Uncategorizedజాతీయంరాజకీయాలుసంపాదకీయం

మత సామరస్యం-జాగృత హిందూ సమాజం (భాగం 8)

పోయినసారి హిందూ సమాజం లో కులం పాత్ర , రావాల్సిన మార్పులు గురించి విపులంగా చర్చించుకున్నాం. కులరహిత సమాజమే హిందూ మతానికి శ్రీరామ రక్ష అని కూడా నొక్కి వక్కాణించాం. స్వాతంత్రానంతర భారత్ లో హిందూ సమాజం ఎలా పరిణతి చెందిందో ఈ భాగం లో చర్చించుకుందాం. దేశ స్వాతంత్రం మతపర విభజన తో ప్రారంభమవటం ఓ మాయని మచ్చ. అది ప్రజల గుండెల్లో పెద్ద గాయాన్నే చేసింది. నిజం చెప్పాలంటే ఇందులో ప్రజల పాత్ర ఏమీలేదు. బ్రిటీష్ వాడు తన స్వార్ధం కోసం ప్రజల తో ఆడిన భయంకరమైన క్రీడ. దానితో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. అది ఈరోజుకీ మనల్ని దహిస్తూనే వుంది. దానికి తోడు మన పాలకులు, రాజకీయ పార్టీలు ఈ మత గుర్తింపు రాజకీయాల్ని పెంచి పోషించారు.

రాజ్యాంగ చర్చలు, వాటి పర్యవసానం

రాజ్యాంగ సభ అతిరధ మహారధుల తో పూర్తి మేధోసంపత్తి తో వుండి  ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం జరిగింది. మతపరమైన విషయాలపై కూడా లోతుగా చర్చించారు. మొదటి రాజ్యాంగ సభ చర్చలకు కర్ఫ్యూ పాసులతో రావలసి వచ్చింది.అది డిసెంబర్ 1946 పరిస్థితి. డిల్లీ అంతా మత కల్లోలాలతో అట్టుడికి పోయింది. వచ్చే శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం పెద్ద సమస్య అయ్యింది. ఈ నేపధ్యం లో 1947 ఫిబ్రవరి -మార్చి లో మొదలైన వుమ్మడి పౌర స్మృతి చర్చ చాలా ఘాటు గా జరిగింది. ప్రధానంగా డాక్టర్ అంబేద్కర్, కే ఎం మున్షి, మినూ మసాని వుమ్మడి పౌర స్మృతి వస్తేనే దేశం ఐక్యంగా ముందుకు సాగుతుందని వాదించారు. వీరికి మద్దతుగా మహిళా సభ్యులు రాజ్ కుమార్ అమ్రిత్ కౌర్ , హంసా మెహతా నిలిచారు. వీరి వాదన ఇంకోలా వుంది. అసలు అన్ని మతాలూ పురుషాధిక్య మతాచారాలతో కూడి వున్నాయి. వుమ్మడి పౌర స్మృతి ఒక్కటే మహిళలకు సమాన గౌరవం ఇస్తుందనేది వీరి వాదన. కానీ దీనిపై కమిటీ లోని నలుగురు ముస్లిం సభ్యులు ( ముస్లిం లీగ్ ) తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు అందరూ నెహ్రూ అభిప్రాయం వైపు చూసారు. నెహ్రూ వుమ్మడి పౌర స్మృతి కన్నా మతాచారాలకు లోబడి విడివిడిగా పౌర స్మృతి వుంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదని అభిప్రాయపడ్డాడు. చివరకు రాజీ మార్గంగా వుమ్మడి పౌర స్మృతి ని ఆదేశిక సూత్రాల్లోకి చేర్చారు. ఆ తర్వాత ఈ 72 సంవత్సరాల్లో కూడా దీనిపై దృష్టి సారించలేదు.

