కరోనా వైరస్

కరోనా సోకుతుందని భయపడుతున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా కరోనా బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. కరోనా నిర్ధారణ అయితే చాలామంది భయం, ఆందోళనకు గురవుతున్నారు.

మాస్క్, వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో నెలలు గడుస్తున్నా అనేక సందేహాలు నెలకొన్నాయి. సెకండ్ వేవ్ లో జ్వరం, పొడిదగ్గు, గొంతు నొప్పి, వాసన గ్రహించలేకపోవడం, రుచి కోల్పోవడం, తలనొప్పి, నీరసం, ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి కరోనా నిర్ధారణ అయితే మిగిలిన వాళ్లు సైతం కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిది. కరోనా సోకిన వ్యక్తి మాస్క్ పెట్టుకుని బాత్ రూమ్ ను వినియోగించాలి.

ఆ తరువాత బాత్ రూమ్ ను డెటాల్ లేదా శానిటైజర్ తో శుభ్రం చేయాలి. ఒకరికి వైరస్ సోకినా ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్లంతా మాస్క్ లు ధరించాలి. వైద్యుల సూచనలతోనే విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రోగులు వ్యాయామం చేయకుండా వీలైనంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. కరోనా సోకకుండా మూడు లేయర్లు ఉన్న మాస్క్ పెట్టుకుంటే మంచిది.

ఇష్టానుసారం విటమిన్ ట్యాబ్లెట్లు వాడినా ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. కరోనా రోగులు ఆవిరి పట్టుకోవడంతో పాటు గోరువెచ్చని నీటిని తాగాలి. ఏ కరోనా లక్షణం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలి.

Back to top button