Uncategorizedజాతీయంరాజకీయాలుసంపాదకీయం

మోడీ , కెసిఆర్ , జగన్ లు ఒక అంశం లో కలిసారు

స్వాతంత్రానంతర భారత్ మొత్తం రెండు రకాల ఆర్ధిక వ్యవస్థల నమూనా గా వర్గీకరించొచ్చు. మొదటి నాలుగు దశాబ్దాలు కమ్యూనిజానికి దగ్గరలోవుండే సోషలిస్టు , ప్రభుత్వరంగ ఆధారిత ఆర్ధిక నమూనాని అనుసరించింది. తేడా అల్లా కమ్యూనిస్టు దేశాల్లో లాగా నిర్బంధ, నియంతృత్వ పాలనా వ్యవస్థలు లేవు. భావ స్వేచ్చ, వాక్ స్వేచ్చ ప్రాధమిక హక్కులుగా గల ప్రజాస్వామ్య వ్యవస్థ కి లోబడే ఈ పరిపాలన సాగింది. ఇది దేశ పురోగతి కి వుపయోగపడలేదనేది చరిత్ర చెప్పిన సత్యం. తర్వాత మూడు దశాబ్దాల్లోనే ఆర్ధిక ప్రగతి వేగం పుంజుకొని ప్రస్తుతం 5 వ పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా అవతరించింది. ఇది మానవత్వం లేని పెట్టుబడిదారీ నమూనా నో, భావ, వాక్, మత స్వేచ్చలేని కమ్యునిస్టు నమూనా నో కాకుండా మానవత్వం తో కూడిన సంక్షేమ నమూనా గా అవతరించింది. ఇది కొంతమేరకు యూరప్ సమాజాలకు దగ్గరలో వుంది. అదేసమయం లో ఇది భారత్ ప్రత్యేక లక్షణాలతో కూడిన  సంక్షేమ నమూనా గా చెప్పొచ్చు. అత్యధికంగా ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చింది ఈ మూడు దశాబ్దాల్లోనే. అదేసమయం లో ఇది పూర్తి సంక్షేమ దిశగా పయనించక , అసమానతలు పెరగటం కూడా ఆందోళన కలిగించే విషయం. అయినా పరిమితులతోనయినా ఇది సంక్షేమ దిశగానే అడుగులేస్తుందని చెప్పొచ్చు. దీన్నే పాలకులు తరతమ బేధం తో పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశం లో మోడీ , తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్ లు పాలిస్తున్నారు. వీళ్ళు కూడా ఇదే నమూనాలను అనుసరిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

మోడీ పాలన :  ఆరు సంవత్సరాల క్రితం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇదే నమూనా ని పాటించినా ఇందులో కొన్ని మార్పులు , ప్రాధాన్యతలు ఎంచుకున్నాడు. గత యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి లో కూరుకుపోయి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఆ అనుభవం తో పరిపాలన లో జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. వాటితోపాటు సాంకేతికత ను అధికంగా వినియోగం లోకి తెచ్చి ప్రజల ఖాతాలోకే డబ్బులు జమ అయ్యే వ్యవస్థని తీసుకురావటం తో లబ్ది నూటికి నూరు శాతం కిందవరకు చేరటానికి అవకాశం వచ్చింది. ఇక ప్రాధాన్యత అంశాల్లోకి వచ్చేసరికి జాతీయ భద్రత, జాతీయ సమగ్రత , ప్రపంచపటం లో భారత ఖ్యాతి ముందుకొచ్చాయి. రక్షణ రంగాన్ని పటిష్టపరచటం, రక్షణాధికారి పోస్టు ని ఏర్పాటుచేయటం, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్ని మరింత పటిష్టపరచటం, అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకోవటం లాంటి అనేక చర్యలు చేపట్టారు. ఇక జాతీయ సమగ్రత దిశగా జమ్మూ-కాశ్మీర్ ని రెండుగా విడదీసి కేంద్ర ప్రత్యక్షపాలన కిందకి తీసుకురావటం, ఆర్టికల్ 370 ని రద్దుచేయటం, అస్సాం లో గత యాభై సంవత్సరాలనుండి అపరిష్కృతం గా వున్న బోడో సమస్యను పరిష్కరించటం, గత 30 సంవత్సరాలుగా వున్న ‘బ్రు’ ఆదివాసుల సమస్యను పరిష్కరించటం, ఆర్ధికంగా వెనకబడిన తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతని కల్పించటం లాంటి అనేక చర్యలు దేశ సమగ్రతకు దోహదపడ్డాయి. ఇక ప్రపంచం లో భారత ప్రతిష్ట మోడీ హయాం లో ఎప్పుడూ లేనంతగా పైకి ఎగబాకింది. ఆర్ధిక రంగం లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే అనేక సంస్కరణలను ప్రవేశపెట్టటం, సులభతర వాణిజ్యానికి కావలసిన అనేక పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటం, పన్నుల విధానం లో సంస్కరణలు తీసుకురావటం లాంటి అనేక చర్యలు చేపట్టారు. ఇక సాంఘిక రంగం లో చూస్తే స్వచ్చ భారత్ పేరుతో పరిశుభ్రత కు, ప్రజల అలవాట్ల మార్పుకు దోహదం చేసారు.