ఆరోజు పడిన రాజీనే కొంప ముంచింది. రాను, రాను మత పరమైన రాజకీయాలు పెరిగి మొక్క మానయి కూర్చుంది. 21 వ శతాబ్దం లో కూడా సమాజం మతపర వుద్రిక్తతలతో కొట్టు మిట్టాడుతుంది. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో వుమ్మడి పౌర స్మృతి అమలు లో వుంది. అదే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా వుంది. కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా వుమ్మడి పౌర స్మృతి అమలు లో వుంది. లేనిదల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోనే. అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలిపెట్టినా హిందూ కోడ్ బిల్లు లు తీసుకొచ్చి హిందూ సమాజానికి ఎంతో మేలుచేశాడు. ముఖ్యంగా స్త్రీలు ఆత్మ గౌరవంగా సమభావం తో మెలగటానికి దోహదపడింది. ఆ తర్వాత 2005 లో వచ్చిన చట్టంతో ఆస్తి లో సమవాటా రావటం కూడా మహిళా సాధికారత కు దోహదపడింది. హిందువులు నూటికి ఆనాటికి 85 శాతం పైన వుండి కూడా ఈ దేశంలో కోరుకున్న వుమ్మడి పౌర స్మృతి ని తెచ్చుకోలేకపోవటం మన సెక్యులర్ రాజ్యాంగం డొల్ల తనాన్ని బయటపెట్టిందని చెప్పాల్సివుంది. అదేమీ హిందూ పౌర స్మృతి కాదని గుర్తించుకోవాలి. వాస్తవానికి ఆనాటి హిందూ సనాతన వాదులకు అది ఇష్టం లేదు. అలాగే తర్వాత వచ్చిన హిందూ కోడ్ బిల్లులు కూడా ఇష్టం లేదు. ఉదారవాదులు అధికంగా గల హిందూ సమాజం లో దేశప్రజలందరూ వుమ్మడి చట్టాల గొడుగులో వుండాలని కోరుకున్నారు. విచిత్రమేమంటే వుదారవాదులని , అభ్యుదయ వాదులని చెప్పుకునే వాళ్ళే ఆరోజు దీన్ని వ్యతిరేకించటం చూస్తుంటే భారత రాజకీయాల వైవిధ్యభరిత చిత్రపటం అవగతమవుతుంది. రాజ్యాంగ సభ మత రాజకీయాలకు స్వస్తి చెప్పే బంగారు అవకాశాన్ని కోల్పోయింది.

రాజకీయ అవకాశవాదం

అభ్యుదయవాదిగా ముద్రపడిన నెహ్రూ మతాలకతీతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హిందూ కోడ్ బిల్లు విషయం లో సనాతన వాదులు వ్యతిరేకించినా కాదని ధైర్యంగా ముందడుగు వేసి శభాష్ అనిపించుకున్నాడు. అదే ముస్లిం పౌర స్మృతి విషయం లో సనాతనవాదులకు తలొగ్గి సంస్కరణలకు తిలోదకాలివ్వటం దురదృష్టం. దానివలన ఎక్కువ నష్టపోయింది ముస్లిం మహిళలు. ఈ ద్వంద వైఖరే అప్పట్నుంచీ ఇప్పటివరకూ ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చాయి. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు పరిపాలన లో ఎన్నో జరిగాయి. చివరకు షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పుని కూడా కాలరాచి చట్టం ద్వారా సనాతనవాదుల్ని సంతృప్తి పరచటం వీరి అవకాశవాదానికి పరాకాష్ట. వీరి చర్యలవలన ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోయింది. మిగతా మతస్తులు ఆధునిక విద్యలో దూసుకు పోతుంటే ముస్లిం పిల్లలు మదరసాలలోనే విద్య నభ్యసించటం వారిని ఆధునిక పౌరులుగా తయారుచేయకపోవటమే. ముమ్మూరు తలాక్ లాంటి కరుడుగట్టిన పురుషాధిక్య సమాజం లో వుండటం వలన నష్టపోయింది ముస్లిం మహిళలే. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో వాళ్ళ బతుకులేమీ బాగుపడలేదు. బాగుపడిందల్లా రాజకీయనాయకులే. సచార్ కమిటీ నివేదిక తర్వాతైనా ముస్లిం మేధావుల్లో మార్పు రాకపోవటం శోచనీయం. సనాతన భావాలు గల మతపెద్దల మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది. ఒకవైపు ఈ అవకాశవాద రాజకీయాల వలన ముస్లిం లకు జరిగిన మేలు శూన్యమైనా రెండోవైపు ఈ బుజ్జగింపు రాజకీయాలతో మెజారిటీ హిందువుల్లో తమకన్యాయం జరుగుతుందని భావించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఈ వాదనను పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా తర్వాత తర్వాత ఒక చెవి అటు వేయటం మొదలయ్యింది.

