జాతీయంరాజకీయాలుసంపాదకీయం

కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలినీడలు

కాంగ్రెస్ పార్టీ కి కష్టాలు వదల్లేదు. జ్యోతిరాదిత్య సింధియా పేరుతో పెద్ద ప్రకంపనకు గురయ్యింది. 2014 లో అధికారం కోల్పోయిన తర్వాత అధికారపార్టీ పై వుండే సహజవ్యతిరేకతతో 2019 కల్లా పుంజుకుంటుందని చాలామంది ఊహించారు. కానీ అది జరగలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడలాగానే వుంది. కనీసం గుర్తింపు పొందిన ప్రతిపక్ష స్థాయి కి కూడా ఎదగలేకపోయింది. అదేసమయంలో రాష్ట్రాల్లో అక్కడ స్థానిక నాయకుల పలుకుబడితో అధికారంలో వున్న ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం కొంతవరకు గుడ్డిలోమెల్ల అనిచెప్పొచ్చు.

ఈ రెండురోజుల్లో జరిగిన సంఘటన మొత్తం పార్టీని ఓ కుదుపు కుదిపింది. జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీ ఆంతరంగిక కూటమిలో సభ్యుడు. ఒకసందర్భంలో రాహుల్ గాంధీ అధ్యక్షపదవి కి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే పేర్లలో జ్యోతిరాదిత్య పేరుకూడా బయటకొచ్చింది. ఆ స్థాయిలో వున్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీ లో చేరటం కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బే . ఎందుకిలా జరిగింది? ఆయన పదవీ దాహంతో వెళ్లిపోయాడని చెప్పి ఆత్మసంతృప్తి పొందొచ్చు. కానీ లోలోపల కాంగ్రెస్ నాయకుల్లో ఆత్మమధనం మొదలయ్యింది. ఇందులో మొత్తం జ్యోతిరాధిత్యదే తప్పేనా పార్టీ నాయకత్వం తప్పులేదా అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ పరిణామం తో నైనా కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటుందా లేదా? అధికారంలో వున్నప్పుడు పార్టీ వ్యవహారాలు నడపటం వేరు కష్టకాలం లో నడపటం వేరు. కష్టకాలంలోనే నాయకత్వ లక్షణాలు పరీక్షకు నిలబడతాయి.

