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. వాస్త‌వానికి ఇది మూడేళ్ల క్రిత‌మే జ‌ర‌గాల్సింద‌ని ‘డ‌క్ డ‌క్ గో’ వ్యాఖ్యానించింది. మిగిలిన సెర్చ్ ఇంజిన్ల మూత‌ప‌డ‌కుండా ఈ నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎకోసియా అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు.. ప్ర‌పంచంలోని అన్నిదేశాల్లోనూ ఈ ప‌ద్ధతి అమ‌ల్లోకి రావాలని కోరింది. మొత్తానికి.. ఈ కొత్త విధానం ద్వారా.. ఇన్నాళ్లూ గూగుల్ కొన‌సాగించిన గుత్తాధిప‌త్యానికి చెక్ ప‌డ‌నుంది.

Back to top button