ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

సీఎం జగన్ కు ఢిల్లీ పిలుపు.. ఏం జరగనుంది?

CM jagan Delhi tourపార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహం మార్చుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి మద్దతు అవసరమైన సమయంలో వైసీపీ ఎదురు తిరిగేలా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం ఖంగుతింది. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉండే వైసీపీ ఎంపీలు ఆకస్మికంగా రూటు మార్చడంతో నివ్వెరపోతున్నారు. ఉభయ సభల్లో వైసీపీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసింది. దీంతో కేంద్రం వైసీపీ నేతలతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారు. ఏదైనా ఉంటే అధినేతతో మాట్లాడాలని సూచిస్తున్నారు. కేంద్రం నేరుగా సీఎం జగన్ తోనే మాట్లాడాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

కేంద్రంలో బీజేపీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఇన్నాళ్లు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారు త్వరలో మరో నలుగురు పెరిగి పది మంది అయ్యే అవకాశం ఉంది. దీంతో బిల్లులు పాస్ కావాలంటే వారి మద్దతు అవసరమున్న నేపథ్యంలో వీరిని కేంద్రం తన దారికి తెచ్చుకునే పనిలో పడింది.

వైసీపీ ఎంపీలతో దోస్తీ చెడగొట్టుకోవడానికి బీజేపీ తయారుగా లేదు. సీఎం జగన్ ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంత కాలం కేంద్రంతో సహకరించినా పెద్ద ప్రయోజనం ఒరగలేదు. ప్రత్యేక హోదా అంశంలో ఇబ్బందులు ఉన్నాకేంద్రం ఎప్పుడు పట్టించుకున్నదాఖలాలు కనిపించడం లేదు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో కేంద్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా చేసుకునే పనిలో పడింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు జగన్ పరిశీలిస్తున్నారు. తమకు అనుకూలంగా చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. వైసీపీ, బీజేపీ మధ్య వచ్చిన అగాధాలను చెరిపేసుకునే క్రమంలో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నాయి.

Back to top button