ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

రోజాకు మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశం జగన్ కు ఉందా? లేదా?

YCP MLA Rojaవైసీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ ఆశావహులను ఊరిస్తూనే ఉంది. దీంతో రెండున్నరేళ్లుగా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు నెలల పాటు ఈ తంతు ఉండదనే విషయం తెలియడంతో అందరిలో నైరాశ్యం పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. దీంతో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. సీఎం జగన్ ఆమెను తన చాంబర్ కు పిలిపించుకుని వచ్చే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కేటాయించారు. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఎమ్మెల్యేలకు జంట పదవులు ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఊడగొట్టారు. దీంతో రోజాలో అసంతృప్తి కలుగుతోంది.

సామాజిక సమీకరణల్లో భాగంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి అనే ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రోజాకు మంత్రి పదవి దక్కలేదనే విషయం తెలుసు. ఇందులో రెడ్డి సామాజిక వర్గమైన రామచంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తేనే రోజాకు అవకాశం వస్తుంది. కానీ ఆయనను తప్పించే ఉద్దేశం సీఎం జగన్ కులేదన్నది తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రోజా ఆశలు అడియాశలేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదనే తెలుస్తోంది. ఈ సందర్భంలో ఆమె మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు సముచిత స్థానం దక్కుతుందో లేదో అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఓ ఆట ఆడుకున్న రోజాకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే విషయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించిన ఆమెకే పదవులు దరికి రావడం లేదు. దీంతో భవిష్యత్తులో అసంతృప్తి ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు సీఎం జగన్ కు రోజాకు మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

 

Back to top button