తెలంగాణరాజకీయాలు

హుజురాబాద్ కాంగ్రెస్ నుంచి నలుగురి పేర్లు?

TS Congress Strategy For Huzurabad

హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ స్తబ్ధుగా ఉంటోంది. మంచి స్పీడున్న నేతగా గుర్తింపు పొందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ విషయంలో ఎందుకు వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతుండగా అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థి ప్రకటన ఈనెల 16న చేస్తుండడంతో కాంగ్రెస్ పైనే ఒత్తిడిపెరుగుతోంది. అయితే అభ్యర్థి ఎంపికపై ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. దీంతో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై అభ్యర్థి ప్రకటన అనే గురుతర బాధ్యత పడింది. దీంతో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.

గత ఎన్నికలో హుజురాబాద్ నియోజవకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 60 వేల పైచిలుకు ఓట్లు సాధించి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. కానీ ఆసారి మాత్రం ఆ స్పీడు కనిపించడం లేదు. నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది. తమ అభ్యర్థి ప్రకటనపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే హుజురాబాద్ బరిలో వరంగల్ నేత కొండా సురేఖ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టైగర్ గా గుర్తింపు పొందిన ఆమె అయితేనే హుజురాబాద్ బరిలో సమ ఉజ్జీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను దామోదర రాజనర్సింహకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పలువురి పేర్లు పరిశీనలోకి తీసుకున్నట్లు సమాచారం. కొండా సురేఖతోపాటు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరును కూడా లెక్కలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే వరంగల్ నేత దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.

కొండా సురేఖ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఆమెకు టికెట్ కేటాయించలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆమె మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో హుజురాబాద్ బరిలో ఆమె అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆమె ఈటలపై సమ ఉజ్జీగా నిలుస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇక అధికార పార్టీ నుంచి కూడా అభ్యర్థి పేరు దాదాపు ఖరారై పోయినట్లే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్వీ రాష్ర్ట అధ్యక్షుడిగా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈనెల 16న హుజురాబాద్ పర్యటనలో ఆయన పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి, ముద్దసాని మాలతి, స్వర్గం రవి, కృష్ణమోహన్ రావు తదితర పేర్లు వినిపించినా చివరికి శ్రీనివాస్ యాదవ్ నే అదృష్టం వరించనున్నట్లు తెలుస్తోంది.

Back to top button