హిందూ సమాజం జాగృతం దిశగా అడుగులేసింది

మొదట్లో నెహ్రూ ప్రభావం లో వున్న హిందూ సమాజం మెల్లి మెల్లిగా మార్పునకు లోనయ్యింది. సెక్యులరిజం పేరుతో  బుజ్జగింపు రాజకీయాలు చేయటాన్ని ఈసడించు కోవటం మొదలుపెట్టారు. మొదట్లో వీళ్ళు భారతీయ జన సంఘ్ రాజకీయ పార్టీ కింద, ఆర్ఎస్ ఎస్ సంస్థ కింద సమీకరించబడ్డారు. 1967 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అందులో జన సంఘ్ కూడా భాగస్వామి గా వుంది. తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించటం , ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో వుంచటం జరిగింది. 1977 ఎన్నికల్లో మొట్టమొదటిసారి జనతాపార్టీ అధికారం లోకి రావటం అందులో పూర్వ జన సంఘ్ కి చెందిన అటల్ బిహారి వాజపేయి , లాల్ కృష్ణ అద్వాని మత్రులుగా వుండటం తో కేంద్రం లో హిందుత్వ అనుకూల శక్తులు అధికారం లోకి వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనతా పార్టీ విడిపోవటం , పూర్వ జన సంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ ని స్థాపించటం జరిగింది. అప్పటికున్న  మూడు దశాబ్దాల అనుభవంతో జన సంఘ్ కి భిన్నంగా బిజెపి ని హిందువుల్లోని అన్నివర్గాల పార్టీగా మలుచుకోగలిగారు. వాజపాయి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగాడు. వాజపాయ్-అద్వాని జంట నాయకత్వం కింద మెల్లి మెల్లిగా హిందువులు సమీకరించబడ్డారు. కాంగ్రెస్ , మిగతా సెక్యులర్ పార్టీల బుజ్జగింపు రాజకీయాలు వీరికి కలిసొచ్చాయి.

అద్వాని పార్టీ యంత్రాంగ నిర్మాణం, వాజపాయి ప్రజాదరణ బిజెపి ని కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా తయారుచేసాయి. 1990 దశకం లో అద్వాని రధయాత్ర హిందూ సమాజం లో పెద్ద సంచలనమే లేపింది. అప్పటిదాకా బిజెపి ని ఆదరించని వర్గాలు కూడా అద్వాని ఉపన్యాసాలకు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి జన్మ స్థలం లో గుడి నిర్మాణం కోసం తను చేసిన వాదనలు హిందూ మతస్థులను ఆకర్షించాయి. ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర భారతం ఈ ప్రభావానికి లోనయ్యింది. ఈ ప్రచారం తో పాటు ఇన్ని సంవత్సరాలు మెజారిటీ హిందువులపై ప్రభుత్వాలు ఏ విధంగా వివక్ష చూపించింది సోదాహరణం గా వివరించటం తో ఈ రెండు ప్రాంతాల్లో హిందువులు బిజెపి కింద సమీకృత మయ్యారు. అదే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసింది. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. ఇదేదో కొద్దిమంది ఆర్ ఎస్ ఎస్ , విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూనుకొని చేసారనుకుంటే పొరపాటు. రాజకీయ పార్టీలు, మేధావులు ఇక్కడే పరిస్థితి ని అంచనా వేయటం లో పొరపాటు పడ్డారు.  ఈ రెండు ప్రాంతాల్లోని మెజారిటీ హిందువుల్లో  రామ జన్మ భూమి ఉద్యమం బలంగా పాతుకుపోయింది కాబట్టే వీళ్ళు ఈ పని చేయగలిగారు. మొదట్లో కొద్దిమంది కార్యకర్తల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచటం లో ఫలప్రదం అయ్యారు కాబట్టే ఈ పని చేయగలిగారు. మతం, మత విశ్వాసాలు సమాజంలో ఎంతో ప్రభావితం చూపిస్తాయనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఇది హిందూ సమాజం జాగృతం అయ్యింది కాబట్టే సాధ్యమయ్యింది.

