ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జగన్‌పై పోరాటం..! ఆ ఎంపీ వెనుక ఉన్నది ఎవరు..?

AP CM
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలనం అయ్యారు. వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆయన.. ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితో వైరం సాగిస్తున్నారు. ఎంతలా అంటే.. సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని.. అప్పటివరకూ తాను ఏపీ గడప తొక్కబోనని సీబీఐకి ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లారు. ప్రారంభంలో ఆయన సీఎం జగన్‌ను ఏమీ అనే వారు కాదు. అంతా ఆయన పక్కన ఉన్న సలహాదారులు చేస్తున్నారని.. వారి పనులను సీఎం కరెక్ట్ చేసుకోవాలని సలహాలిచ్చేవారు. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా రూటు మార్చారు. డైరెక్ట్‌ సీఎం జగన్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. తనకు పిలిచి పార్టీ టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేసిన జగన్ పట్ల.. రఘురామరాజులో ఎందుకు ఇంతలా అసంతృప్తి పెరిగింది. అది వ్యక్తిగత వైరం స్థాయికి ఎందుకు మారుతోందనేది ఎవరికీ అర్థం కాని అంశం.

రఘురామకృష్ణరాజు రోజురోజుకూ జగన్‌ పై రెచ్చిపోతున్నారు. జగన్‌ రాముడో.. రావణుడో తేల్చేదాకా తాను ఏపీకి వచ్చేది లేదంటూ శపథం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన వైసీపీతో విభేదించినప్పటి నుంచే నర్సాపురం వెళ్లడం లేదు. ఇందుకు గల కారణాలు సైతం ఆయన చెప్తూ వస్తున్నారు. తనపై దాడులు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. కేంద్రం నుంచి సెక్యూరిటీ తీసుకున్నారు. మరోసారి అరెస్టు కోసం దొంగ కేసులు పెట్టారని కోర్టుల నుంచి రక్షణ పొందారు. ఇప్పుడు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయించేవరకూ వెళ్లనని పట్టుబట్టారు. ప్రతీ సారి ఆయన జగన్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

మరో అడుగు ముందుకేసి.. వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపినట్లే.. తనను చంపడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని రఘురామరాజు నేరుగా ప్రధానికే లేఖ రాశారు. పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తానంటున్నారు. మరి రియల్‌గా ఆయన పరిస్థితి అలా ఉందా అంటే.. అంచనా వేయలేకుండా ఉంది. అయితే.. చాలా మంది నోరు తెరవడానికి కూడా భయపడుతున్న సమయంలో రఘురామరాజు మాత్రం పోరాడుతున్నారు. రఘురామరాజు నర్సాపురం వస్తే అరెస్ట్ చేయడానికి నిజంగానే కేసులు పెట్టారు. ఏపీలో ఇష్టం లేని వారిని అరెస్ట్ చేయడానికి నేరాలు చేసి ఉండాల్సిన పని లేదు. ఎవరో ఒకరు ఇచ్చే ఫిర్యాదుతో ముందుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తర్వాతి సంగతి తర్వాత అన్నట్లుగా చూస్తారు.

అయితే.. ఇప్పుడు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేయడంతో మరింత వైల్డ్‌గా తనపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామరాజు ఆరోపిస్తున్నారు. ఇది మరింత తీవ్రమైన ఆరోపణలుగా మారాయి. ఈ రఘురామరాజు ఎవరో కాదు.. వైఎస్‌ ఆత్మ అయినటువంటి కేవీపీ వియ్యంకుడే. జగన్‌తో ఆయనకు మొదట్లో సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరి మధ్య అంతకంతకూ వైరం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వర్షం ముందు ముందు తుఫానులా మారే అవకాశాలూ లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Back to top button