క్రీడలుప్రత్యేకం

ఐపీఎల్ ను కబళిస్తున్న కరోనా..!

బయో బబుల్ లోనూ ఆటగాళ్లను వదలని మహమ్మరి

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 3లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఒకేరోజు 4లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు రావడం మహమ్మరి ఉగ్రరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆస్ప్రతుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లు.. మందుల కొరత పట్టిపీడిస్తుండటంతో కోవిడ్ మరణాలు కూడా కొద్దిరోజులుగా దేశంలో అధికంగా నమోదవుతున్నాయి.

కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ఢిల్లీ.. కర్ణాటక.. మహారాష్ట్ర పూర్తిగా లాక్డౌన్ కాగా మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా కరోనా మహమ్మరి ఐపీఎల్ పై పంజా విసురుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను బయో బబుల్స్ లో ఉంచి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంతో ఖర్చు చేసి ఆటగాళ్ల విషయంలో నిర్వహాకులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మరి ఆటగాళ్లను వదలడం లేదు. దీంతో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

నేడు కొలకత్తా నైట్ రైడర్స్.. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉంది. కొలకత్తా జట్టుకు చెందిన వరుణ్.. సందీప్ అనే ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్ ను వాయిదా వేశారు. మ్యాచ్ ముందుగా కరోనా టెస్టులు చేయగా ఈ విషయం వెలుగులోకి రావడంతో నిర్వహాకులు అప్రమత్తమై మ్యాచ్ ను నిలిపివేశారు.

ఈ మ్యాచ్ ఎప్పుడు నిర్వహాస్తారనేది కూడా ప్రకటించలేదు. ఇటీవలే ఆస్ట్రేలియా దేశం సైతం తమ ఆటగాళ్లు భారత్ నుంచి రావాలని కోరింది. దీనిపై ఐపీఎల్ నిర్వాహకులు సైతం ఆటగాళ్లు ఎవరు వెళ్లినా ఐపీఎల్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజాగా ఆటగాళ్లు కరోనా బారినపడటం.. మరోవైపు దేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు విన్పిస్తుండటంతో ఐపీఎల్-2021 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Back to top button