జాతీయంరాజకీయాలుసంపాదకీయం

ప్రజలకు అధికారం దిశగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ చర్యలు

పంచాయతీ వ్యవస్థ పటిష్టం పై ప్రభుత్వ దృష్టి

జమ్మూ-కాశ్మీర్ లో 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370, 35ఎ రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్పు స్వతంత్రభారత చరిత్రలోనే అతిపెద్ద మార్పు. ఆతర్వాత జమ్మూ-కాశ్మీర్ శాంతిభద్రతలో గుణాత్మక మార్పు సంభవించింది. అందరూ అనుకున్నట్లు అక్కడేదో మొత్తం అల్లకల్లోలం జరుగుతుందని, ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుందని కొన్ని రాజకీయపార్టీలు,కొంతమంది మేధావులు వ్యాఖ్యానించారు. అవును అల్లకల్లోలం జరిగింది. అప్పడిదాకా స్వేచ్చగా కార్యకలాపాలు నిర్వహించిన ఉగ్రవాద మూకలు కన్నంలో దాక్కున్నాయి. తలదాచుకోవటం కష్టమై నానా కష్టాలు పడుతున్నారు. ఒకనాడు హీరోలు ఇప్పుడు జీరోలయ్యారు. నిర్బంధించిన రాజకీయ ప్రముఖులందరినీ విడుదల చేసారు. అయినా మొత్తం ప్రజలు తిరుగుబాటు చేయలేదు. ప్రజల్ని రెచ్చగొట్టటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుప్కార్ ప్రకటన పేరుతో అన్ని పార్టీలు, గ్రూపులు ఒకటయ్యాయి. ఇందులో ప్రత్యక్షంగా చేరకపోయినా కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చింది. సిపిఎం యధావిదిగానే అందులో పాల్గొంది. ఇంతకీ వీరి తీర్మానం సారాంశం ఏమిటంటే తిరిగి ఆర్టికల్ 370 ని పునరుద్ధరించేదాకా వుద్యమిస్తారట. ఇది ఆచరణలో సాధ్యమేనా? కాశ్మీర్ ప్రజల్ని ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు?పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత భారత చట్టాలన్నీ జమ్మూ-కాశ్మీర్ లో అమలుచేసిన తర్వాత తిరిగి పార్లమెంటులో ఆ ఆర్టికల్ ని పునరుద్దరించటం జరిగే పనేనా? ఏమాత్రం మెడ మీద తల వున్నవాడికైనా ఇది సాధ్యం కాదని అర్ధమవుతుంది. మరి ఇన్నాళ్ళ అనుభవమున్న రాజకీయనాయకులకు అర్ధం కావటం లేదంటే నమ్మాలా? నిన్నటికి నిన్న మహబూబా ముఫ్తీ కాశ్మీర్ జెండా ఎగిరేవరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనని చెప్పటం చూస్తే వీళ్ళకు దేశంలో ఏ మాత్రం సానుభూతి వున్నా దాన్ని కూడా పోగొట్టుకోవటమే. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలాగా అయ్యింది. గుప్కార్ ప్రకటనకి మద్దత్తు తెలిపి ఇప్పుడు మహబూబా ముఫ్తీ ప్రకటనతో అసలుకే మోసమొచ్చింది. బీహార్ ఎన్నికల్లో మోడీ ఈ సమస్యను లేవనెత్తి కాంగ్రెస్ ని మరింత ఇరకాటంలో పడేసాడు. సరే ఇక మన టాపిక్ లోకి వద్దాం.

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు

జమ్మూ-కాశ్మీర్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ మొదట్నుంచీ బలహీనంగా వుంది. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించటం జరగలేదు. 2011కి ముందు ఏకంగా 30 సంవత్సరాలు ఎన్నికలే జరగలేదు. 2016లో జరగాల్సిన ఎన్నికలు గవర్నర్ చెప్పినా వాయిదా వేస్తూ వచ్చింది మహబూబా ముఫ్తీ. చివరకి 2018 జూన్ లో మహబూబా ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్టోబర్ లో మున్సిపల్ ఎన్నికలు,నవంబర్ -డిసెంబర్ ల్లో పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు ఎన్నికల్ని పిడిపి,నేషనల్ కాన్ఫరెన్సు బహిష్కరించాయి. అయినా ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. దక్షిణ కాశ్మీర్ లో తప్పితే మిగతా చోట్ల ఎన్నికైన పాలక మండళ్ళు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2019 అక్టోబర్ లో (అంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత) బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేషనల్ కాన్ఫరెన్సు, పిడిపిలకు పంచాయతీ వ్యవస్థలపై విశ్వాసం లేదు. వీరి ట్రాక్ రికార్డ్ అధ్వానంగా వుంది.

ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు ఖాళీగా వున్నఒక వెయ్యికి పైగా సర్పంచ్ పదవులకు,12 వేలకు పైగా వున్న పంచ్ లకు (అంటే మన వార్డు సభ్యులు) ఎన్నికలకు తయారవుతుంది. దానితోపాటు జిల్లా స్థాయిలో పంచాయతీ వ్యవస్థ బలోపాతానికి నడుంబిగించింది. జిల్లా అభివృద్ధి సమితులకు నియమ నిబంధనలు ఖరారు చేసింది. ఇప్పటివరకు ఇవి మంత్రుల, ఎంఎల్ ఎ ల కబంధ హస్తాల్లో కొనసాగుతూ ఉండేవి. స్వతంత్రంగా పనిచేసే అవకాశమే లేదు. అందుకోసం ఓ వారం క్రితం 1989 జమ్మూ,కాశ్మీర్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసింది. అలాగే 1996 జమ్మూ,కాశ్మీర్ పంచాయతీరాజ్ నిబంధనలను కూడా మార్చింది.

జిల్లా అభివృద్ధి సమితులు, జిల్లా ప్రణాళిక కమిటీలు 

మన జిల్లా పరిషత్ లకు మారుపేరే ఈ జిల్లా అభివృద్ధి సమితులు. జమ్మూ, కాశ్మీర్ లో మొత్తం 20 జిల్లాలున్నాయి. అందులోని పట్టణ ప్రాంతాలను మినహాయించి మిగతా గ్రామీణ ప్రాంతాలకు ఈ జిల్లా అభివృద్ధి సమితులు పనిచేస్తాయి. ప్రతి జిల్లాని ఇందుకోసం 14 ప్రాంతీయ నియోజకవర్గాలుగా (మన జెడ్ పిటి సి లు లాగా) విభజిస్తారు. ఆ పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే అందులో స్త్రీలకు,షెడ్యూలు కులాలకు, తెగలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. అంటే 73,74 రాజ్యాంగ సవరణలను జమ్మూ, కాశ్మీర్ లో కూడా అమలుచేస్తున్నారన్నమాట. దీనితో ఈ స్థానాలకు రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా వర్తిస్తాయి. ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకొని ఏదయితే నిమ్న వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేశారో ఆ గ్యాప్ ని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మరి దీనిపై గుప్కార్ ప్రకటన భాగస్వాములు ఏమి చెబుతారో? అందులో దళితులను గురించి ఎక్కువగా మాట్లాడే సిపిఎం కూడా వుంది. ఇన్నాళ్ళు ఈ రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయలేదో చెప్పగలరా? దీనిని సమర్ధించే కాంగ్రెస్ చెప్పగలదా?

ఇక ఈ జిల్లా అభివృద్ధి సమితుల స్వరూపం ఎలా ఉండబోతుంది? 14 ప్రాంతీయ నియోజకవర్గ సభ్యులు, ఆ జిల్లా ఎంఎల్ ఎ లు, బ్లాక్ అభివృద్ధి సమితుల చైర్ పర్సన్ లు  సభ్యులుగా వుంటారు. కానీ జిల్లా అభివృద్ధి చైర్ పర్సన్, ఉప చైర్ పర్సన్ లను ఈ 14 మంది మాత్రమే ఎన్నుకుంటారు. అలాగే వారిని తొలగించాలన్నా వారికే అధికారం వుంది. ఎం ఎల్ ఎలకు లేదు. అదేసమయంలో సమావేశాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పై అందరి సభ్యులకు ఓటింగ్ హక్కులు వుంటాయి. దీనిపై ఈ గుప్కార్ ప్రకటన భాగస్వాములు గుర్రుగా వున్నారు. ఇంతకుముందులాగా మంత్రులు, ఎంఎల్ ఎ ల కనుసన్నల్లో వీళ్ళ పదవులు లేవు. అదీ వీరి కోపానికి కారణం. మరి దీనిపై స్థానిక సంస్థల స్వతంత్రని కోరుకొనే సిపిఎం ఏమంటుంది? కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రాజీల పేరుతో సర్దుకుపోవాలి కదా?