21 వ శతాబ్దం లో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరణ

మొదటిసారిగా అటల్ బిహారీ వాజపాయ్ ప్రధానమంత్రిగా అయిదేళ్ళు పనిచేయటం ( 1999-2004) హిందూత్వ శక్తులకు ఊతం ఇచ్చింది. కొత్త ప్రాంతాలకు , కొత్త వర్గాలకు విస్తరించింది. అయితే మధ్యలో జరిగిన గోధ్రా సంఘటన , దాని పర్యవసానంగా జరిగిన గుజరాత్ అల్లర్లు మత సామరస్యానికి మాయని మచ్చ. అయినా ఆశ్చర్యంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ని తిరిగి తిరిగి ఎన్నుకున్నారు. ఆ సంఘటనను మెజారిటీ హిందువులు దురదృష్టకర సంఘటన గా భావించినా, జాతీయ మీడియా మోడీ ని బాద్యుడిని చేసినా గుజరాత్ ప్రజల్లో ఆ భావం ఏర్పడలేదు. అప్పుడు జరిగిన సంఘటనలను చర్య-ప్రతీకార చర్యలుగానే గుజరాత్ ప్రజలు భావించారు. అయినా ఈ సంఘటనలు నాగరిక సమాజం లో క్షంతవ్యం కాదు. మత ఉద్రిక్తతలు మానవత్వాన్ని మంట గలుపుతాయనే దానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు.

తర్వాత పది సంవత్సరాలు బిజెపి అధికారం లో లేకపోయినా హిందూత్వ వాదం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. యుపిఎ ప్రభుత్వం పై పెరిగిన అసంతృప్తి నేపధ్యం లో బిజెపి ని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూసారు. దానితోపాటు మోడీ గుజరాత్ లో చూపించిన అభివృద్ధి నమూనా ప్రజల్లో ముఖ్యంగా యువతని ఆకర్షించింది. 2014 ఎన్నికల్లో ఈ రెండూ కలిసి మోడీని పెద్ద మెజారిటీ తో గెలిపించాయి. అది హిందూత్వ వాదానికి పరాకాష్ట. కానీ మోడీ గెలవటానికి మాత్రం అభివృద్ధి మంత్రమే ప్రధానం. ఆ రోజునుంచీ హిందుత్వ వాదానికి మహర్దశ వచ్చిందని చెప్పొచ్చు. మోడీ దీన్ని జాతీయవాదం గా మార్పు చేయగలిగాడు. మోడీ ఆరు సంవత్సరాల పరిపాలన లో ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడటం జరగలేదు. తను తీసుకున్న సంక్షేమ పధకాలు అత్యంత పేదరికం లో వున్న ముస్లింల కే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ముమ్మూరు తలాక్ చట్టం తో, హాజ్ యాత్రకు మహిళలు ఒక్కరే వెళ్ళే పధకం తో ముస్లిం మహిళా సాధికారతకు పెద్దపీట వేసాడు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో మదరసా ల్లో ఆధునిక విద్యను ఖచ్చితంగా అమలుచేసే విధంగా మార్పులు చేసారు. ఇందులో ముస్లిం వ్యతిరేక చర్యలేమీ లేవు. ఓ విధంగా ముస్లిం లకు ఉపయోగపడేవే. అయితే ఇవేవీ ముస్లిం మత పెద్దలకు రుచించలేదు. కొంతమంది కింది స్థాయీ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనలనే భూతద్దం లో చూపించి మోడీ ముస్లిం వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నం చేసారు. మోడీ మాత్రం ప్రభుత్వం అందరినీ సమానంగానే చూస్తుందనే భావన కలిగించటానికి ప్రయత్నించాడు.

