జాతీయంరాజకీయాలు

మహమ్మారి విజృంభణ.. బ్రెజిల్ ను దాటేసిన భారత్

Covid-19 India
భారత్ కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మొదటిదశలో అదుపులో ఉన్న మహమ్మారి రెండో దశలో తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదు అవ్వగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెండు లక్షల దిశగా సాగుతోంది. ఇంకొన్నాళ్లు ఇలానే సాగితే భారత్ లో వైరస్ ను అదుపుచేయడం కష్టమని నిపుణులు అంటున్నారు. నిన్నటిదాకా కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్… ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. మొత్తం 13.53(1.35కోట్లు) మిలియన్ల కరోనా కేసులతో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకూ 13.45 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా.. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 31.2మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం భారత్ లో ఉన్న యాక్టివ్ కేసుల్లో 70.82శాతం కేసులు మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,కర్ణాటక,ఉత్తరప్రదేశ్,కేరళ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నవే. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 48.57 శాతం యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ప్రతీరోజూ నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ల నుంచే 80.92 శాతం కేసులు నమోదవుతున్నాయి.

ఢిల్లీలో ఆదివారం(ఏప్రిల్ 12) ఒక్కరోజే అత్యధికంగా 10,774 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పరిస్థితులు అత్యంత ప్రమా దకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది కాబట్టి… లాక్‌డౌన్ ద్వారా కరోనాను కట్టడి చేసే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.

ఈ నెల 11 నుంచి 14వరకూ దేశవ్యాప్తంగా ‘టీకా ఉత్సవ్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో… ఇప్పటివరకు 27లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రమంత్రి హర్షవర్దన్ తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లోని 50 జిల్లాల్లో కరోనా నిబంధనలు సరిగా అమలుకావట్లేదని సెంట్రల్ టీమ్ కేంద్రానికి రిపోర్ట్ చేసింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… ఇందులో మహారాష్ట్రలో 63,294 కేసులు,ఢిల్లీలో 10,774 కరోనా కేసులు నమో దయ్యాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 349 మంది చనిపోగా.. ఢిల్లీలో 48 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 34,07,245కి చేరింది.

Back to top button