కరోనా వైరస్

వివాదంగా మారిన విరాళాలు!


కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ఆదాయాన్ని కోల్పోవడంతో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన సంస్థలు, సేవా సంస్థలు, వ్యక్తి గత విరాళాలు అందజేయాలని ప్రభుత్వం కోరింది. ఏ మేరకు పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తులు ఇప్పటి వరకు రూ.173 కోట్ల విరాళాలను ప్రభుత్వానికి అందజేశారు. ఇంత వరకూ అధికారికంగా సాగింది. విరాళాల మొత్తం ప్రభుత్వ ఖాతాకు జమ అయ్యింది. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలో విరాళాలు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది.

కరోనపై పోరులో భాగంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సాయమందించేందుకు నియోజకవర్గ పరిధిలోని రైతులు, పరిశ్రమల యజమానులు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ఏజెన్సీల నుంచి విరాళాలు బలవంతంగా వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెయ్యి బస్తాల ధాన్యం, ఆక్వా రైతులు ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేలు, రొయ్యల హేచరీ నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, కావాలి నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకులు వారి సొంత ట్రస్టు ఖాతాలోకి నగదు మళ్లించుకుని తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అడ్డగోలు విరాళాల వసూళ్ళను తెలుగుదేశం పార్టీ సైతం తప్పుపట్టింది. అన్ని రంగాలు విపట్టును ఎదుర్కొంటుంటే సి.ఎం.ఆర్.ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలంటూ వత్తిడి తేవడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇటువంటి అరాచకాలు మానుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ విరాళాలు వివాదంగా మారాయి.

Also Read: మోడీ ప్రభుత్వం పై విమర్శల్లో నిజమెంత?
జగన్ గ్రామ కార్యదర్శుల వ్యవస్థ కుప్పకూలిందా!