డిల్లీ అల్లర్లు మత ఉద్రిక్తతల సమాజానికి చిహ్నం 

అయితే వామపక్ష తీవ్రవాదులు, ఇస్లాం మతవాదులు ముస్లిం లలో మోడీ వ్యతిరేకత నూరిపోస్తూనే వున్నారు. చివరకు పౌరసత్వ సవరణ చట్టం వీరికి ఆయుధంగా మారింది. ముస్లిం సమాజం లో ఈ చట్టం పై అపోహలు కలిగించటం లో కొంతమేర సఫలీకృత మయ్యారు. దీనివలన దేశంలోని ముస్లిం ల పౌరసత్వానికి ముప్పు వస్తుందని ఆధారాలు లేని ఆరోపణలతో ముస్లిం లను రెచ్చగొట్టారు. దీని పరాకాష్టే డిల్లీ నిరసనలు. ప్రభుత్వం దీనిపై సంయమనం పాటించటం తో దీన్ని ఎలా ముగించాలో తెలియక అయోమయం లో వున్న సమయం లో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ఓ అవకాశంగా కన్పించింది. అంతర్జాతీయ సమాజం లో భారత్ ని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఇటీవలే పోలీస్ నివేదిక లో ఈ కుట్ర బహిర్గతమయ్యింది. అయినా అనుకున్న ప్రయోజనం నెరవేరింది. ట్రంప్ పర్యటన తో వచ్చిన అనేక అంతర్జాతీయ విలేకరులు దిల్లీ అల్లర్లు ముస్లిం లపై హిందువుల మూకుమ్మడి దాడిగా చిత్రీకరించటంతో వీరి ప్రయోజనం నెరవేరింది. వాస్తవానికి ఈ ఘర్షణల్లో ఇరువైపులా ప్రజలు చనిపోయారు. రెండు మతాలకు చెందిన ఆస్తులు ధ్వంసం అయ్యాయి. కానీ అంతర్జాతీయ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఘర్షణల్లో ఎప్పుడూ రెచ్చగొట్టే వాళ్ళు రెండువైపులా ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఇంకో ముఖ్యవిషయం . అమెరికా అధ్యక్షుడు పర్యటన లో వున్నప్పుడు అధికార పార్టీ వారు ఇటువంటి అల్లర్లు సృష్టిస్తారనేది లాజిక్ కి అందని విషయం.

చరిత్రలో మైలురాయి 

ఈ ఆరు సంవత్సరాల్లో జరిగిందేమిటంటే హిందూత్వ శక్తులు పునరుత్తేజం పొందాయి. చరిత్రలో తమకు జరిగిన అన్యాయాల్ని సరిదిద్దే పని ని భుజాన వేసుకున్నట్లు అర్ధమవుతుంది. దేశ ప్రయోజనాల విషయం లో అదివరకటి ప్రభుత్వాల కన్నాధృడంగా వ్యవహరించటం తో వీళ్ళ ప్రతిష్ట పెరిగింది. ఒక దేశానికి కావాల్సిన బలమైన జాతీయవాదాన్ని ప్రజల్లో తీసుకు రాగలిగారు. పరిపాలనా పరంగా అదివరకటి ప్రభుత్వాలతో పోలిస్తే మెరుగ్గా చేయగలమని నిరూపించారు. అవినీతి విషయం లో యుపిఎ తో పోలిస్తే తక్కువ అవినీతి ప్రభుత్వం గా ముద్ర వేసుకోగలిగారు. అదే సందర్భం లో బుజ్జగింపు రాజకీయాలు లేకుండా ఎలా పరిపాలించ వచ్చో చూపించారు. హిందూ భక్తుల మనోభావాలతో ముడి పడిన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించటం కూడా ఈ హిందూత్వ వాదానికి మరింత నైతిక బలం చేకూరింది. ఒకవిధంగా చెప్పాలంటే 1300 సంవత్సరాల తర్వాత తిరిగి హిందూ సమాజం ఉచ్చదశకి చేరిందని చెప్పొచ్చు. అతి ప్రాచీన నాగరికత కలిగిన , అతి ప్రాచీన మతమైన హిందూ మతం తిరిగి పునరుత్తేజం పొందటం వెనక ఆర్ ఎస్ ఎస్  కృషి ఎంతో వుంది. అది ఏర్పరిచిన పునాదిపైనే రాజకీయంగా మోడీ నాయకత్వాన బిజెపి హిందూ భావనతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచ గలిగింది. ఇది చరిత్రలో పెద్ద సంఘటన గా చెప్పుకోవల్సివుంది. ఇదీ పునరుత్తేజం చెందిన హిందూ సమాజ పురోగతి.

అంతమాత్రాన హిందూ సమాజానికి , అది ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి అంతా పూల బాట కాదు. మధ్యలో ఎన్నో సవాళ్లు, అవాంతరాలు, అవరోధాలు పొంచివున్నాయి. అవేమిటో వచ్చే భాగం లో చర్చించుకుందాం.