గెస్ట్ కాలమ్జాతీయంరాజకీయాలు

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కాంగ్రెస్ కి కనీస నైతిక నియమాలు పాటించాలనేది ఎప్పుడూ గుర్తుకురాదు. స్వాతంత్రం వచ్చిన కొత్త లో ఏమన్నా పాటించిందేమోగానీ తదనంతర చరిత్ర అంతా అధికారమే పరమావధిగా కొనసాగింది. నిన్నటికి నిన్న భారత-చైనా గొడవల్లో దేశం తలమునకలైవుంటే రాహుల్ గాంధీ మాత్రం మోడీని ఎలా ఇరకాటంలో పెట్టాలనేదానిమీదే అస్త్రాలు ఎక్కుపెట్టాడు. అయితే మోడీ తక్కువేమీ తినలేదు. గాంధీ కుటుంబం పెట్టిన మూడు ట్రస్టులపై విచారణ చేపట్టాడు. ఈ ట్రస్టు ల్లో నిధులు ఎలా ఖర్చయ్యాయనేది తేల్చే పనిలో మోడీ-అమిత్ షా ద్వయం నిమగ్నమయ్యింది. ఇంతకు ముందే జివికె రెడ్డి కుటుంబంపై కూడా సిబిఐ , ఇడి దర్యాప్తు చేపట్టారు. జివికె కుమారుడు సంజయ్ రెడ్డి కి కాంగ్రెస్ కోశాధికారి తిక్కవరపు సుబ్బరామి రెడ్డి కూతుర్ని ఇచ్చారు. సుబ్బరామి రెడ్డి కాంగ్రెస్ కి నిధులు సమకూర్చటం లో దిట్ట అని వేరే చెప్పనవసరం లేదు. జివికె కుటుంబం ముంబై విమానాశ్రయం లో మళ్లించిన వందల కోట్ల రూపాయల నిధుల్లో కాంగ్రెస్ నాయకులకు ఎన్ని ముడుపులు అందాయనేది తేల్చటానికే ఈ దర్యాప్తు  చేపట్టరనేది ఆనోటా ఈనోటా వినబడుతున్న మాట. ఒకవైపు రాబర్ట్ వాద్రాపై కేసులు, అహ్మద్ పటేల్ పై కేసులు రెండోవైపు ఈ కొత్త కేసులు వెరసి గాంధీ కుటుంబం చుట్టూ మోడీ-అమిత్ షా ద్వయం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. మోడీకి ఇంకా నాలుగు సంవత్సరాలు టైముంది. ఈ లోపల ఈకేసులన్నీ  ఓ కొలిక్కి వస్తాయి. ఇది గ్రహించే సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీలకు భయం పట్టుకుంది. అందుకే సమయం, సందర్భం లేకుండా నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నారు. మోడీ నిర్వహించిన అఖిలపక్ష వీడియో మీటింగ్ లో సోనియా గాంధీ తప్ప అందరూ దేశ భద్రతకు సంబంధించి మోడీకి బాసటగా నిలిచారు. సోనియా గాంధీ ఒంటరిదయ్యింది. రోజు రోజుకీ గాంధీ పరివారము బలహీనపడుతుంది.

అందుకే ఏదోవిధంగా మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఎత్తుగడ తీసుకున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాఫియా డాన్ వికాస్ దూబే 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అతన్ని పట్టుకోవటానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఇవ్వాళో, రేపో అతన్ని పట్టుకోవటమో, ఎన్ కౌంటర్ చేయటం ఖాయం. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంఘ విద్రోహక శక్తులు, రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయటం అందరికీ తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా ప్రత్యర్ధులు కులాల గుర్తింపు కార్డులు ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది పనిగట్టుకొని ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయే వారందరూ నిమ్న వర్గాలు , ముస్లింలు వున్నారని అగ్రకులాల వారు లేరని ప్రచారం చేస్తున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు ఈ ప్రభుత్వం లో అన్యాయానికి గురవుతున్నారని ప్రచారానికి తెరలేపారు. ఏదోవిధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలని అటు ఇటు ప్రత్యర్ధులు ప్రచారం చేయటం గమనార్హం.

ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణులు జనాభాలో 10 శాతానికి పైగానే వుంటారు. మన దక్షిణాదిలో లాగా కాకుండా వారు వ్యవసాయ వృత్తిలో గణనీయంగా వున్నారు. రాజకీయంగా మొదట్నుంచీ కాంగ్రెస్ మద్దతు ఓటు బ్యాంకుగా వుండేవారు. 2014 లో వీరందరూ బిజెపి వైపు మొగ్గు చూపారు. అప్పట్నుంచీ ఎలాగైనా తిరిగి పోయిన బ్రాహ్మణ ఓటు బ్యాంకు ని పొందాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ బ్రాహ్మణ నాయకుడి గా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద మాట్లాడుతూ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందని విమర్శించాడు. వాస్తవానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో 9మంది బ్రాహ్మణులు మంత్రులుగా వున్నారు. ఇటీవల ఒక జర్నలిస్టు చనిపోయిన కేసుని ఆసరాగా తీసుకొని జితిన్ ప్రసాద బ్రాహ్మణులను రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేయటం చూస్తుంటే కాంగ్రెస్ ఎంత నిస్పృహలో వుందో అర్ధమవుతుంది. ఇప్పుడు 8 మంది పోలీసులను కాల్చిచంపిన వికాస్ దుబే బ్రాహ్మణుడు కావటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. వికాస్ దుబే పై ఇప్పటికే 60కి పైగా క్రిమినల్ కేసులు వున్నాయి. తను సినిమా ఫక్కీ లో పోలీసుల్లో తన మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెప్పించుకొని డిఎస్పి తో సహా 8 మంది పోలీసులను మట్టు పెట్టటం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. చివరకు దీన్ని కూడా కులానికి జరిగిన అన్యాయంగా చిత్రించటం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. నేరస్థుల్లో కులాల్ని వెతికే సంస్కృతి అత్యంత ప్రమాదకరం. గాంధీ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిసే కొద్దీ ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి .

 

Tags
Show More
Back to top button
Close
Close