తెలంగాణరాజకీయాలు

మంత్రి గంగులకు షాక్.. ఏకంగా రూ.360 కోట్ల జరిమానా

Gangula Kamalakarబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన గ్రానైట్ కంపెనీపై ఈడీ కొరడా ఝుళిపించింది. రూ.360 కోట్ల మేర జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు తాము చట్టబద్దంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని బుకాయించిన మంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ రూ. కోట్ల సంపదను దేశం దాటిస్తూ పబ్బం గడుపుకుంటున్న దొంగ వ్యాపారం గుట్టు రట్టయింది. కరీంనగర్ జిల్లాలో తొమ్మిది గ్రానైట్ క్వారీల నుంచి రూ.750 కోట్ల మేర వసూలు చేయాలని గనుల శాఖ ఈడీ ఆదేశాలు జారీ చేయడంతో ఇక చేసేది లేక పెనాల్టీ కట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగి ఏపీ, తమిళనాడులోని వివిధ పోర్టుల్లో క్షేత్రస్థాయి విచారణ జరిపి గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చింది. కరీంనగర్ జిల్లాలో గనుల శాఖ ఇచ్చిన అనుమతులకు మించి గ్రానైట్ ను తవ్వి తరలించడం ద్వారా ప్రభుత్వానికి రూ.124.94 కోట్ల మేర సీనరేజీ ఎగబెట్టిన తొమ్మిది గ్రానైట్ ఏజెన్సీలకు బుధవారం నోటీసులు జారీ చేసింది.

సీనరేజీ నిధులతో పాటు దానికి ఐదు రెట్లు కలిపి రూ.749.66 కోట్ల జరిమానా విధించింది. ఇందులో గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్ కు ఏకంగా రూ.360 కోట్లు జరిమానా విధించడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ లో సంచలనం రేగుతోంది. మంత్రి గంగుల గ్రానైట్స్ తోపాటు మరో ఎనిమిది గ్రానైట్ కంపెనీలు 2008 నుంచి 2011 వరకు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాయి. ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రూ124.94 కోట్ల దాకా ఎగవేశారు.దీనిపై ఎంపీ బండి సంజయ్ 2019లో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కరీంనగర్ కు చెందిన వైఎస్సార్ సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశారు.

వివిధ కంపెనీలు గ్రానైట్ ను ఇతర దేశాలకు ఎంత పరిమాణంలో ఎగుమతి చేస్తున్నాయో వివరాలు తెలుసుకున్న ఈడీ అధికారులు కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ రేవుల వద్ద ఉన్న రికార్డులతో పోల్చి చూశారు. దీంతో గ్రానైట్ కంపెనీలు చెప్పిన లెక్కలకు క్షేత్ర స్థాయిలో ఉన్న లెక్కలకు తేడా ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేల్చారు.

Back to top button