కెసిఆర్ పాలన : ప్రధానంగా వ్యవసాయం, సాగునీటిపారుదల పై దృష్టి సారించాడు. రికార్డు సమయం లో కాళేశ్వరం ప్రాజెక్టు ని పూర్తిచేయగలగటం అన్నింటికన్నా పెద్ద ఘనత . ఇది తెలంగాణా ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. మొదట్లో ప్రాజెక్టు డిజైన్ పై వివాదం చెలరేగినా రాను రాను ఈ ప్రాజెక్టు పై ప్రజల్లో సానుకూలత ఏర్పడటమే కాకుండా అది జీవితాంతం గుర్తుంచుకునే సంఘటన గా మారటం కెసిఆర్ సాధించిన పెద్ద ఘనకార్యం. మిగతా కొన్ని బలహీనతలు, లోపాలున్నా ఈ ప్రాజెక్టు అన్నింటినీ మింగేసి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది. వ్యవసాయ రంగం లో రైతు బంధు కార్యక్రమం దేశానికే నమూనా గా మారింది. అలాగే రైతు భీమా కూడా. అదేసమయం లో తెలంగాణకు ఆయువుపట్టైన హైదరాబాద్ అభివృద్ధి ని కుమారుడు కేటిఅర్ కి అప్పగించి తనుమాత్రం మిగతా విషయాలపై కేంద్రీకరించాడు. తనూ సమర్ధుడు కావటం తో అదీ సానుకూలతనే తెచ్చిపెట్టింది. ఇక సాంఘిక రంగం లో చూస్తే పల్లె ప్రగతి, పట్టణ  ప్రగతి కార్యక్రమాలు తన మార్కు స్వచ్చ భారత్ కార్యక్రమాలు.

జగన్ పాలన : మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన అనతికాలం లోనే అధికార యంత్రాంగం పై పట్టు సాధించాడు. గ్రామీణ సచివాలయ వ్యవస్థ , గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ తో తన మార్కు ముద్ర వేయటం తో పాటు పరిపాలన ను గ్రామ స్థాయికి వికేంద్రీకరించాడు. ఇది తన పరిపాలన లో ఆణిముత్యం. ప్రజలు ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఇంటికే అన్నీ రావటం ఓ విప్లవాత్మక సంస్కరణ. విద్యారంగం లో మౌలిక వసతులకు ప్రాధాన్యం, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టటం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుదల పై దృష్టి మంచి నిర్ణయాలు. సాంఘిక పరంగా చూస్తే మద్యపాన నియంత్రణ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది.

ముగ్గురి పాలనలో వుమ్మడి అంశం 

వీటిల్లో ఎవరి ప్రాధాన్యాలు వారివైనా ముగ్గురికీ ఒక్క విషయం లో సామీప్యత వుంది. ముగ్గురు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. పేద మధ్యతరగతి వర్గాలకి లబ్దిచేకూర్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు ప్రత్యక్షంగా నగదు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ముగ్గురూ చేపట్టారు. వయో వృద్ధులకు, వితంతువులకు పించను కూడా ముగ్గురూ చేపట్టారు. పేద ప్రజలకు ఆరోగ్య ఖర్చులు భరించే కార్యక్రమాల్ని ముగ్గురూ చేపట్టారు. ఇక ఆహార రాయితీలు మొదట్నుంచీ అందరూ ఖర్చుపెడుతున్నవే. వీటితో పాటు మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద లక్షలాది ఇల్లు నిర్మించే కార్యక్రమం లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా వుంది. మోడీ 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలను ఆదుకున్నాడు. ఇందులో ఎక్కువమంది దళితులూ, ఆదివాసులు, మైనారిటీలు వున్నారు. ఇక సంక్షేమ కార్యక్రమాల్లో జగన్ అందరికన్నా ముందున్నాడు. అమ్మ ఒడి, జగనన్న కానుకలు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. సంక్షేమ కార్యక్రమాల్లో చూస్తే జగన్, కెసిఆర్, మోడీ లు ఆ వరసల్లో వున్నారు. మొత్తం మీద చూస్తే సంక్షేమ కార్యక్రమాల్లో ముగ్గురూ ఉమ్మడిగా ముందున్నారు. ఇదే భారతీయ నమూనా. పూర్తి పెట్టుబడి దారీ విధానం , కమ్యూనిస్టు, సోషలిస్టు విధానాల కంటే సంక్షేమ విధానానికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నాయనేది అర్ధమవుతుంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు ముందంజలో వున్నాయి. మోడీ కూడా అందరూ అనుకుంటున్నట్లు పూర్తి పెట్టుబడిదారీ విధానం కన్నా సంక్షేమ విధానానికే మొగ్గు చూపించినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. భారత్ లాంటి అధిక జనాభా దేశానికి ప్రజాస్వామ్యం తో పాటు సంక్షేమ విధానమే శరణ్యం. గత మూడు దశాబ్దాల విధానం తో అదివరకటి కన్నాపేదల జీవితాలు మెరుగ్గా వున్నా ధనవంతుల స్థితిగతులు మరింత వేగంగా పుంజుకొని ఆర్ధిక అసమానతలు మరింత పెరిగాయి. ప్రభుత్వ విధానాలు దీనిపై దృష్టి పెట్టకపోతే సంక్షేమ విధానం కాస్తా పూర్తి పెట్టుబడిదారి విధానం గా మరే అవకాశముంది.