సోనియా గాంధీ కి పార్టీ నాయకత్వం వారసత్వంగా వచ్చింది. పార్టీ అధ్యక్షురాలైన దగ్గర్నుంచి పార్టీలో ఏరోజూ ఎన్నికలు జరిపిన పాపాన పోలేదు. కిందనుంచి పైదాకా అన్ని పదవులు నామినేషన్ తోనే నింపింది. అది రాను రాను పూర్తిగా అడుగులకు మడుగులొత్తే వాళ్ళ తోనే నిండిపోయింది. ప్రజాదరణ తో సంబంధం లేకుండా జీ హుజూర్ అనేవాళ్లే కేంద్రంలో , రాష్ట్రం లో నాయకులయ్యారు. 2014 లో ఓడిపోయిన తర్వాతన్నా ఈ సంస్కృతిని మార్చి పార్టీని బతికిస్తారని నిజమైన కాంగ్రెస్ అభిమానులు ఎదురుచూసారు. కొంతమేరకు అధ్యక్షహోదాలో రాహుల్ గాంధీ యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నించాడు. అయితే ఈ పాత నాయకత్వం సోనియా గాంధీ పంచన చేరి రాహుల్ గాంధీ ఆలోచనలను అమలుచేయకుండా అడ్డుకట్టవేయగలిగారు. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల సెలక్షన్ ఉదాహరణ. రాహుల్ గాంధీ జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లను ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేస్తే బాగుంటుందని భావించాడు. కాకపోతే అప్పటికే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో సోనియా ప్రాపకంతో కమల్ నాధ్ , అశోక్ గెహ్లాట్ లు ముఖ్యమంత్రులయ్యారు. అదే పని హర్యాణాలోను జరిగింది. తిరిగి భూపేంద్ర హుడా ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటంతో ఒకవర్గం అసంతృప్తితో తప్పుకుంది. ముంబై లోను ఇదే పునరావృతమయ్యింది. మార్పుని అడ్డుకోవటంలో సోనియా గాంధీ చురుకైన పాత్ర పోషించింది. ఇదే రాహుల్ గాంధీ పార్టీలో అంటి ముట్టనట్లు ఉండటానికి కారణమని అర్ధమవుతుంది. రాహుల్ గాంధీ అంతరంగికుల్లో దీనితో అంతర్మధనం మొదలయ్యింది. ఇంతకుముందే సచిన్ పైలట్ అసంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. అయితే అది పార్టీనుంచి బయటకు వెళ్ళే అంతకాదు . జ్యోతిరాదిత్య సింధియా దాదాపు కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యినదగ్గర్నుంచి అసంతృప్తిగా వున్నాడు. ఆయనను బుజ్జగించటానికి ప్రయత్నించకపోగా కమల్ నాథ్- దిగ్విజయ్ సింగ్ కలిసి తన పలుకుబడిని తగ్గించటానికి చెయ్యని ప్రయత్నం లేదు. వాళ్ళు ఆ రాష్ట్రం లో వైరివర్గమని సర్దిపుచ్చుకున్నా సోనియా గాంధీ-రాహుల్ గాంధీ తనను దగ్గరికి తీయటానికి ప్రయత్నం చేయలేదు. సహజంగానే తన కుటుంబ నేపథ్యం దృష్టిలో వుంచుకున్నప్పుడు కొంత అతిశయం వుంది. దానికి తోడు తనను గుర్తించటంలేదనే దుగ్ధ తీవ్రంగా ఆలోచింపచేసింది. చివరకి సిద్ధాంతం కన్నా నా అహం దెబ్బతిన్నదనేదే డామినేట్ చేసింది. దాని పర్యవసానమే ఇది. ఓ విధంగా తను బయటికెళ్లే పరిస్థితులు సృష్టించారని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మోడీ- అమిత్ షా ద్వయం తెలివిగా ఉపయోగించుకున్నారు.

కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదా?

కాంగ్రెస్ కి భారత రాజకీయాల్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దానికి ఘనమైన వారసత్వం వుంది. రెండోది, బీజేపీ వ్యతిరేక ఓట్లు సంఘటితం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే వుంది. ప్రజలు ఇప్పటికీ ఉదారవాద పార్టీగా కాంగ్రెస్ నే చూస్తారు. అయితే దానికి రెండు వారసత్వ గుదిబండలు కూడా వున్నాయి. అవి కుటుంబ పాలన, అవినీతి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వున్నప్పుడు ఆ కుటుంబ ఘన వారసత్వమే ఉపయోగపడింది. సోనియా గాంధీ హయాంలో అదే గుదిబండలాగా తయారయ్యింది. రాహుల్ గాంధీ ఇంతవరకు తన నాయకత్వ లక్షణాలను చూపించుకోలేకపోయాడు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ భవిష్యత్తేమిటి?

ఇప్పటికైనా కాంగ్రెస్ కి అవకాశంలేకపోలేదు. జ్యోతిరాదిత్య ఘటనని మంచి అవకాశంగా మార్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టవచ్చు. కింది స్థాయినుంచి అన్ని పదవులను ఎన్నికద్వారానే నింపేటట్లయితే పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాం వస్తుంది. గాంధీ కుటుంబం తప్పుకుంటే మంచిదని చాలామంది సలహాలిస్తున్నా కాంగ్రెస్ సంస్కృతిలో ఇప్పట్లో అంత తీవ్ర మార్పు తీసుకురావటం దుస్సాహసమే అవుతుంది. అసలు ఆ సమస్యను పక్కనపెట్టి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తే దానికి పరిష్కారం అప్పుడే దొరుకుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పూర్తిగా ఎన్నికద్వారా నిర్మించబడితే అది ఓ కొత్త అధ్యాయానికి తెరతీసినట్లవుతుంది. ఈ ప్రయోగం ఒక్కటే కాంగ్రెస్ ని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయగలదు. శశి థరూర్ లాంటి వాళ్ళ ప్రకటనలు మధ్య నాయకత్వం అందరూ చేస్తే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిద్దాం.

Back to top button