వీటితోపాటు జిల్లా ప్రణాళిక కమిటీలు కూడా వేస్తున్నారు. ఇందులో సభ్యులుగా ఆప్రాంత ఎంపి, ఎంఎల్ఎలు, జిల్లా అభివృద్ధి సమితుల చైర్ పర్సన్ లు, పట్టణ/జిల్లా మున్సిపల్ కమిటీ చైర్ పర్సన్ లు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు సభ్యులు గా వుంటారు. ఎంపి అధ్యక్షుడుగా వుంటారు. ఆజిల్లాకి సంబంధించిన అభివృద్ధి ప్రణాలికను ఈ కమిటీ లలో నిర్ణయిస్తారు. ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తూ ఇదివరకు రాజకీయాలకోసం ప్రజాస్వామ్యం, ఇప్పుడు అభివృద్ధి, సుపాలన కోసం ప్రజాస్వామ్యమని చెప్పాడు. ఇది అక్షరాల నిజం. స్థానిక సంస్థలు స్వతంత్రంగా పనిచేయగలిగినప్పుడే ఆ ఫలాలు ప్రజల దగ్గరకు చేరతాయి. ఈ మార్పులు ఇన్నాళ్ళు రాజకీయాధికారంతో బొక్కసాలు నింపుకున్న వారికి కంటగింపుగానే వుంటుంది. వాళ్ళ సీటు కిందకు నీళ్ళు వస్తున్నాయనే బాధ లోలోపల మసులుతుంది. అదీగాక కేంద్రప్రభుత్వం పంచాయితీలకు నేరుగా నిధులివ్వటం కూడా వీళ్ళకు కంటగింపు గా వుంది. జమ్మూ,కాశ్మీర్ లో స్థానిక సంస్థల బలోపేతమే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన ఆలోచన. ఆపని ప్రభుత్వం చేస్తుంది.

ఈ జిల్లా అభివృద్ధి సమితుల ఎన్నిక ప్రక్రియ అత్యంత కీలకం 

ప్రభుత్వం తలపెట్టిన ఈ ఎన్నిక ప్రక్రియ జమ్మూ,కాశ్మీర్ రాజకీయ పరివర్తనలో అత్యంత కీలకం. మొత్తం గ్రామీణ ప్రాంత ప్రజానీకం ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వుంది. అయితే దీన్ని ప్రభుత్వం ఏ మేరకు దిగ్విజయంగా నెరవేర్చ గలుగుతుందనే దానిపై జమ్మూ, కాశ్మీర్ భవిష్యత్తు ఆధారపడివుంది. ఇప్పటికే దీనిపై మహబూబా ముఫ్తీ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్పింది. మిగతా గుప్కార్ భాగస్వాములు నోరు మెదపలేదు. నిన్నటి సమావేశం లో ఫరూక్ అబ్దుల్లాని చైర్మన్ గా, మహబూబా ముఫ్తీని వైస్ చైర్ పర్సన్ గా, సిపిఎం నాయకుడు మహమ్మద్ తరిగామిని కన్వీనర్ గా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్ లోనేని అధికార ప్రతినిధిగా ప్రకటించారు. కానీ ఈ ఎన్నికపై ఏమీ నోరు విప్పలేదు. చూడబోతే ముందుగానే ప్రకటన చేసి ఆవిడ తన స్వంత  ఎజండాని అందరిపై రుద్దినట్లయ్యిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ గుప్కార్ భాగస్వాములు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తే ప్రభుత్వం ఏమేరకు ఎన్నికల్ని దిగ్విజయంగా నిర్వహించ గలుగుతుందో అనేది చర్చనీయాంశం. ఇంతకుముందు 2018 పంచాయతీ ఎన్నికల్ని కూడా రెండు ప్రధాన పార్టీలు బహిష్కరించాయి. అప్పుడు జమ్ములో దాదాపు 83 శాతంతో విజయవంతమైనా కాశ్మీర్ లో కేవలం 41 శాతం మంది మాత్రమే పాల్గొన్నారు. ఈసారి 2019 ఆగస్టు 5 వ తేదీ పరిణామం తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నికలివి. జమ్ములో ఖచ్చితంగా విజయవంతమవుతాయి. కాశ్మీర్ లోయలో ఎలా జరుగుతాయో వేచి చూడాలి. ఈ పార్టీలు కేవలం బహిష్కరిస్తాయా లేక ఉగ్రవాదులతో కుమ్మకై హింసను రెచ్చగొడతాయా అనేది చూడాలి. ముఖ్యంగా మహబూబా ముఫ్తీ దక్షిణ కాశ్మీర్ కి చెందిన నాయకురాలు. ఆవిడ ప్రాంతమే ఉగ్రవాదులకు అడ్డా. వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా ఎప్పుడూ ఆవిడ ప్రకటనలు వుంటాయి, అందుకే అనుమానాలు వున్నాయి. వేచి చూద్దాం ఏం జరగబోతుందో.

Back to top button