కరోనా వైరస్జాతీయం

ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం

Corona High In India
కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని మరోసారి ఠారెత్తిస్తోంది. రోజురోజుకూ లక్షలాది కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్‌ నడుస్తున్నా.. ఇంకోవైపు కేసుల ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. కరోనా కట్టడికి ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూలు అమల్లోకి తెచ్చాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో వీకెండ్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే మూడు రాష్ట్రాల్లోనే కేసులు మరింత భయపెడుతున్నాయి.

ఈ రెండో దశలో ముందుగా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్న ఉధృతి.. ఆతర్వాత చాప కింద నీరులా అన్నిరాష్ట్రాలకు పాకింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే రోజుకు లక్షకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి.

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,17,353 కేసులు వెలుగు చూస్తే.. అత్యధికంగా మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్‌లో 22,339, ఆ తర్వాత ఢిల్లీలో 16,699 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇక మరో 16 రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే 97 వేలకు పైగా క్రియాశీల కేసులు వచ్చాయి. ఇందులో 40 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా.. చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, కేరళలోనూ అత్యధిక స్థాయిలో యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1185 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర 349, చత్తీస్‌గఢ్‌లో 35 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

Back to top button