తెలంగాణరాజకీయాలు

ఈట‌ల నినాదం ఇదే..?

Etela Rajenderభ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ వైపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వేగంగా అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన రెండు రోజుల వ‌ర‌కు కేసీఆర్ ను ప‌ల్లెత్తు మాట అన‌కుండా వ్యూహాత్మ‌కంగా ఉన్న ఈట‌ల‌.. ఆ త‌ర్వాత వెంట‌నే గేర్ మార్చారు. కేసీఆర్ ల‌క్ష్యంగా ఎదురు దాడి మొద‌లు పెట్టారు. జైల్లో పెడ‌తారా? దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ డైరెక్ట్ అటాక్ తో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి.

అయితే.. కొంత‌ మంది ఆయ‌న బీజేపీలోకి వెళ్లొచ్చ‌ని అంచ‌నా వేశారు. చాలా మంది ఆయ‌న కొత్త పార్టీ పెట్టే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం ఈట‌ల కొత్త పార్టీ పెట్ట‌డానికే సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొని, ఆ త‌ర్వాత ఆద‌ర‌ణ కోల్పోయిన నేత‌లు ఇప్ప‌టికే.. ఈట‌ల‌తో ట‌చ్ లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు.. ముదిరాజ్ సంఘాలు రాష్ట్ర‌వ్యాప్తంగా ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. నిజ‌మైన నేత‌కు కేసీఆర్ ఉద్దేశ‌పూర్వ‌కంగా అన్యాయం చేస్తున్నార‌నే సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఈట‌ల సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్ వ‌రకే ఈ ప‌రిస్థితి ఉంటుంద‌ని టీఆర్ఎస్ అధిష్టానం భావించింద‌ని, కానీ.. రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ద‌లిక రావ‌డాన్ని ఊహించ‌లేకోయింద‌ని చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో దూకుడు పెంచిన ఈట‌ల‌.. టీఆర్ఎస్ లో ఆద‌ర‌ణ కోల్పోయిన నేత‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో లేనివారంతా.. ఇవాళ ప‌ద‌వులు అనుభ‌విస్తున్నార‌నే విష‌యాన్ని బ‌లంగా ముందుకు తీసుకెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌. తెలంగాణ‌లో మ‌ళ్లీ దొర‌ల పాల‌న కొన‌సాగుతోంద‌ని, రాష్ట్రం వ‌చ్చిన ఉప‌యోగం లేకుండా పోయింద‌ని జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌.

తెలంగాణ కేవ‌లం ఉద్య‌మ‌కారుల ఆస్తిమాత్ర‌మేన‌ని చాటి చెప్పాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో ఆత్మ‌గౌర‌వం లేకుండాపోయింద‌ని, దాన్ని సాధించాలంటే తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం మొద‌లు పెట్టాల్సిందేనని జ‌నాల్లోకి వెళ్ల‌బోతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.

Back to top button